బతుకు నేర్పిన బతుకమ్మ పాటలు
జానపద గేయసాహిత్యంలో ఉయ్యాల. (బతుకమ్మ) పాటలది ఒక ప్రక్రియ. ఉయ్యాల పాటలకు బతుకమ్మ పాటలు, బొడ్డెమ్మ పాటలు, దసరా పాటలు అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ప్రత్యేకించి స్త్రీల పాటలే. అయితే ఇవి జోలపాటలు కావు. ఊయల ఊపులాగా ముందుకెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి, తిరిగి ముందుకు వెళుతూ ఉంటుంది. అందుకే ఈ గేటు ప్రక్రియకు ఉయ్యాల పాట అని పేరు వచ్చింది.
రెండు చేతులా చప్పట్లు చరుస్తూ, ముందుకు వంగుతూ లేస్తూ, గుండ్రంగా తిరుగుతూ ఈ పాటలు పాడుతారు. ప్రతి పాదం చివర ‘ఉయ్యాలా లేక ‘వలలో’..అనే వూత్, లేక వంత ఉంటూ లయానుగుణంగా పాట సాగుతుంది. గ్రామీణ జానపదుల విశ్వాసాల నుంచి నిష్కల్మష నిర్మల హృదయ క్షేత్రాల నుంచి మొగ్గతొడిగినవే ఈ జానపద పాటలు. వీటికి మన తెలుగు నేలే పుట్టిల్లు. ప్రజాజీవనంలో చైతన్యంలో భాగమైన ఈ ఉయ్యాల పాటలు నేటి ఆధునిక జీవనశైలి, డిష్ యాంటీనా, నెట్, విష సంస్కృతి వలయంలో చిక్కుకుని తమ ఉనికినే కోల్పోతున్నాయి. అయితే మన ఆచార సాంప్రదాయాలు, మనం చేసుకునే పండుగలు ఈ పాటలకు చిగురుతొడగడం ఆనందదాయకం.
తెలంగాణ ప్రాంతంలో ‘బతుకమ్మ పాటలు’ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ‘శ్రీలక్ష్మీదేవియు చందమామ-సృష్టి బ్రతుకమ్మయ్యే చందమామ/పుట్టినా రీతిచెప్పే చందమామ-భట్టు నరసింహ కవి చందమామ’ అనే పాట బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాలను తెలియజేస్తుంది. ఈ పండుగ యేటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. ‘శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ..చిత్రమై తోచునమ్మా…’ అంటూ..‘తలుపునకు తాళాలు వలలో యెండి చీలాల వలలో…బతుకమ్మ బతుకు ఉయ్యాలో..బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ ఈ పాటల్లోని పాదాలు త్రిశ్ర చతురస్ర గతిలో నడుస్తుంటాయి.

Bathukamma
గౌరీ పూజ సందర్భంలో ‘రుద్రాక్ష చెట్లల్ల ఆట చిలుకల్లారా, పాట చిలుకల్లారా, కలికి చిలుకల్లార, కొలికి చిలుకల్లారా..కుందమ్మ గువ్వలు/నీ నోము నీ కిత్తునే గౌరమ్మ-నా నోము ఫలమివ్వవే’ అంటూ మహిళలు తమ పాటల్లో భక్తిని వ్యక్తం చేస్తారు. ఉయ్యాల పాటల్లో ‘శ్రీరామ నీ తల్లి ఉయ్యాలో..ప్రేమతో శాంతమ్మ ఉయ్యాలో..పిలిచి దెగ్గర తీసి ఉయ్యాలో..సతి ధర్మముకొన్ని ఉయ్యాలో/చెప్పను ఈ రీతి ఉయ్యాలో-చెవులకు ఇంపుగా ఉయ్యాలో’ అంటూ ఇలా జానపదులు తమ ఉయ్యాల పాటల్లో దేవతలను స్తుతిస్తారు.
ఉయ్యాల పాటల్లో అనేక విషయాలతో పాటు సామాజిక జీవన చిత్రణ సైతం ఆయా సందర్భాల్లో కనబడుతుంది. వీరకృత్యాలు, దొమ్మీలు, నిరంకుశత్వాన్ని ఎదిరించటం, సహగమనాధికారాలను నెరవేర్చడం వల్ల ప్రసిద్ధమై, హృదయాలను ఆకర్షించిన సంఘటనలను కథా వస్తువుగా తీసుకుని గానం చేసిన సందర్భాలు కనిపిస్తాయి.అత్తగారి ఆరడికి ఒకానొక కోడలు పడే ఆక్రందనను ఈ జానపద సాహిత్యంలోని పాట చక్కగా విశదపరుస్తుంది. ‘కోడలా కోడలా కొలికి ముత్యమా/పచ్చనీ పాలమీది మీగడేమాయే-కడిపాల మీది వెన్నెలేమాయే/తేనెకుండ మీది తెప్పలేమాయే-నూనెకుండ మీది నురుగులేమాయే’ అంటూ సాగుతుంది.
‘ఇద్దరక్కజెల్లెండ్లు ఉయ్యాలో/ఒక్క ఊరికిస్తే ఉయ్యాలో/ఒక్కడే అన్నయ్య ఉయ్యాలో/వచ్చన్నబోడు ఉయ్యాలో’ అంటూ సాగే పాట ఆడపిల్లలకు అన్నపై ఉండే ప్రేమతో పాటు ఆనాటి చేతివృత్తులు, నేత పనితనాన్ని తెలియజేస్తుంది. ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్/బిడ్డాలెందరాయె కోల్/నీ బిడ్డ నీలగౌరు కోల్/నిచ్చెమల్లే చెట్టేసే కోల్’ అంటూ సాగే ఈ పాటలో పెరుగుతున్న చెట్టుకు, ఆడపిల్ల పోలిక చెబుతూ దేవుళ్లందర్నీ గుర్తుకు చేసుకోవడం గమనిస్తాం. ‘ఏ రాజు కురిపించే వలలో ఏడు గడియెల్లు వలలో’ అనే పాటలో బాలలు.
బతుకమ్మ పండుగను అడిగినట్లుగా పాట సాగుతుంది. ‘కలవారి కోడలు ఉయ్యాలో/కలిగి మహాలక్ష్మి ఉయ్యాలో/కడుగుతున్నది పప్పు ఉయ్యాలో/కడవలో బోసే ఉయ్యాలో’ అనే పాటలో అత్తారింటిలో ఆడపిల్లల వెతలను తెలియజేస్తుంది. శ్రీరాముని తల్లి ఉయ్యాలో/శ్రీమతి కౌసల్య ఉయ్యాలో పాటలో అత్తారింటిలో కోడలు ఏ విధంగా ఉండాలో చక్కగా తెలియజేస్తుంది. ఉయ్యాల పాటల ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టాయి గనుకనే బతుకమ్మ పాటలు సాంస్కృతిక చిహ్నంగానే కాకుండా తెలంగాణ ఉద్యమానికి ఊపిరయ్యాయి.
డా.కటుకోఝ్వల రమేష్
9949083327
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

