మనుషులను ఇన్స్టాలుగా
కుదిస్తున్న కాలం
ఎక్కడా పూర్తి పని ఉండదు
నిమిషాల్లో వాలిపోవాలి
నిండుప్రాణాలతో
జీవిత పందెం
విజేతలు ఎవరో
ఆడించే ఆటగాడు
అంతుచిక్కడు
కడుపు నింపే పోరాటం
అలిసిపోతే ఆగిపోతావ్
మారుతున్న దేశ ముఖచిత్రం
సుడిగాలిలో దీపకలిక
దీనుల గాథలు
ఆలకించని ప్రభువులు
పడి లేవని కెరటం
గంటల పనులు
గంట కొట్టినట్టు రావాలి
మొబైల్ చూసి
వేటకు వెళ్లాలి
ఆకలి వేట
ఆధునిక కనికట్టు
నిత్య ఇంద్రజాలంలో
రోడ్లను దాటాలి
పరుగులో ప్రాణాల చింతన
పదిలం కాదిక్కడ
పరుసవేది లేదిక్కడ
కాళ్లే చక్రాలు
కదలాలి తప్పదు
మిస్సయితే
దక్కని మెతుకులు
గల్లీ కుక్క కూడా
గాబరా పెడుతుంది
కన్నుమూయని దీపం
కనికరించని కాలం
కాలుదువ్వే లోకం
దయలేని దేశంలో
కనిపించని దారి దీపం
– డా. సుంకర రమేశ్ 9492180764