రామచంద్రాపురం, ఆగస్టు 30: నిషేధిత డ్రగ్స్‌ని విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను కొల్లూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బుధవారం ఆర్సీపురం పోలీస్‌స్టేషన్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ నర్సింహారావు, యాంటీ డ్రగ్ కంట్రోలర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజమౌళి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చాంద్రాయణ్గుట్టకు చెందిన అబ్దుల్ ఖాదర్ ‘ఏస్నాహ్ ది సూపర్ జిమ్’ నిర్వహిస్తున్నాడు. జిమ్‌ను పాపులర్ చేసేందుకు బాడీ కండలు త్వరగా పెరగడానికి ఉపయోగించే నిషేధిత డ్రగ్స్(స్టెరాయిడ్స్, క్యాప్సిల్స్)ను కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. వీటిని అతను చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ ఇబ్రహీం క్యాబ్ డ్రైవర్ సహకారంతో తీసుకొస్తున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు వారిపై నిఘా పెట్టా రు.
ఆ ఇద్దరు నిషేధిత డ్రగ్స్‌ను తీసుకుని కొల్లూర్ మీదుగా వెళ్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్వోటీ, కొల్లూర్ పోలీసులు, యాంటీ డ్రగ్ స్కాడ్ బృందం సంయుక్తంగా వారిని పట్టుకుని విచారించారు. బాడీ కండలు త్వరగా పెరిగేందుకు జిమ్‌లో వీటిని విక్రయిస్తున్నామని చెప్పడంతో పోలీసులు చాంద్రాయణగుట్టలోని ఏఎస్నాహ్ ది సూపర్ జిమ్‌లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో రూ.10 లక్షలు విలువ చేసే నిషేధిత డ్రగ్స్‌కు సంబంధించిన 26 రకాల స్టెరాయిడ్స్ ఇన్‌జెక్షన్స్, 25 రకాల క్యాప్సిల్స్ పోలీసులకు దొరికాయి. వీటితో పాటు నిందితుల నుంచి ఐఫోన్14 ప్రో, జిమ్ విజిటింగ్ కార్డ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు.. ఇందులో ఇంకెవరి పాత్ర ఉన్నది అనే అంశాలపైన విచారణ జరుగుతున్నదని ఏసీపీ తెలిపారు. నిందితులు అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ ఇబ్రహీంలను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్, పోలీస్ సిబ్బంది, యాంటీ డ్రగ్ కంట్రోలర్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
గుండెపోటుకు కారణం
జిమ్స్‌లో విక్రయించే నిషేధిత స్టెరాయిడ్స్, టాబ్లెట్స్ వాడకంతో గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నదని ఏసీపీ నర్సింహారావు, డ్రగ్ కంట్రోలర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. జిమ్ చేసే వారిలో చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ స్టెరాయిడ్, టాబ్లెట్ విక్రయించరాదని, ఒకవేళ విక్రయిస్తే అది నేరంగా పరిగణిస్తామని తెలిపారు. సీజ్ చేసిన వాటిలో అన్లేబుల్ క్యాప్సిల్స్, ఇన్‌జెక్షన్స్ కూడా ఉన్నాయన్నారు. జిమ్స్ లో ఇలాంటివి విక్రయిస్తే వెంటనే 100 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. మజిల్స్‌ని త్వరగా గ్రోత్ చేసుకోవడం కోసం ఇలాంటి స్టెరియిడ్స్ తీసుకోవద్దని వారు సూచించారు.