కొంతమంది కొద్దిపాటి శారీరక శ్రమకే ఎక్కువగా అలసిపోతారు. తిన్నా నీరసించి ఉంటారు. నిద్ర రాదు. ఆకలి తగ్గుతుంది. ఇది మెగ్నీషియం లోపాన్ని సూచిస్తుంది. మెగ్నీషియం లోపం (హైపోమాగ్నోసిమియా) ఉంటే జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాళ్లలో తిమ్మిరి ఉంటుంది. కండరాల్లో నియంత్రించలేని కదలిక కలుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఏదో పెద్ద జబ్బు రాబోతుందని ఆందోళన చెందకుండా.. సరైన కారణాన్ని అర్థం చేసుకోండి.
ఈ లక్షణాలు ఉంటే ప్రతిరోజూ గుప్పెడు గుమ్మడి గింజలు తినండి. మెగ్నీషియం లోపం ఉంటే వారం రోజుల్లోనే తేడా తెలుస్తుంది. ఈ లోపం రాకుండా ఉండాలంటే నెలకు రెండు, మూడుసార్లు గుమ్మడి గింజలు తినండి. అలసట, నిద్రలేమి, కండరాల్లో చీలికలు, నొప్పులకు ఇవి మాత్రల్లా పని చేస్తాయి. ఇంట్లో అందరికీ అవసరమే కాబట్టి గుమ్మడి గింజలను దోరగా వేయించుకుని, పొడి చేసి, గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. రాగి జావలో, పాలలో, గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగితే అలసట, నిద్రలేమి వంటి సమస్యలు దరి చేరవు. మెగ్నీషియం లోపం అన్నమాటే ఉండదు.