వికేంద్రీకరణ విజయగాథ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధానమైన నినాదం నీళ్లు-నిధులు-నియామకాలు. ఈ మూడు అంశాల్లో న్యాయబద్ధమైన పంపిణీ కోసం ఉద్యమం నడిచింది. ప్రత్యేక రాష్ట్రంలో ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు విస్తృత అవకాశాన్ని కల్పించింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడానికి, ఆ దిశగా ప్రోత్సాహం అందించేందుకు వీలు కలిగింది.
కొత్త జిల్లాలకు పదేండ్లు..
పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాల రాష్ట్రంగా తీర్చిదిద్ది నేటికి పదేండ్లు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకే దఫాలో ఇన్ని జిల్లాల పునర్విభజన చేయడం ఇదే ప్రథమం. తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కే ఇది సాధ్యమయ్యింది. ఆనాటి ఆ సంచలనానికి ప్రత్యక్ష సాక్షి, అధికారిక ప్రక్రియకు మార్గదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ. తెలంగాణ రాష్ర్టానికి తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత సలహాదారుగా రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణలో ఆయన కీలకపాత్ర పోషించారు. కొత్త జిల్లాలకు పదేండ్లు నిండిన సందర్భంగా తెలంగాణ పాలన విజయ గాథను ఆయన అక్షరీకరించారు. రాజీవ్‌శర్మ రాసిన ప్రత్యేక వ్యాసం ‘నమస్తే తెలంగాణ’ పాఠకుల కోసం..

ఒక్కో జిల్లా సగటు విస్తీర్ణం 11,000 చదరవు కిలోమీటర్లు కాగా, సగటు జనాభా 35 లక్షలు. ఇవి జాతీయ సగటు అయిన 4,900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 18 లక్షల జనాభా
కంటే ఇది చాలా ఎక్కువ. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఒక్కో జిల్లా సగటు విస్తీర్ణం 3,400 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. సగటు జనాభా సుమారు 10 లక్షలకు పరిమితమైంది.
పౌరులు తమ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి గంటకు మించి ప్రయాణించాల్సిన అవసరం ఉండకూడదన్నది కొత్త జిల్లాల ఏర్పాటులో పాటించిన ప్రాథమిక నియమం.
కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల కలిగిన అత్యంత సానుకూల ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగావకాశాల పునర్విభజన ఒకటి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డీ ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో తెలంగాణ
పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2018 జారీ అయింది. ఈ ఆర్డర్‌తో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయుల్లోని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ లభించింది.
కొత్త జిల్లాల ఏర్పాటుతో మునుపెన్నడూ లేనంత ఆర్థికాభివృద్ధి జరిగింది. మెరుగైన పరిపాలనకు దోహదపడింది. పరిపాలన సేవల పరిధిని విస్తరించడమే కాకుండా, సాధారణ పరిపాలన కార్యకలాపాల్లోనూ సామర్థ్యం పెరిగింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్‌శర్మ. ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమై, ఆకాంక్షల అమలు దిశగా పునాదులు వేసిన చారిత్రక సందర్భాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాగిన ప్రగతి ప్రస్థానంలో అనేక ప్రణాళికలను ప్రత్యక్షంగా కార్యరూపంలోకి తీసుకొచ్చారు. అందులో విప్లవాత్మకమైన నిర్ణయం కొత్త జిల్లాల ఏర్పాటు. పరిపాలన వికేంద్రీకరణకు ప్రాణాధారమైన నిర్ణయం పదేండ్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా అభివృద్ధి ఫలాలను, సుపరిపాలన విధానాలను ప్రజలకు చేరువ చేసిన కేసీఆర్ ఆశయాలు, ఫలితాలను వివరిస్తూ, నాటి తన అనుభవాలు, జ్ఞాపకాలను విశదీకరిస్తూ రాజీవ్‌శర్మ రాసిన ఈ వ్యాసం నమస్తే తెలంగాణకు ప్రత్యేకం.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలపాటు సుదీర్ఘ పోరాటం జరిగింది. ఆ పోరాట ఫలితంగా 2014 జూన్ 2న స్వరాష్ట్రం ఏర్పాటైంది. వేగవంతమైన అభివృద్ధి, ప్రగతితో కూడిన సంతోషకరమైన పాలన ప్రారంభమైంది. తొలి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం 2016 అక్టోబర్ 7న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. 21 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. 2016 అక్టోబర్ 11న విజయదశమి పర్వదినం రోజున నూతన జిల్లాలు కార్యకలాపాలు ప్రారంభించాయి. అంటే, సరిగ్గా పదేండ్ల క్రితం కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. అయితే, ఈ నిర్ణయం 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలుగా మాత్రమే కాదు. ఒక ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులు. భౌగోళిక, సామాజిక, ఆర్థిక గణాంకాల సమగ్ర అధ్యయనం, పరిపాలనా సౌలభ్యం, రవాణా అనుసంధానం, అధికార వికేంద్రీకరణకు అనుగుణంగా ఈ కొత్త జిల్లాల సరిహద్దులను నిర్ణయించారు. చిన్న జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ప్రజాప్రతినిధులు వ్యక్తం చేసిన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులు చేసింది. ఆ తర్వాత ములుగు, నారాయణపేట ప్రాంతాల నుంచి వచ్చిన తదుపరి విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న పది జిల్లాలు విస్తీర్ణంలో చాలా పెద్దవి. ఒక్కో జిల్లా సగటు విస్తీర్ణం 11,000 చదరపు కిలోమీటర్లు కాగా, సగటు జనాభా 35 లక్షలు. ఇవి జాతీయ సగటు అయిన 4,900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 18 లక్షల జనాభా కంటే ఇది చాలా ఎక్కువ. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఒక్కో జిల్లా సగటు విస్తీర్ణం 3,400 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. సగటు జనాభా సుమారు 10 లక్షలకు పరిమితమైంది. పౌరులు తమ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి గంటకు మించి ప్రయాణించాల్సిన అవసరం ఉండకూడదన్నది కొత్త జిల్లాల ఏర్పాటులో పాటించిన ప్రాథమిక నియమం. కొత్త జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్ల సంఖ్య 25 నుంచి 68కి, మండలాల సంఖ్య 459 నుంచి 584కు పెరిగింది. దీంతో పరిపాలన మరింతగా ప్రజలకు చేరువైంది.
కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక జరిగిన పరిపాలనాపరమైన కసరత్తు చాలా విస్తృతమైనది, శ్రమతో కూడుకున్నది. ఇందులోని కొన్ని ఆసక్తికరమైన వివరాలను ఇక్కడ ప్రస్తావించడం సముచితం. ఈ ప్రక్రియలో గణాంకాలు, సమాచారాన్ని సేకరించడం, లెక్కలేనన్ని వినతిపత్రాలు, సూచనలు స్వీకరించడం, కొత్త సరిహద్దులను నిర్ణయించడం, కొత్త పటాలను రూపొందించడం వంటి పనులు చేపట్టాల్సి వచ్చింది. దీనికితోడు కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, వాహనాలు సమర్థంగా పంపిణీ చేయడం, అన్ని స్థాయుల్లో సిబ్బంది నియామకం, కార్యాలయాల కోసం భవనాలను సమకూర్చుకోవడం, ఫైళ్లు, రికార్డులను కొత్త జిల్లాలకు తరలించడం వంటి పనులు చేపట్టాల్సి వచ్చింది. జిల్లాల ఏర్పాటు తేదీకి ముందురోజు అర్ధరాత్రి నుంచే ఈ తరలింపు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కొత్త కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన పరిపాలనాపరమైన ఖర్చుల కోసం ప్రతి జిల్లాకూ ప్రారంభ నిధిగా రూ.కోటి చొప్పున కేటాయించారు. వాస్తవానికి అప్పటికి రాష్ట్ర స్థాయి క్యాడర్ అధికారులతోపాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిలభారత సర్వీసుల అధికారుల కొరత ఉన్నది.

దీంతో కొత్త జిల్లాల నిర్వహణ కోసం తగినంత మంది అధికారులను గుర్తించి నియమించడం ఒక టాస్క్‌లా మారింది. రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న కొందరు అధికారులను జిల్లాలకు పంపించారు. తక్కువ అనుభవం ఉన్న పలువురు యువ అధికారులను కూడా కొత్త జిల్లాల్లో నియమించారు. వారికి సీనియర్ అధికారులు నిరంతరం మార్గనిర్దేశం చేస్తారనే భరోసా కల్పించారు.
కొత్త జిల్లా ఏర్పాటు అనేది విస్తృతస్థాయి అధికార వికేంద్రీకరణ. ఈ పరిపాలనా సంస్కరణ ప్రధాన లక్ష్యం పాలనలో సామర్థ్యాన్ని పెంచడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, వనరులను సమానంగా పంపిణీ చేయడం, పేదలు, వెనుకబడిన ప్రాంతాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించడం. చిన్న పరిమాణం కలిగిన జిల్లాలు పాలనా నిర్వహణకు అనుకూలంగా మారుతాయనేది ఉద్దేశం. కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు తమ జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుకుసునే వీలు కలుగుతుందని ప్రభుత్వం భావించింది. ఈ అంచనా సరైనదే. మొత్తం పరిపాలనా వ్యవస్థ ప్రజలకు మరింత చేరువైంది. అధికారులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడానికి, ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు వినడానికి, ఫిర్యాదులు స్వీకరించడానికి, వాటిని పరిష్కరించడానికి అవకాశం లభించింది. ప్రజాప్రతినిధులు కూడా అధికారులతో మరింత ఎక్కువసార్లు సులభంగా సంప్రదింపులు జరుపడానికి అవకాశం లభించింది.
పరిపాలనా వికేంద్రీకరణ వల్ల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే ప్రాజెక్టులను పర్యవేక్షణ కూడా సులభంగా మారింది. ఉదాహరణకు; మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరా, 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా, టీఎస్-ఐపాస్ ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేయడం, వివిధ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సామర్థ్యాన్ని పెంచడం వీలు కలిగింది. రైతుబంధు కింద పెట్టుబడి సాయం, పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం సేకరించడం, పంటకు మద్దతు ధర కల్పించడం వంటి వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేసే అవకాశం కలిగింది. పెంచిన వృద్ధాప్య పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం, పాఠశాల విద్యావ్యవస్థను, గురుకుల పాఠశాలలను మెరుగుపర్చడానికి కూడా కొత్త జిల్లాల ఏర్పాటు తోడ్పడింది.
ఒక్కో జిల్లా ఒక్కో రంగంలో ప్రత్యేకమైన సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆ మేరకు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం, వాటి ఆధారంగా నిధులు కేటాయించడం ప్రారంభించారు. ఉదాహరణకు కొన్ని జిల్లాల్లో తయారీ రంగం, వస్త్ర పరిశ్రమలు, చేనేత రంగాల అభివృద్ధి కోసం పారిశ్రామిక మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని జిల్లాల్లో వ్యవసాయం, సాగునీరు, వ్యవసాయ మార్కెటింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వచ్చింది. మరికొన్ని జిల్లాల్లోని పట్టణాలు, పట్టణ పరిసర ప్రాంతాలుగా అవకాశమున్న చోట సేవారంగాన్ని విస్తరించేందుకు వీలుగా మౌలిక సదుపాయుల కల్పించాల్సి వచ్చింది. ఇందుకోసం పెట్టుబడులు అవసరమయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల కలిగిన అత్యంత సానుకూల ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగావకాశాల పునర్విభజన ఒకటి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డీ ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2018 జారీ అయింది. ఈ ఆర్డర్‌తో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయుల్లోని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ లభించింది.
కొత్త జిల్లాల ద్వారా అధికార వికేంద్రీకరణ చేపట్టడం వెనుక ఉద్దేశం చారిత్రక అసమానతలను సరిదిద్దడం. ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని పట్టణ ప్రాంతాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని వారికి మాత్రమే పరిమితం కాకుండా చూడటం కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక ప్రధాన లక్ష్యం.
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా జిల్లాల్లో కొత్త అవకాశాలకు ఒక్కసారిగా తలుపులు తెరిచినట్టయింది. ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, దవాఖానలు, మెడికల్ కాలేజీల వంటి పలు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మౌలిక సదుపాయాల, రియల్ ఎస్టేట్, మార్కెట్లు, సేవారంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశం ఏర్పడింది. ఈ కొత్త అభివృద్ధి కేంద్రాల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరుగడానికి, ఉద్యోగాల కల్పనకు దోహదపడింది.
కొత్త జిల్లాల ఏర్పాటుతో మునుపెన్నడూ జరుగనంత ఆర్థికాభివృద్ధి జరిగింది. మెరుగైన పరిపాలనకు దోహదపడింది. పరిపాలనా సేవల పరిధిని విస్తరించడమే కాకుండా, సాధారణ పరిపాలనా కార్యకలాపాల్లోనూ సామర్థ్యం పెరిగింది. ఇందుకు అనేక నిదర్శనాలు ఉన్నాయి. గతంలో ప్రాజెక్టుల భూసేకరణకు ఏండ్ల సమయం పట్టేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ ప్రక్రియ బాగా వేగవంతమైంది. దీంతో రోడ్ల నెట్వర్క్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, సాగునీరు, తాగునీటి సౌకర్యాలు, విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచే ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం సాధ్యమైంది.
పాలనా వికేంద్రీకరణ వల్ల అధికారులు సమర్థవంతమైన సేవలు అందించగలిగారు. ఫలితంగా తెలంగాణ వ్యవసాయ రంగం ఎన్నడూ లేని స్థాయిలో వృద్ధి సాధించింది. సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.20 కోట్ల ఎకరాలకు పెరిగింది. సాగునీటి విస్తీర్ణం 62 లక్షల ఎకరాల నుంచి 1.35 కోట్ల ఎకరాలకు విస్తరించింది. ఫలితంగా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 69 లక్షల టన్నుల నుంచి 2.60 కోట్ల టన్నులకు వృద్ధి చెందింది. వికేంద్రీకృత ప్రణాళికలు అమలు చేయడం, రైతుబంధు ప్రయోజనం అందించడం, నాణ్యమైన విత్తనాల సరఫరా ద్వారా వ్యవసాయం మెరుగుపడింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వ్యవసాయ అధికారుల సంఖ్యను గణనీయంగా పెంచారు. ప్రత్యేకంగా గుర్తించిన పంటల క్లస్టర్లపై దృష్టి పెట్టేందుకు ప్రతీ 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల సమాహారం వ్యవసాయం రంగంలో అద్భుతాలు చేసింది.
సంక్షేమ పథకాల మెరుగైన అమలుకు, పర్యవేక్షణకు కొత్త జిల్లాల ఏర్పాటు దోహదపడింది. పథకాలను లక్ష్యిత వర్గాలకు సమర్థవంతంగా అందించడం సాధ్యమైంది. ఉదాహరణకు ఆరోగ్య సేవలు, గర్భిణుల సంక్షేమం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, మాతాశిశు మరణాల రేటు లక్షకు 92 నుంచి 43కు తగ్గింది. ఇది జాతీయ సగటు 88 కంటే చాలా తక్కువ.
2014 నుంచి ప్రతీ ఆర్థిక సూచీలో దేశంలోని ఇతర రాష్ర్టాల కంటే మెరుగైన ఫలితాలను సాధించిన తెలంగాణ ముందువరుసలో నిలిచింది. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ లెక్కలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ, తెలంగాణ ఆర్థిక, గణాంకాల విభాగం ప్రచురించిన అనేక నివేదికల్లోని ప్రధానమైన సూచీలను ఇక్కడ ప్రస్తావించచ్చు. తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) రూ.5.05 లక్షల కోట్ల నుంచి 2025-2026 నాటికి రూ.17.82 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో ప్రస్తుత ధరల ప్రకారం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు 12 శాతానికి పెరుగగా, స్థిర ధరల ప్రకారం వృద్ధి రేటు 7.9 శాతంగా నమోదైంది. ఈ వృద్ధి జాతీయ వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువ. ఈ కాలంలో భారత జీడీపీలో తెలంగాణ వాటా సుమారు 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి రూ.4.18 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.2.19 లక్షలుగా ఉన్నది.
అభివృద్ధికి దోహదపడే రంగాలు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉండటంతో వృద్ధి తీరు కూడా జిల్లాల వారీగా విభిన్నంగా ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో ఐటీ, సేవారంగం, రియల్ ఎస్టేట్ వంటి అధిక గుణాత్మక ప్రభావం కలిగిన రంగాలు అభివృద్ధికి ప్రధాన చోదకశక్తులుగా ఉన్నాయి. ఇతర జిల్లాల్లో వ్యవసాయం వంటి ప్రాథమిక రంగం కీలక పాత్ర పోషిస్తున్నది.
అయినప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత 2017-18ని ప్రాతిపదికగా తీసుకుని, 2025-26 తాజా లెక్కలను పరిశీలిస్తే అన్ని జిల్లాలూ 8 నుంచి 9 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటును నమోదు చేశాయి. రంగారెడ్డి జిల్లా 15 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. తలసరి ఆదాయం పరంగా దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా నిలువడం ఆ జిల్లాకు ఉన్న ప్రత్యేకత. 2014కు ముందు ప్రణాళికా సంఘం ప్రకటించిన వెనుకబడిన జిల్లాల జాబితాలో తెలంగాణలోని పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు ఉన్నాయి. అటువంటి నేపథ్యం కలిగిన తెలంగాణ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా నిలిచింది.
చివరగా, చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలనను వికేంద్రీకరించాలన్న సదుద్దేశంతో చేపట్టిన సంస్కరణ గణనీయమైన ఫలితాలను అందించింది. ఇది ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా, సామాజిక సూచికల్లోనూ స్పష్టమైన మెరుగుదలను తీసుకొచ్చింది. పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం అందించే సేవల మెరుగుదలకు కూడా కారణమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే వేసిన అభివృద్ధి పునాదుల వల్ల వేగవంతమైన పురోగతి సాధ్యమైంది. దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన చోదకశక్తుల్లో ఒకటిగా తెలంగాణ మెరుగైన ఉదాహరణగా నిలుస్తున్నది.
(వ్యాసకర్త: రిటైర్డ్ ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి)
2014 నుంచి ప్రతీ ఆర్థిక సూచీలో దేశంలోని ఇతర రాష్ర్టాల కంటే మెరుగైన ఫలితాలను సాధించిన తెలంగాణ ముందువరుసలో నిలిచింది. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ లెక్కలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ, తెలంగాణ ఆర్థిక, గణాంకాల విభాగం ప్రచురించిన అనేక నివేదికల్లోని ప్రధానమైన సూచీలను ఇక్కడ ప్రస్తావించచ్చు. తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) రూ.5.05 లక్షల కోట్ల నుంచి 2025-2026 నాటికి రూ.17.82 లక్షల కోట్లకు పెరిగింది.
రాజీవ్‌శర్మ
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

