న్యూఢిల్లీ: ప్రస్తుతం రూ.2000 నోట్ల(Rs.2,000 Notes)ను కొన్ని ఆర్బీఐ కేంద్రాల వద్ద వాపస్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ ఒకటో తేదీన ఆ సర్వీసు ఉండదని ఆర్బీఐ వెల్లడించింది. వార్షిక అకౌంట్స్ క్లోజింగ్ రోజు కావడం వల్ల ఆ రోజు రూ.2000 నోట్ల ఎక్స్ చేంజ్ కుదరదు అని ఆర్బీఐ తెలిపింది. మళ్లీ ఆ సర్వీస్ ఏప్రిల్ రెండో తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐకి చెందిన 19 కేంద్రాల వద్ద ప్రస్తుతం రెండువేల నోట్ల మార్పిడి జరుగుతున్నది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి సుమారు 97.2 శాతం చెలామణిలో ఉన్న రెండు వేల నోట్లు వాపస్ వచ్చినట్లు ఆర్బీఐ చెప్పింది. సర్క్యులేషన్ నుంచి రెండు వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు 2023 మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అహ్మాదాబాద్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, ముంబై, నాగపూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం, రాంచీ, రాయ్పూర్ ఆర్బీఐ కేంద్రాల వద్ద రెండు వేల నోట్ల ఎక్స్చేంజ్ నడుస్తున్నది.