– కొందరి ప్రయోజనాల కోసమే పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారని రైతు ఆరోపణ
బీబీనగర్, అక్టోబర్ 06 : తిరుమనికుంటకు సహజంగా వచ్చే రెండు అలుగుల నీటి ప్రవాహాన్ని దారి మళ్లించి, ఆర్ అండ్ బీ రోడ్డుకు సమాంతరంగా సుమారు 500 మీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు చేసేందుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతు సురకంటి సుధాకర్‌రెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. కొందరి ప్రయోజనాల కోసమే సహజ నీటి ప్రవాహాన్ని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. బ్రాహ్మణపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 182, 183, 184లో 12.07 గుంటల విస్తీర్ణంలో తిరుమనికుంట ఉందని తెలిపారు. కుంటకు ఉన్న రెండు అలుగుల ద్వారా వచ్చే నీరు సహజంగా లోతట్టు ప్రాంతంలో కలిసి వ్యవసాయ భూముల మీదుగా బ్రాహ్మణపల్లి చెరువుకు చేరే కాల్వలో కలుస్తుందని పేర్కొన్నారు. అయితే కుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టి కుంటను కుదించడంతో పాటు అలుగు రాతి నిర్మాణాలను తొలగించినట్లు ఆరోపించారు.
అనంతరం సహజంగా ప్రవహించే నీటిని పైపులైన్ ద్వారా మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ లేఖ ఆధారంగా ఆర్ అండ్ బీ శాఖ 27-07-2026న పైపులైన్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. సహజంగా ప్రవహించే వాగు దిశను మార్చి పైపులైన్లోకి మళ్లించడం వల్ల భవిష్యత్‌లో రైతులకు, గ్రామ ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. పైపులైన్‌కు అవసరమైన బఫర్, ప్రభావిత రైతుల అనుమతులు, నష్ట పరిహారం వంటి అంశాలను పరిశీలించకుండానే అనుమతి ఇచ్చారా అని ప్రశ్నించారు. పైపులైన్ అనుమతిని రద్దు చేసి సహజ నీటి ప్రవాహాన్ని యథాతథంగా కొనసాగించాలని సుధాకర్ రెడ్డి కోరారు. తిరుమనికుంటలోని అక్రమ నిర్మాణాలను తొలగించి ఎఫ్టీఎల్ను పునరుద్ధరించాలని, తొలగించిన అలుగును పునర్నిర్మించి కుంటను పరిరక్షించాలని లోకాయుక్తలో విజ్ఞప్తి చేశారు.