చెన్నై: బీటీఎస్ ఫ్యాన్స్ అయిన ముగ్గురు అమ్మాయిలు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. బీటీఎస్ కచేరీ చూసి తమ అభిమాన హీరోలను కలిసేందుకు దక్షిణ కొరియా వెళ్లాలని నిర్ణయించారు. (girls fled home) ముగ్గురు కలిసి కొంత డబ్బు సేకరించారు. పాస్‌పోర్టులు లేకపోవడంతో ఓడలో సియోల్‌కు వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. స్కూల్ నుంచి నేరుగా రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలు ఎక్కారు. బాలికలు కనిపించకపోవడంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ముగ్గురు అమ్మాయిల జాడను గుర్తించారు. తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
జనవరి 4న తంథోనిమలైలోని ప్రభుత్వ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలికలు తమ అభిమాన బీటీఎస్ బృందాన్ని కలిసేందుకు దక్షిణ కొరియా వెళ్లాలని భావించారు. బీటీఎస్ డ్రెస్, షూస్ ధరించిన ఆ ముగ్గురు అమ్మాయిలు స్కూలు నుంచి నేరుగా కరూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రైలులో ఇరోడ్ వెళ్లి చెన్నై వెళ్లే రైలు ఎక్కారు. చెన్నై రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత గురువారం రాత్రి అక్కడున్న ఒక హోటల్లో బస చేశారు.
కాగా, ముగ్గురు అమ్మాయిల వద్ద రూ.14,000 మాత్రమే ఉండటం, పాసుపోర్టులు లేకపోవడంతో ఓడలో ప్రయాణించి సియోల్ చేరుకోవాలని భావించారు. తమిళనాడులోని తూత్తుకుడి పోర్ట్ లేదా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పోర్టు నుంచి వెళ్లాలా అని యోచించారు. చివరకు విశాఖ పోర్టు నుంచి షిప్లో దక్షిణ కొరియా వెళ్లాలనుకున్నారు. అయితే శుక్రవారం నాటికి ధైర్యం సన్నగిల్లింది. దీంతో ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించి చెన్నైలో రైలు ఎక్కారు. రాత్రి వేళ ఆహారం కోసం కాట్పాడి రైల్వే స్టేషన్లో దిగడంతో ఆ రైలు మిస్ అయ్యారు.
మరోవైపు స్కూల్‌కు వెళ్లిన బాలికలు ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా కరూర్ రైల్వే స్టేషన్లో వారు రైలు ఎక్కినట్లు గుర్తించారు. దీంతో బాలికలు కిడ్నాప్ కాలేదని పోలీసులు గ్రహించారు. ముగ్గురు అమ్మాయిల కోసం అన్ని రైల్వే స్టేషన్లలోని ఆర్పీఎఫ్ సిబ్బందిని అలెర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కాట్పాడి రైల్వే స్టేషన్లో ఉన్న ఆ బాలికలను పోలీసులు గుర్తించారు. వారి గురించి ఆరా తీసి చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులకు అప్పగించారు. చివరకు వారి తల్లిదండ్రులను రప్పించిన తర్వాత ఆ ముగ్గురు అమ్మాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రులతోపాటు వారి ఇళ్లకు పంపారు.