What is My Goal | డబ్బుతోపాటు సంతృప్తినీ ఇచ్చే పని దొరికితే అంతకన్నా గొప్ప అవకాశం లేదు. లేకపోతే చుట్టూ సౌకర్యాలుంటాయి. కానీ, మనసులో సంతోషాలుండవు. డబ్బునీ, సంతోషాన్నీ ఇచ్చే కొలువు ఎక్కడుంటుందని వెదికితే దొరకదు. ఇష్టమైన పనిని ఎంచుకుంటే వరించే అదృష్టం అది! ఆ అదృష్టం పట్టాలంటే పెద్ద గోల్ కొట్టాల్సిన పనిలేదు. ఎవరు ఏ పనికి సూటవుతారో తెలుసుకునే అవకాశం కల్పించే ‘వాట్ ఈజ్ మై గోల్’తో జతకడితే చాలు!
కోటి విద్యలు కూటి కోసమే అన్నారు. కోటి విద్యల సంగతి ఎవడెరుగు? అయిదంకెల జీతాలిచ్చే సాఫ్ట్వేర్ కొలువు మాత్రం తెలుగువాళ్లకు బాగా ఇష్టం. మన దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే ఎక్కువ జీతం, సంతోషాన్నిచ్చే ఉద్యోగాలు 255కి పైగా ఉన్నాయి. కానీ, అవేవీ మన ఆలోచనల్లోకి రావు. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలు వదిలిపెట్టి కొత్త ఉద్యోగాల్లో చేరడానికి చదువు, అనుభవం అడ్డంకి. మబ్బుల్ని చూసి కుండలో నీళ్లు పారబోసుకోకుండా చేరిన ఉద్యోగంలోనే జీవితం నెట్టుకుపోవాల్సిందే. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే పాఠశాలల్లోనే అన్ని రంగాల్లోని అవకాశాల గురించి తెలుసుకునే అవకాశం ఉండాలి అంటారు చిత్రాలి శర్మ. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఆమె సంతృప్తి లేక రకరకాల ఉద్యోగాల్లో చేరింది. మానేసింది. ఆ ఉద్యోగ జీవితంలో ఆనందం లేక తనలాగే మానేసేవాళ్లతో కలిసి ‘వాట్ ఈజ్ మై గోల్’ స్టార్టప్‌ని స్టార్ట్ చేసింది. కేవలం అవకాశాల గురించి తెలుసుకోవడమే కాదు. ఆ రంగంలో అనుభవం కూడా ఉంటే సరైన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవచ్చని చిత్రాలి వాట్ ఈజ్ మై గోల్ స్టార్టప్ ఇప్పటికే 102 పాఠశాలలతో అవగాహన కుదుర్చుకుంది. ఆ పాఠశాలల్లోని విద్యార్థులకు ఏఏ రంగాల్లో ఎలాంటి అవకాశాలున్నాయో వివరిస్తున్నది. పాఠాలు మాత్రమే కాదు… ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి క్షేత్రస్థాయికి కూడా తీసుకుపోతుంది.
‘మీరేమవ్వాలనుకుంటున్నారు?’ అని పిల్లల్ని అడిగితే.. క్రికెటర్ అనేవాళ్లు చాలామంది ఉంటారు! క్రికెటర్లకు ఉండే ఫాలోయింగ్ పిల్లలతో ఆ మాట చెప్పిస్తుంది. క్రీజులో ఉన్నంత క్రేజీగా ఉండదు క్రికెటర్ జీవితం. సాధనంత కఠోరంగా ఉంటుంది. ఆ కష్టం కంటే గ్యాలరీలో కూర్చుని కేరింతలు కొట్టిందే హాయి అనుకుంటారు. తారల జీవితం తెరమీద కనిపించినంత గొప్పగా ఉంటుందని పిల్లలు అనుకుంటారు. వాట్ ఈజ్ మై గోల్.. సినిమా కలలుకనే పిల్లల్ని రామానాయడు స్టూడియోకి తీసుకుపోయింది. సినిమా కెరీర్‌ని వాళ్లకు అర్థం చేయించడం కోసం ఫిల్మ్ స్కూల్లో డైరెక్షన్ గురించి చెప్పే లెక్చరర్‌తో ఒక సెషన్ నిర్వహించింది. తర్వాత స్క్రిప్ట్ రైటర్స్, ఎడిటర్స్ కూడా వాళ్ల బాధ్యతల గురించి చెప్పారు. తర్వాత ఎడిటింగ్ రూమ్‌కి పోయి ఎడిటింగ్ ఎలా చేస్తున్నారు చూసి నేర్చుకున్నారు. డబ్బింగ్ రూమ్‌లో ఒక రోజు కూర్చున్నారు. ఇలా 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ పిల్లలు ఎనిమిది బ్యాచ్‌లుగా విడిపోయారు. స్క్రిప్ట్ రాసుకున్నారు. స్క్రీన్ ప్లే రాసుకున్నారు. పెద్దలతో చర్చించి ప్రతి బ్యాచ్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసింది. సినిమా జీవితం ఎలా ఉంటుందో వాళ్లకు అర్థమైంది. రాత్రీ పగలూ పనిచేయడానికి సిద్ధపడేవాళ్లు ‘సినిమానే మా లైఫ్’ అని నిర్ణయించుకున్నారు. ఈ కష్టం పడలేమనుకున్నవాళ్లు ఇంకో పని చూసుకుందామనుకున్నారు. ఇలాంటి వాళ్లకు వాట్ ఈజ్ మై గోల్ ఇంకో రంగాన్ని చూపిస్తుంది.
ఐదు ఖండాల్లోని రాజ్యాల సరిహద్దులు, వాటి భౌగోళిక విశేషాలు, రాజకీయాల గురించి సాంఘిక శాస్త్రం ఎలా వివరిస్తుందో? ప్రపంచంలో ఉన్న వివిధ రంగాలు, అందులోని ఉద్యోగాల స్వభావం, ఆ ఉద్యోగుల జీవన శైలి గురించి వాట్ ఈజ్ మై గోల్ అవగాహన కల్పిస్తుంది! పని ప్రపంచంలోని వందల రకాల వృత్తుల్ని వాట్ ఈజ్ మై గోల్ 24 వర్గాలుగా విభజించింది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక డొమైన్. ఇందులో సాఫ్ట్వేర్ టెస్టర్, డెవలపర్, ఏఐ వంటి రకరకాల పనులుచేసే ఇంజినీర్లు ఉంటారు. ఈ ఉద్యోగాల్లో పని ప్రదేశం, జీతం, ఆఫీసు వేళలు, లైఫ్‌ైస్టెల్, పని ఒత్తిడి ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఒక డొమైన్. అలాగే ప్రభుత్వంలో అధికారులు, వాళ్ల కింద పని చేసేవాళ్లు ఉంటారు. వీళ్ల బాధ్యతలు, జీతాలు, పని వేళలు, ఎదురయ్యే సవాళ్లు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులను రెండు డొమైన్ల కింద విభజించారు. ఇలా వాట్ ఈజ్ మై గోల్లో చేరిన విద్యార్థి బయటి ప్రపంచంలో ఉన్న అన్ని రకాల అవకాశాల గురించి తెలుసుకుంటాడు. ఆ వృత్తి జీవితం అనుభవమవ్వాలని వారికి కొన్ని లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఆ తర్వాత వారిని ఆ పనుల్లోకి పంపిస్తారు. ఆ పని వేళలు, ఆ పనిలో ఉన్న వాళ్ల జీవితాన్ని దగ్గరగా చూస్తారు. ఇలాంటి అనుభవాలతో విద్యార్థి కెరీర్‌ని ఎంచుకోవడమే కాదు ఎంచుకున్న కెరీర్‌కి తగిన చదువులకు సిద్ధపడతాడు.
సినిమా, ఈవెంట్ మేనేజ్మెంట్, ఆతిథ్యం, మీడియా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సాఫ్ట్వేర్, డాక్టర్, పొలిటీషియన్ ఇలా.. ఏ రంగం ఎలా ఉంటుందో ప్రతి విద్యార్థీ తెలుసుకునేలా 24కి పైగా లైఫ్ స్కిల్స్‌ని వాట్ ఈజ్ మై గోల్ నేర్పిస్తుంది. ఇవి నేర్చుకున్న తర్వాత ఆ పనులు చేసే అవకాశం కల్పిస్తుంది. ఆ పనిలో సొంతంగా ప్రాజెక్టులు చేపట్టాలి. ఏ కెరీర్లో ఎంత ఆనందముందో తెలుసుకునేందుకు లక్షా 20 వేల మంది విద్యార్థులు ఈ సంస్థ నెట్‌వర్క్‌లో ఉన్నారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే వాళ్లంటారే?.. అట్లాంటి పిల్లలు ఈ నెట్‌వర్క్‌లో కూడా ఉన్నారు! ఈ సంస్థ నిర్వహించే ఆంత్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న పిల్లల్లో కొంతమంది చిన్న ప్రాజెక్ట్ చేపట్టమంటే స్టార్టప్‌లను ప్రారంభించారు. ఆ స్టార్టప్‌లకు క్లయింట్స్నూ సంపాదించారు. ఆదాయమూ ఆర్జిస్తున్నారు. విద్యార్థుల విజయాలు చూసి ‘వాట్ ఏ గోల్’ అంటున్నారు పేరెంట్స్, టీచర్స్!
మనకు ఇష్టమైన పనిలో సంతోషం ఉంటుందన్నది నిజమే. కానీ, ఆ పనిలో మనం ఫిట్ అవుతామో? లేదో? ముందే తెలుసుకోవాలి. ఒక పనిని పూర్తి చేయడానికి సామర్థ్యాలుంటే సరిపోదు. సవాళ్లను స్వీకరించే మనస్తత్వమూ ఉండాలి. నష్టాలను భరించాలి. కష్టాలను అధిగమించాలి. ఎత్తుపల్లాలు దాటితేనే గెలుపు శిఖరం చేరుకునేది. కెరీర్‌ని ప్రారంభించేవాళ్లకు ఎత్తయిన ఆ శిఖరమే కనిపిస్తుంది. ఆ దారిలోని ఎత్తుపల్లాలు తెలిసేది ప్రయాణం మొదలుపెడితేనే. ఆ కష్టాలను భరించలేక వెనుదిరిగితే.. మరో కెరీర్‌ని ఎంచుకోవచ్చు. కొత్త ప్రయాణంలోనూ ముందుకుపోతారు. కానీ, ఇతరులు మీకంటే ముందుంటారు. విలువైన జీవితకాలాన్ని నష్టపోతే అదే శిక్ష. ఆ శిక్షను తప్పించే ముందస్తు శిక్షణే ‘వాట్ ఈజ్ మై గోల్’ కెరీర్ ఎక్స్పీరియన్స్!