ముంబై: ఇరాన్ మహిళల ఆందోళనలకు మద్దతుగా నటి ఊర్వశి రౌటెలా తన జుట్టు కత్తిరించుకుంది. జుట్టు కత్తిరించుకుంటున్న ఫొటోను సోమవారం తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్టు చేసింది. ఇరాన్లో మాషా అమిని మృతికి నిరసనగా ఆందోళనలు చేస్తున్న మహిళలు, బాలికలు ఎంతో మంది పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని, అక్కడి మహిళలు, బాలికలకు మద్దతుగా తాను జుట్టు కత్తిరించుకున్నానని రౌటెలా ఆ పోస్టులో పేర్కొన్నది.
వస్త్రధారణ సాంప్రదాయబద్ధంగా లేదన్న కారణంతో ఇరాన్లో సెప్టెంబర్ 13న మాషా అమిని అనే 19 ఏండ్ల యువతిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆమె పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై ఇరాన్లో మహిళలు, బాలికలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లను తీసేసి ఆందోళనలకు దిగారు. మాషా అమిని హత్యకు నిరసనగా తమ జుట్లు కత్తించుకున్నారు. ఈ ఆందోళనలను అణిచేందుకు ప్రభుత్వం చేయించిన పోలీస్ దాడుల్లో ఇప్పటివరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ఊర్వశి రౌటెలా జుట్టు కత్తిరించుకుని మద్దతు తెలిపింది. ఇన్‌స్టాలో ఫొటోతోపాటు పోస్ట్ చేసిన మెసేజ్‌లో మహిళల అందానికి జుట్టు సంకేతమని పేర్కొంది. అలాంటిది సమాజం ఇస్తున్న అందం అనే ప్రమాణం తమకు అక్కర్లేదని మహిళలు పబ్లిక్‌గా జుట్టు కత్తిరించుకుంటున్నారని రాసుకొచ్చింది. తాము ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా బతకాలో అనేది ఎవరో నిర్ణయించాల్సిన అవసరం లేదనే సందేశం తమ నిరసనల్లో ఉందని పేర్కొంది.
ఒక్కసారి మహిళలు ఏకమయ్యారంటే ఒక మహిళ సమస్య మొత్తం మహిళా లోకం సమస్య అవుతుందని, స్త్రీవాదానికి కొత్త బలం చేకూరుతుందని పేర్కొంటూ రౌటెలా తన మెసేజ్‌ను ముగించింది.