– దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర నాయక్
కొండామల్లేపల్లి, అక్టోబర్ 06 : ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరించేలా ఉన్నాయని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం కొండమల్లెపల్లి పట్టణంలోని పాల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 టీఎంసీల నీటిని తరలించి సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు చేపట్టిన విషయం ముఖ్యమంత్రికి తెలియనిదా అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో టన్నెల్-1, టన్నెల్-2 పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. రూ.1,968 కోట్లతో పనులకు టెండర్లు పిలిచి, టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా పనులు చేపట్టారని, 2014 నాటికి కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎస్ఎల్బీసీ పనులను పూర్తి చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.“ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు చరిత్రను పూర్తిగా తెలుసుకోకుండా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టు ఎందుకు పూర్తికాలేదో కూడా ప్రజలకు వివరించాలన్నారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను పక్కనపెట్టి, ప్రాజెక్టు మొత్తం తమ ప్రభుత్వాల వల్లే ముందుకు వచ్చిందన్నట్లుగా మాట్లాడటం సరైంది కాదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం, టన్నెల్ పనుల పురోగతిపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీకి సంబంధించిన పనులు, నిధులు, టన్నెల్ నిర్మాణ పురోగతిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని రవీంద్ర కుమార్ కోరారు.రేవంత్ రెడ్డి సిగ్గు, మానం, మర్యాద అన్నీ విడిచిపెట్టిండు, అబద్ధాల ప్రచారంలో ఆల్ ఇండియా రికార్డు ఆయనదే అని దుయ్యబట్టారు. శ్రీశైలం నుండి నీటిని లిఫ్ట్ ద్వారా తరలించి మహబూబ్ నగర్ కు 1.5 టీఎంసీ, నల్లగొండకు 0.5 టీఎంసీ ఇవ్వడం అన్యాయం అన్నారు. ఎన్సీఏఆర్ రిజర్వాయర్ లో నీటి లెవల్ +440.00 నుండి +436.70 కు పడిపోతే కేవలం 1.0 టీఎంసీ మాత్రమే మిగులుతుంది. డిండికి కావాల్సింది 7 టీఎంసీలు (60-4) కానీ 8 టీఎంసీలు (7+1) మాత్రమే ఇస్తే 30 టీఎంసీలకు బదులు 8-10 వేల కోట్ల ఖర్చు వృథా అవుతుందన్నారు. అందుకే +436.70 వద్ద నీరు తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పాత లెవల్ +440.00 లోనే నీటిని తరలించాలని డిమాండ్ చేశారు.
SLBCని నెవర్ ఎండింగ్ ప్రాజెక్టుగా చేసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. 1983 నుండి 2014 వరకు ఎందుకు ముందుకు పోలేదు ఆయన ప్రశ్నించారు. గత పాపం అంతా కాంగ్రెస్ దే కదా అన్నారు. 2005 నుండి 2014 వరకు ఉన్నది వాళ్లే కదా అన్నారు. దేవరకొండ, నల్లగొండ జిల్లాల రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును రాజకీయ విమర్శలకు పరిమితం చేయకుండా, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేఎల్ఐపీ ద్వారా డిండి ప్రాజెక్టును నింపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి రైతుల పొలాలకు నీరు అందించిందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం డిండి ప్రాజెక్టు, ఆయకట్టు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డిండి ప్రాజెక్టును కేఎల్ఐపీ ద్వారా వెంటనే నింపి, ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్‌కు చుక్క నీరు రాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నాగార్జున సాగర్ నిండేంత వరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దాస్రు నాయక్, సర్పంచులు రమావత్ తులిసీరామ్, కావటి వెంకటేష్, రామావత్ దీప్లా నాయక్, రావుల వెంకటయ్య, గుండెబోయిన లింగం యాదవ్, రమావత్ శ్రీను, రావుల సత్యనారి, పంది హరికృష్ణ, తోటపల్లి వెంకటేష్ పాల్గొన్నారు.