అక్కన్నపేట, ఏప్రిల్ 26: డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1969 తెలంగాణ ఉద్యమం చేపట్టి ఏం సాధించలేక పోయాడు. అప్పుడు 369 మంది చనిపోయారు. గెలిపించిన ఎంపీలందరూ పార్టీలు మారారు. ఇప్పుడు ఇగ గీ కేసీఆర్ పార్టీ పెట్టిండు. ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకువస్తాడని అవహేళన చేస్తున్నారంటూ కేసీఆర్ సన్నిహితుడు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నాతో పాటు ముఖ్య నాయకులకు చెప్పి బాధపడ్డడు. కానీ, మాకు రోషం వచ్చింది. ప్రాణాలు పోయినా పర్వాలేదు. పదవులు లెక్క కాదు, శాశ్వతం కాదు, ఎవడికి భయపడేదీ లేదు, కానీ. తెలంగాణ తెచ్చి తీరాలె అని కెప్టెన్‌తో కలిసి అప్పుడు ఉద్యమ నేత కేసీఆర్‌ను కలిసినం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కట్కూరు గ్రామానికి చెందిన జిల్లెల గాల్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
తాను సిద్దిపేటలో కేసీఆర్‌తో కలిసి డిగ్రీ చదువుకున్న. నన్ను గుర్తు పట్టిండు. ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో జలదృశ్యం మీటింగ్ తర్వాత కరీంనగర్లో సింహగర్జన మొదటి మీటింగ్, తర్వాత తెలంగాణ జలసాధన, రెండు, మూడు వేల కార్లతో పార్టీ తరపున హైదరాబాద్ టూ ఢిల్లీ యాత్ర, తర్వాత పల్లెబాట, బై ఎలక్షన్లు, ఎన్నికలు, సభలు, ఉద్యమం, ఇలా నాటి నుంచి తెలంగాణ సాధించే వరకు కేసీఆర్ వెంట ఉన్నాము. పార్టీ నుంచి పిలుపు వచ్చిందంటే సైనికులా వెళ్లిపోయేటోళ్లం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మనల్ని ఆగమాగం చేసిండ్రు. అయినా ఒకటే లక్ష్యం తెలంగాణ రావాలె, కావలె అనే నినాదంతో కేసీఆర్ సబ్బండ వర్ణాలతో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, తెలంగాణ తెచ్చినం అని నిమ్మలం అయ్యింది. గర్వంగా కూడా ఉంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో ఉద్యోగాలు, కరెంటు, నీళ్లు పుష్కలం. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూనే, తెలంగాణ శ్రేయస్సు, సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా కొనసాగాయి. అడుక్కునే పరిస్థితి నుంచి మన రాష్ట్రమే హుందాతనంతో ఇతర రాష్ర్టాలకు సహాయ, సహకారాలు అందించే స్థాయికి ఎదిగినం, మనం మంచిగా బతికినం. కానీ, ఇప్పుడు సమైక్యాంధ్రకు తొత్తుగా ఉండే సీఎం రేవంత్ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుంటే దుఃఖం వస్తోంది. నవ్వేటోళ్ల ముందటా బొర్లపడ్డట్టు అయ్యింది. 2001 పార్టీ అవిర్భావం నుంచి 2016 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా 15 ఏండ్ల పాటు పనిచేశాను. చాలా సంతోషం అనిపించింది.