బెంగళూరు, ఆగస్టు 31: చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ ఉనికిని కనిపెట్టిన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్(లిబ్స్) పేలోడ్ పరిశోధనలకు బలం చేకూరుస్తూ మరో పరికరం దాన్ని ధ్రువీకరించింది. ప్రజ్ఞాన్‌లోని ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్ (ఏపీఎక్స్స్) దీన్ని ధ్రువీకరించినట్టు ఇస్రో తాజాగా తెలిపింది. ‘జాబిల్లి ఉపరితలంపై సల్ఫర్ ఎలా వచ్చింది? అంతర్గతంగానే ఉందా? అగ్నిపర్వతం లేదా ఉల్కల తాకిడితో వచ్చిందా? వంటి అంశాలను శాస్త్రవేత్తలు పరిశోధించాల్సి వుంది’ అని తెలిపింది. చంద్రుడి ఆవిర్భావం, ఉపరితల నిర్మాణం, రసాయన సమ్మేళనం, ఉల్కల తాకిడి.. మొదలైన వాటిని తెలుసుకునేందుకు తాజా ఆవిష్కరణలు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.
సల్ఫర్ ఎలా వచ్చింది?
చంద్రుడిపై సల్ఫర్ ఉందని(అపోల్ మిషన్స్‌తో) ఎప్పుడో తెలుసు! అయితే ‘చంద్రయాన్-3’తో కచ్చితమైన నిర్ధారణ అయ్యింది. ప్రజ్ఞాన్ పరిశోధనలతో వాటర్ ఐస్ ఉంటుందన్న ఆలోచనకు బలం చేకూరిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌర తుఫాన్లు, కాస్మిక్ కిరాణాలతో ఇక్కడ ఉండే సల్ఫర్ ఎప్పుడో ఎగిరిపోవాలి. కానీ అలా జరగకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉల్కల తాకిడి లేని చంద్రుడి దక్షిణ ధ్రువంలో సల్ఫర్ ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
జాబిల్లిపై చక్కర్లు కొడుతున్న ప్రజ్ఞాన్
నిన్న.. ల్యాండర్ విక్రమ్ ఫొటోలను ప్రజ్ఞాన్ రోవర్ పంపగా, నేడు విక్రమ్ ల్యాండర్‌లోని ‘ఇమేజర్ కెమెరా’ ప్రజ్ఞాన్ కదలికల్ని క్లిక్‌మనిపించింది. ఈ ఫొటోలను ఇస్రో గురువారం విడుదల చేసింది. బెంగళూర్‌లోని ఇస్రో కేంద్రం నుంచి పంపుతున్న కమాండ్స్‌తో.. ప్రజ్ఞాన్ దిశ మార్చుకున్నది కూడా రికార్డ్ అయ్యింది. ‘చందమామ ఒడిలో ఆడుకుంటున్న తన పిల్లాడిని (ప్రజ్ఞాన్ రోవర్) చూసి మురిసిపోతున్న తల్లి(విక్రమ్ ల్యాండర్). కాదంటారా?’ అంటూ ఇస్రో ఎక్స్‌లో సందేశాన్ని పోస్ట్ చేసింది.
ఇస్రో చీఫ్‌కు అపూర్వ స్వాగతం
చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించిన ఇస్రోపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. తాజాగా విమాన ప్రయాణం సందర్భంగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇండిగో విమాన సిబ్బంది, ప్రయాణికులు చప్పట్లతో సోమనాథ్‌కు అపూర్వ స్వాగతం పలికారు. విమానంలో ప్రత్యేక అనౌన్స్మెంట్ చేశారు.
చంద్రుడిపై సహజ ప్రకంపనలు
భూకంపాల తరహాలో చంద్రుడిపై కూడా ప్రకంపనలు ఉన్నట్టు ఇస్రో వెల్లడించింది. రోవర్ ప్రజ్ఞాన్‌లోని ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ (ఇల్సా) పేలోడ్ ఆగస్టు 26న వీటిని రికార్డు చేసినట్టు తెలిపింది. ‘ఆగస్టు 26న చంద్రుడిపై సహజ ప్రకంపనలను ఇల్సా నమోదు చేసింది. వీటిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి’ అని ఇస్రో ఎక్స్‌లో షేర్ చేసింది.