సిన్నపుడు నేను
జెరంత సుండి పోరన్నే
సుండి పనులు సేత్తే
సూస్కుంట ఉండలేక
నన్ను భయపెట్టాలని
దయ్యానికి పట్టిత్తామనేటోళ్ల్లు
మా అక్కలు
దయ్యమెట్లుంటది…
యాడుంటది అనంగనే
ఇంటెన్క తలుపుదీసి
ఏనుగుల గుట్ట మొకాన సూపిద్దురు
అగో సూడు..
నిప్పులు ఎగవోసుకుంట అచ్చేటి
కాముని భూతం అందురు
కొన్నేండ్లకు ఎర్కయింది
గది దయ్యం గాదు…
భూతం గాదు అని
మా బాపు సెప్పిండు
గవ్వి గుట్టకు అంటుకున్న మంటలని
ఎగవడి కాలేటి
ఎరగడి మంటలు గవ్వి
ఎండిన ఆకులల్ల అంటుకొని
సోల్పున కాలుకుంట
గుట్టంతా తిరుగుతుండే
మా అవ్వనైతే ‘గుట్టకు ఎల్గడి తల్గిందిరా’ అంటుండే.
అడ్డమేం లేకపోతే..
గా మంటల ఎలుగు
ఎంత దూరమైనా కనిపిస్తుండే
గిప్పుడు అస్సలు ఎర్కయిందేందంటే
నిజానం దయ్యాలు లేవు..భూతాలు లేవు
దేవుండ్లు సుతం లేరు
మన మనుషులల్లనే
దేవుండ్లుంటరు
దయ్యపోల్లుంటరు
గా దేవుండ్లకే మొక్కాలే
దయ్యపోల్లనేమో తొక్కాలే
-అల్లాడి శ్రీనివాస్
8341663982