కాలరేఖపై కవిత్వమై నిల్చిన శతాబ్ది కవి!
నదులు, కవులు భూగోళపు రక్తనాళాలు నదులు ప్రవహిస్తాయి కవితల్లా పశువుల కోసం, పక్షుల కోసం, మనుషుల కోసం నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి కవులు కంటున్న కలలు మనుషుల్లో ఫలిస్తాయి నదిలా కవి అనేక దేశాల్లో అనేక భాషల్లో, అనేక నాగరికతల్లో అనేక మానవీయ సుఖదుఃఖాల్లో ప్రవహిస్తాడు’
అంటారు మహాకవి శేషేంద్ర. ఆదికవి వాల్మీకి నుంచి ఆధునిక కవి వరకు, మన తొలికవి నన్నయ్య నుంచి నవకవి వరకు కవులు దేశ సాహిత్య, సాంస్కృతిక వైభవానికి సారథులు. అక్షరానికి ఆయువు పోసి, కావ్యకళ ద్వారా అమరం చేసిన అనితర సాధ్యులు. నదులు దేశాన్ని సాగు చేస్తే, కవులు సమాజాన్ని సాగు చేస్తారు. నదులు పండించే పంటలు ఆకలి తీరిస్తే, కవులు పండించే కలం పంటలు అమృత తుల్యమైన అనుభూతిని ప్రసాదిస్తాయి. కవులు మానవజాతి రక్తకణాల మీద పనిచేసే అలంకారాల నిధులు. గంగ, యమున, గోదావరి వంటి నదులు భారతీయ సాంస్కృతిక కేంద్రాలైతే, వాల్మీకి, వ్యాస, కాళిదాసాదులు భారతీయ సాహిత్య వైభవానికి మూలస్థానాలు. కవులు కావ్యాలనే వసంతాల్ని నాటి పోతారు. అవి పూస్తుంటాయి. రాలిపోతుంటాయి. మళ్లీ పూస్తుంటాయి. ఈ అద్భుత కుసుమచక్రం మనిషిని లోకపు ఎడారి నుంచి రక్షిస్తూ ఉంటుంది. మూర్ఖులకు తెలీని మర్మమిది. అదే కవిత్వం ద్వారా మనం గ్రహించాల్సిన పరమసత్యం.
‘ఓ నా ప్రజలారా!రండి! మీకో పద్యం ఇస్తా!
ఈ పద్యం మీకో కొత్త ప్రాణం ఇస్తుంది కొత్త ప్రయాణం ఇస్తుంది’-శేషేంద్ర కవిగా ప్రపంచానికి చేసిన ప్రమాణం ఇది. కవిత్వమే తన ప్రాణవాయువుగా సాగిన తన ప్రయాణంలో శేషేంద్ర ప్రజలకిచ్చిన నైతిక మద్దతు ఇది. కాలం ఏదైనా కవి తన కలాన్ని పదునెక్కించి కాలం వెంట నడవాలి! కాలరేఖపై కవిత్వ సంతకం చేయాలి. శేషేంద్రగా ప్రపంచానికి పరిచయమైన డా.గుంటూరు శేషేంద్ర శర్మ అనన్య సామాన్యమైన కవితా సృష్టితో ఈ శతాబ్దాన్ని వెలిగించారు. శతాబ్ది కవిగా, శబ్దమాంత్రికునిగా కీర్తి గడించారు.
కాలం నిన్ను ప్రశ్నిస్తోంది నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే
కలంతో కదిలివచ్చి వాళ్ళ గుండెల మీద ముద్రపడేలారాయి
వాళ్ళ జీవితాల్ని వాళ్ళ భాషలోనే చెప్పు
సమాజం ఏం కోరుకుంటుందో కవులు,
రచయితలు, కళాకారులు అదే ఇవ్వాలి! ప్రజల ఆశలు, ఆకాంక్షలు కవిత్వంలో ప్రతిఫలించాలి. ఆచరణలో రుజువు చేయాలి. స్వాతంత్య్రం వచ్చి 80 ఏండ్లు నిండినా, పేదరికం పిలకలు వేస్తూనే ఉన్నది. ఈ దేశం మీకేమిచ్చింది? అని ఎవరైనా అడిగితే..‘ఐదేళ్ళకోసారి ఓట్లు..ఈ మధ్యలో కునికిపాట్లు’-అంటూ వ్యంగ్యాస్ర్తాన్ని సంధిస్తారు శేషేంద్ర. శేషేంద్ర ప్రజల కవి. కవిత్వాన్ని విప్లవీకరించిన కవి. పద్యం రాసినా, వచనం రాసినా, గజల్ రాసినా తనదైన అభివ్యక్తి ముద్రను ఆధునిక కవిత్వంపై వేసిన కవి. సంప్రదాయభావాన్ని ఎంత బలీయంగా చెప్పారో, ఆధునిక విప్లవభావాలను అంతే బలంగా అక్షరీకరించిన విద్వత్కవి. తమ కవిత్వంతో, సరికొత్త సూత్రీకరణలతో, విశ్లేషణాత్మక దృష్టితో పాఠకుల గుండె నదుల్లో విద్యుత్త ప్రవహించిన కవి. శ్రీశ్రీ తర్వాత సమాజాన్నీ, కవుల్నీ ప్రభావితం చేసిన మన తరం మహాకవి.
కవిత్వంలో శేషేంద్ర అభివ్యక్తులు ఎంత నవ్యంగా ఉంటాయో, అంత ఆకర్షణీయంగా ఉంటాయి. వ్యాసాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు అంతే పఠనీయంగా ఉంటాయి. ప్రాచీన, ఆధునిక కవుల గురించి, వారి కవిత్వం గురించి, ఆయా కవుల ఆత్మీయత గురించి, అభివ్యక్తి వైచిత్రి, అలంకార ప్రియత్వం గురించి అద్భుత విశ్లేషణ చేశారు మహాకవి కాళిదాసు మేఘ సందేశం గురించి రాస్తూ ‘మేఘ సందేశం ఒక కావ్యం కాదు! జీవితాంతం వెంటాడే మధురస్మృతి’ అంటారు శేషేంద్ర. కవిగా వినూత్న వర్ణనలను ఇష్టపడే శేషేంద్ర కాళిదాసు మేఘ సందేశంలోని అత్యద్భుత వర్ణనలను, కల్పనలను వాటి కమనీయతను తనదైన శైలిలో మనకు చెప్తారు. తులనాత్మక సాహిత్యం గురించి రాస్తూ ‘తులనాత్మక సాహిత్యానికి స్వతంత్ర రచనలే యోగ్య సామగ్రి అవి సహజాతాలై ఉండాలి. అప్పుడే తులనాత్మక పరిశీలనకు ఉపయోగపడతాయి. తులనాత్మకత, సమాన లక్షణాన్ని అన్వేషించడంలోను, సూక్ష్మభేదాలను ఆవిష్కరించడంలోనూ ఉంటుంది. సాహిత్యపరమైన ఆనందం, జ్ఞానపరమైన సాఫల్యత, తులనాత్మక సాహిత్యంలో పాఠకుడు లేదా సమాజం, పొందే ప్రయోజనం’-అని తులనాత్మక అధ్యయనం ప్రధాన ఉద్దేశాన్ని వివరిస్తారు.
శేషేంద్ర దృష్టిలో సాహిత్యం ఓ ఆత్మకళ. ప్రక్రియ ఏదైనా ప్రయోగాత్మకంగా, ప్రయోజనాత్మకంగా రాయడం ఆయన లక్ష్యం. ఇది కాళిదాసు నుంచి స్వీకరించిందే! కాళిదాసు ప్రతి రచనా ప్రయోగాత్మకమే! ప్రతిభావం ప్రమోదాత్మకమే! ఇవాళ ఆధునిక కవులు చెప్తున్న అభివ్యక్తి నవ్యత, పదచిత్రాలు వగైరా కాళిదాసులో కన్పిస్తాయి. అవి శేషేంద్ర కవిత్వంలో పుంఖానుపుంఖాలుగా దర్శనమిస్తాయి. సామాజిక స్పృహకంటే సాహిత్య స్పృహ ముఖ్యమని చెప్పే శేషేంద్ర కవి ఆత్మ, అభివ్యక్తి, భావ సౌందర్యపు అంతరంగం సాహిత్య స్పృహలోనే కన్పిస్తాయంటారు.
‘ఈ దేశపుప్రాచీరేఖ మీద సూర్యుడు ఉదయించకపోతే మండే నా గుండెను చీల్చి ఎర్రటికండలతో ఎండలు కాయిస్తా’ నంటారు శేషేంద్ర.
ఇక్కడ ప్రాచీరేఖ బదులు తూర్పు దిక్కు అనవచ్చు. మండేగుండె కాంతివంతం కావాలంటే దాన్ని ప్రాచీరేఖ మీద కూర్చోబెట్టాల్సిందే! అపుడే శబ్ద సౌందర్యం భావ సౌందర్యంగా పాఠకుల మనోనేత్రాలను ఆకట్టుకుంటుంది. ఆధునిక కవుల్లో చాలామంది సూర్యుడిని వెలుగుకు ప్రతీకగా భావించారే తప్ప, మానవుడికి సూర్యుడితో ఉన్న అనుబంధాన్ని పసిగట్ట లేకపోయారు. సూర్యుడిని ధరిత్రిని కలం దున్నితే అప్పుడవుతుంది అది ఒక ఇతిహాసం. ఇలాంటి కవిత్వానికి పురుడు పోయగల ఏకైక కవి శేషేంద్ర!
ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి.
అది కన్నీళ్ళు కార్చాలి. క్రోధాగ్నులు పుక్కిలించాలి.
పీడితుల పక్షం వహించి మనిషి ఋణం తీర్చుకోవాలి-పోయెంకు గుండె ఉండటమంటే పాఠకుడిని కదిలించే చైతన్య స్పృహ ఉండటం. కవిత్వం కన్నీళ్లు కార్చడం అంటే కరుణరసాత్మకం కావడం. క్రోధాగ్నులు పుక్కిలించడమంటే లోకంలోని అన్యాయాలు, అక్రమాలు, హింస, దోపిడీ వగైరాపై కవి ధర్మాగ్రహం వ్యక్తం చేయడం. జాషువాలా ప్రతిఘటన స్వరాన్ని విన్పించడం. శేషేంద్రశర్మను ఆధునిక మహాభారతం పరిపూర్ణ సామాజిక భావ విప్లవకవిగా మన ముందు నిలుపుతుంది. శేషేంద్రను మెదడుతో కాదు, హృదయంతో చదవాలి. రసదృష్టితో చదవాలి. ఈ పాదాలు చూడండి.
‘చెట్లు పూలెందుకు పూస్తాయి.బుల్లెట్లెందుకు పూయవు’ అని ప్రశ్నిస్తారు.నేను జేబుల్లో కోకిలల్ని వేసుకురాలేదుపిడికిళ్లలో బాంబులు బిగించుకొని వచ్చాను – అంటారు. కవి కాలం వెంట నడవడం అంటే ఇదే ! పాతకాలం పద్యమైతే, వర్తమానం వచనం‘-అనే కుందుర్తి మార్గాన్ని తమ వచన కవిత్వం ద్వారా మరింత విస్తరించి, దానికో పరిపూర్ణత నిచ్చిన కవి శేషేంద్రశర్మ.
‘కాలాన్ని కాగితం చేసుకుంటా
దానిమీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తాదాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా’ అని కాలపత్రం మీద చెరగని సంతకం చేసిన శేషేంద్ర ఈ శతాబ్దపు మహాకవి. మహాకవి శ్రీశ్రీ తర్వాత ఆధునిక కవుల్ని, కవిత్వాన్ని ప్రభావితం చేసిన కలం శేషేంద్రది. పద్యాన్ని పండించినట్లే, వచనాన్ని కవితామృతంలా వర్షించారు. వేమన పద్యాల్లోని భావ తీవ్రత శేషేంద్రలో వేయి ఫిరంగుల మోతగా ప్రతిధ్వనిస్తుంది. శేషేంద్రశర్మ ప్రచారకవి కాదు. కవిత్వాన్ని కాలాతీతరేఖగా నిలిపిన కవి. గుంటూరు శేషేంద్రశర్మకు ‘జ్ఞానపీఠం’ దక్కలేదన్న అసంతృప్తి లక్షలాది పాఠకుల్లో ఉన్నది. నోబుల్ పురస్కారానికి నామినేట్ అయిన మహాకవికి జ్ఞానపీఠం దక్కకపోవడం వింతల్లో వింత. 2027 ఆ మహాకవి శతజయంతి సంవత్సరం. ఈ సందర్భంగా శేషేంద్ర సాహిత్యాన్ని సమగ్ర సంపుటాలుగా ముద్రించాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
శేషేంద్ర దృష్టిలో సాహిత్యం ఓ ఆత్మకళ. ప్రక్రియ ఏదైనా ప్రయోగాత్మకంగా, ప్రయోజనాత్మకంగా రాయడం ఆయన లక్ష్యం. ఇది కాళిదాసు నుంచి స్వీకరించిందే! కాళిదాసు ప్రతి రచనా ప్రయోగాత్మకమే! ప్రతిభావం ప్రమోదాత్మకమే! ఇవాళ ఆధునిక కవులు చెప్తున్న అభివ్యక్తి నవ్యత, పదచిత్రాలు వగైరా కాళిదాసులో కన్పిస్తాయి.
(మహా కవి శేషేంద్ర శతజయంతి ప్రారంభం సందర్భంగా..)
డా.బీరం సుందరరావు
6303443302
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

