నెలసరి ఆలస్యమైతే చాలామంది ఒత్తిడే కారణమని భావిస్తారు. ఆ తర్వాత హార్మోన్ల సమస్యలు, బరువు పెరగడం, పీసీవోఎస్ గురించి ఆలోచిస్తారు. అయితే, డీహైడ్రేషన్ వల్ల కూడా పీరియడ్ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల నెలసరి ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని అంటున్నారు. డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు అది ఒక రకమైన శారీరక ఒత్తిడికి దారితీస్తుంది. ఫలితంగా శరీరంలో కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. దీని ప్రభావంతో పీరియడ్స్‌ను నియంత్రించే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతిని.. నెలసరి ఆలస్యమవుతుంది. అంతేకాకుండా, మెదడులోని ‘హైపోథాలమస్’ అనే భాగం.. పీరియడ్స్ చక్రాన్ని నియంత్రిస్తుంది.
తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురవ్వడం వల్ల శరీరం సర్వైవల్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. దీనివల్ల సంతానోత్పత్తి వ్యవస్థకు అందాల్సిన హార్మోన్ల సంకేతాలను మెదడు తాత్కాలికంగా నెమ్మదింపజేస్తుంది. ఫలితంగా, పీరియడ్స్ ఆలస్యమవుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. మరో కారణాన్ని వివరిస్తూ.. శరీరంలో నీరు తగ్గినప్పుడు రక్తం చిక్కబడుతుంది.
రక్త పరిమాణం తగ్గుతుంది. దాంతో గర్భాశయ ప్రాంతానికి రక్తప్రసరణ తగ్గి.. పీరియడ్స్ ఆలస్యం అవుతాయట. అందుకే, వేసవిలో డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా ఉండాలని సూచిస్తున్నారు. అయితే, ఇలా ఒకటి రెండుసార్లు పీరియడ్స్ కొద్దిగా ఆలస్యం అయితే కంగారు పడాల్సిన పనిలేదు. కానీ, ప్రతిసారీ నెలసరి ఆలస్యంగా వస్తున్నా, వరుసగా కొన్ని నెలలు రాకపోయినా.. గైనకాలజిస్టును సంప్రదించి సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.