చరిగొండ ధర్మన్న చిత్ర భారతం సూక్తిమయం స్ఫూర్తివంతం
తన కవితా ప్రయాణంలో ఎంత గొప్ప కవి కూడా తనకు తాను ఒక దీపస్తంభం వంటివాడు కాదు. తనపై పూర్వకవుల ప్రభావం ఉండడం, తన ప్రభావం భావి కవుల మీద పడుతుంది. తెలుగులోని పూర్వకవుల సాహిత్యంలో ఈ విషయానికి ఉదాహరణలుగా చెప్పగలిగిన సందర్భాలు కనిపిస్తాయి. చరిగొండ ధర్మన్న రచించించిన ‘చిత్ర భారతం’ కావ్యంలో ధర్మన్నపై నన్నయ ప్రభావం, శ్రీశ్రీ ఒక ప్రసిద్ధ కవితపై ధర్మన్న మాటల ప్రభావం కనిపించిన సందర్భాల విశ్లేషణ ఈ వ్యాసంలో ముఖ్య విషయం.
తెలంగాణలోని ఓరుగల్లు ప్రాంత వాసియైన చరిగొండ ధర్మన్న క్రీ.శ.16-17 శతాబ్దుల మధ్యకాలంలో రచించిన కావ్యం ‘చిత్రభారతం’. పేరుకు తగినట్లుగానే నరనారాయణులుగా పరిగణించే అర్జునుడికి, శ్రీకృష్ణుడికి మధ్య యుద్ధం జరగడానికి దారితీసిన చిత్రమైన పరిస్థితుల వర్ణన ఈ కావ్యంలో ప్రధాన కథాంశం. మహాభారతాన్ని తెలుగులోకి అనువదిస్తూ ‘మధ్యలో సందర్భానికి తగినట్లు రచనలో సూక్తులను చేర్చడం’ అనే నన్నయభట్టు ప్రవేశపెట్టిన పద్ధతిని ‘చిత్రభారతం’ రచనలో చరిగొండ ధర్మన్న కూడా పాటించారు. ఆ సూక్తుల్లో అత్యుత్తమమైన రెండు సూక్తులను సందర్భానికి సంబంధించిన సమాచారం ఇది. తుల్యుడనే పేరున్న మహాముని కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఆ ముని తపస్సుకు ముల్లోకాలు గడగడలాడాయి. దేవేంద్రుడి వద్దకు ఆ సమాచారం చేరింది. దేవగురువైన బృహస్పతితో..ఏం చేస్తే తుల్యుడి తపస్సు బాధ నుంచి బయటపడగలమని ఆలోచించాడు. బృహస్పతి ఏం చేయాలో చెప్పడానికి ముందు ఉపోద్ఘాతంగా ఇలా దేవేంద్రుడితో ఇలా అన్నాడు:
ఆ. బలిమి చేయరాని పని యెట్టిదైన ను
పాయబలము చేతఁ జేయవచ్చు
సాహసంబు చేసి చనరాని జలనిధి
నావచేఁ దరించు ఠేవ ననఘ.
(చిత్రభారతం, ద్వితీయాశ్వాసం, 58)
మునుల తపస్సులను మనం బలంతో ఎదుర్కోగలమని అనుకోవడం భ్రమ అవుతుంది. అన్ని పనులనూ కేవలం బలప్రయోగం చేసి, భయపెట్టి సాధించుకోలేం. కనుక, బలప్రయోగంతో సాధించలేని పనులను బుద్ధిబలంతో ఎలా సాధించుకోవాలో తెలిసిన వారితో ముందు చర్చించి, తగిన ఉపాయం ఆలోచించి సాధించాలి. ఉపాయబలం ఎటువంటిదంటే.. సముద్రాన్ని జయించడానికి నావపై వెళ్లడం వంటిది. నావలో వెళ్లకుండా సముద్రంలోకి ఎంతదూరం వెళ్లగలం? ఎంతోదూరం లోపలికి వెళ్లలేం. అదే ఒక నావలో ప్రయాణించి ఖండాలను దాటి వెళ్లగలం. మునీశ్వరుల తపోబలం సముద్రం వంటిది. ఆ బలాన్ని ఎదుర్కోవడానికి బుద్ధిని ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే విజయం మనది అవుతుంది-అని బృహస్పతి మాటలుగా, బాలలకు సైతం బోధించదగిన సుభాషితంగా, తేలికైన మాటలలో గొప్పదైన సత్యాన్ని చెప్పారు చరిగొండ ధర్మన్న. లోకాలను కల్లోలపరుస్తున్న తుల్యుడి తపస్సును భంగం చేయడానికి వసంతుడిని, అప్సరసలను తోడుగా ఇచ్చి మన్మథుడిని పంపడానికి పూనుకున్నాడు దేవేంద్రుడు. అదెంత పని? అనే ఊపులో ఉన్న మిగతా అప్సరసలకు, మన్మథుడికి వాస్తవాన్ని గుర్తుచేయాలని రంభ ఇలా అన్నది:
ఉ. ఇచ్చకమొప్ప నీయెదుట నిచ్చెలులెల్లను బుద్ధిమాలి తా
రిచ్చకువచ్చినట్టి గతి నేవిధినైనను బల్కనిమ్ము కా
ర్చిచ్చును నమ్మహామహుని చిత్తము నొచ్చినఁగీడు దప్పునే
పచ్చనివింటిజోదు హరుపైఁబడి యేగతియయ్యెఁ జెప్పుమా?
(చిత్రభారతం, ద్వితీయాశ్వాసం, 94)
తమ చిత్తానికి తోచినట్లు దేవేంద్రుడి ఎదుట ఎవరికివారు మతిలేని మాటలను ఎట్లా పడితే అట్లా మాట్లాడి, వాస్తవాన్ని మరుగుపరచలేం కదా! తుల్యుడి తపోబలం కార్చిచ్చు వంటిది. అడ్డం వచ్చిన వారిని కాల్చివేయ గలదు. చెరకు విల్లు ఆయుధంగా గలిగిన ఆ యోధుడు, ఆ ఆయుధాన్ని నమ్మి హరుడిపైకి దండెత్తి వెళ్లి ఏ గతి పట్టాడో అందరికీ తెలిసిన సంగతే కదా!-అని వాస్తవం బోధించింది రంభ.
ఆ. ఎదిరిసత్వ మెఱిఁగి యెదిరినచోఁ గదా
విభుఁడు జయమునొందు వేవిధములఁ
గొలఁది కానిపనులకును బోవఁగాఁ గీడు
కొలఁదిగనక వెంటఁ గూడకున్నె.
(చిత్రభారతం, ద్వితీయాశ్వాసం, 95)
కనుక, ఎదుటివారి బలమెంతో, మన బలమెంతో సరిగా చింతన చేసి, బేరీజు వేసుకుని రంగంలోకి దిగాలి. అప్పుడే విజయం లభిస్తుంది. అలా కాకుండా, తక్కువకాని, అలవికాని పనులను సాధించడానికి వెళ్తే, కొలది కానంత కీడు-అంటే మాటలతో చెప్పలేనంత, ఇంత అని కొలవలేనంత కీడు-జరగకుండా మానదు కదా అని గుర్తించి, గుర్తుంచుకోదగిన సత్యాన్ని, సుభాషితంగా పై పద్యంలో చెప్పారు ధర్మన్న. అయినప్పటికీ, దేవేంద్రుడి మాటకు కట్టుబడి తంటాలు కొని తెచ్చుకున్నది రంభ. కఠోర తపోనిష్ఠలో ఉన్న తుల్యుడిని కదిలించి
ఆ ముని శాపానికి గురైంది. తురంగమవై చతుర్ధనుడనే రాజుకు వాహనంగా ఇక్కడే ఉండిపొమ్మని శపించాడు తుల్యుడు రంభను. ఇదేమి కర్మము వచ్చిపడిందిరా దేవుడా? అని వగచింది రంభ. కరుణించి శాపోపహతిని ప్రసాదించించండి స్వామీ! అని ప్రాధేయపడింది. మెత్తబడ్డాడు ముని. ఆ మహారాజుకు ముల్లోకాలనూ తిప్పి చూపించి భూమికి చేరగానే నీ తురంగ రూపం పోయి, మళ్లీ రంభవై పూర్వవైభవాన్ని పొందుతావు పొమ్మన్నాడు తుల్యుడు. అదే చాలనుకున్నది రంభ.
తుల్యుడి శాపం ప్రకారమే
భూమండలాన్ని నిరాటంకంగా పాలిస్తున్న చతుర్ధనమహారాజుకు వేట సందర్భంలో కనిపించింది. ఆ తురంగం ఆకర్షణీయమైన రూపానికి ముచ్చటపడి ఇంటికి తెచ్చుకున్నాడు ఆ మహారాజు. ఒకనాడు అకస్మాత్తుగా మంత్రులు, సేవకగణం చూస్తుండగా రాజును ఎక్కించుకుని నింగిలోకి ఎగిరింది గుర్రం. క్షణాల్లో కనుమరుగైపోయింది.
రాజు మాయమైపోయాడని కంగారుపడ్డారు మంత్రులు. రాజ్యం అరాజకమైపోతుందేమోనని భయపడ్డారు. కొన్నాళ్లకు తురంగంతో రాజు తిరిగొచ్చాడు. ముని వాక్కు ప్రకారం ముల్లోకాల్లోని వింతలు, విశేషాలను రాజుకు తిప్పి చూపించి తెచ్చి క్షేమంగా ఇంటి ముందు వదిలింది ఆ మాయాతురంగం. అందరూ సంతోషించారు. చతుర్ధన మహారాజుకు కృతజ్ఞత చెప్పి, పోతూపోతూ, ముందు ముందు కష్టాల్లో మందులా ఉపయోగపడుతుందని నారాయణ మంత్రోపదేశం చేసి, నిజరూపంతో స్వర్గానికి వెళ్లిపోయింది రంభ. కథ సుఖాంతమయినట్లే అనిపించింది. కానీ, ఆ మధ్యలోనే అసలు సంగతి జరిగింది. ఆ జరిగింది కూడా చతుర్ధన మహారాజుకు తెలియకుండా జరిగింది. అది తెలియజెప్పడానికి నారదుడు భూలోకానికి వచ్చాడు.
నారదుడిని భక్తిపూర్వకంగా స్వాగతించి, సుఖాసీనుడిని చేశాడు రాజు. ‘అంతా బాగానే ఉన్నదా?’ అని అడిగాడు నారదుడు. ‘మీ దయ నాపై ఉండగా నాకేమి లోటు!’ అన్నాడు సంతోషంగా రాజు. ‘ఏం దయ, ఏమి బాగు? నీ ప్రాణానికే ముప్పొంచ్చిందిగా!’ అన్నాడు నారదుడు. కంగుతిన్నాడు రాజు. ఏమిటో చెప్పమని తొందరపెట్టాడు. నారదుడు చెప్పాడు. నీవు తురంగం మీద ఎక్కి ముల్లోకాలూ విహరిస్తుండగా, ఒక దురదృష్టకర క్షణంలో ఆ గుర్రం నోటి నుంచి జారిన ఫేనకణం-నురగ తునక-నేరుగా వచ్చి, భూమి మీద యమునా నది నీటిలో నిలబడి సూర్యుడికి అంజలి ఘటిస్తున్న శ్రీకృష్ణులవారి దోసిలిలోని అర్ఘ్యజలంలో పడింది. ఇంక చెప్పేందుకేమున్నది? మిగతాది నువ్వే ఊహించుకోవచ్చు. ఈ భూమి మీద నీ జీవితం ముగియడానికి నెలరోజుల కాలం పెట్టాడు శ్రీకృష్ణులవారు. ఇహ నీ ఇష్టం! అని చెప్పి, వచ్చిన పని అయిపోయి వెళ్లిపోయాడు నారదుడు.
మొదట దేవేంద్రుడిని శరణువేడాడు
చతుర్ధనుడు. తన వల్ల అయ్యే పని కాదన్నాడు దేవేంద్రుడు. బ్రహ్మదేవుడిని శరణు కోరాడు. ఆయన కూడా ఇంద్రుడి మాటనే చెప్పాడు. మేమే కాదు శ్రీకృష్ణుడిని ఎదిరించి నెగ్గడం ఎవడివల్లా కాదన్నాడు. ఇంతటితో ఇహ సరి, అని నిర్ణయించుకుని అంతఃపురంలో దిగులుగా కూర్చున్నాడు చతుర్ధనుడు.
ఇంతలో ద్వారపాలుకుడు పరుగున లోపలికొచ్చి నగరం పొలిమేరన మన పొలాల్లో అర్జునులవారు వేటకు వెళ్తూ వేంచేసి ఉన్నారు ప్రభూ! అని చల్లని కబురు చెప్పాడు. తళుక్కున మెరుపు మెరిసింది చతుర్ధనుడి మెదడులో. బతికాననుకున్నాడు మనసులో. పరుగున వెళ్లి, అర్జునుడి పాదాలు పట్టుకుని ఉండిపోయాడు. పరవాలేదు లేవమన్నాడు అర్జునుడు. ప్రాణం దక్కిస్తానని మాట ఇస్తే గానీ లేవనన్నాడు రాజు. ఇచ్చానన్నాడు అర్జునుడు. సావధానంగా లేచి, సంగతులన్నీ అర్జునుడికి సావకాశంగా విన్నవించుకున్నాడు చతుర్ధనుడు. ఎంతపనైపోయింది ఇంతలో! అని పరుగున ధర్మజుడి వద్దకు పరుగెట్టాడు అర్జునుడు.
క. పోనీ శరణాగతికై
మేనులు, హరి కొసఁగి కీర్తిమించి సురేంద్ర
శ్రీ నెగడెద, మిది విడిచిన
హీనపు బ్రతుకేల రాజ్యమేటికి మనకున్.
(చిత్రభారతం, పంచమాశ్వాసం,222)
అన్నాడు ధర్మరాజు. పోనీ శరణాగతికై మేనులు-శరణన్నవాడి ప్రాణాన్ని కాపాడడానికి మన మేనులు పోతే పోనీ-అన్నది పై పద్యంలోని మొదటి చర ణంలో ధర్మరాజు మాటల సారాంశం. పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ పోతే పోనీ అన్నాడు శ్రీశ్రీ తన రచనయైన ‘పోతే పోనీ’ అనే శీర్షి కతో ఉన్న పదహారు లైన్ల పొట్టి గీతం లో. ఒక గొప్ప విలువను కాపాడే ప్రక్రి యలో, ప్రపంచానికి పాటింపద గిన అత్యుత్తమ ఆదర్శాన్ని అందించే ప్రక్రి యలో ‘ఏదైనాపోనీ, అవసరమైతే ప్రాణమే పోనీ’ అనే భావనకు ఆధుని కుల పద్ధతిలో కవిత్వపరమైన వ్యక్తీకర ణ విధానం తెలుగు కవిత్వంలో నాలు గైదు శతాబ్దాల క్రితమే చరిగొండ ధర్మ న్న రచించిన పద్యంలోనే పుట్టిం దని చెప్పడానికి పై పద్యమే నిదర్శనం.
భట్టు వెంకటరావు
9959120528
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

