కణ్వమహర్షి కంటబడేవరకూ శకుంత పక్షులు ఆ పసిబిడ్డను కంటికిరెప్పలా కాచుకున్నాయట! అందుకే.. శకుంతల అయ్యింది! కాళిదాస మహాకవికి దీటుగా రవివర్మ సప్తవర్ణాలతో ఆమెకు ప్రాణంపోశాడు. ఆ కావ్యనాయిక పాత్రనిప్పుడు సమంత ధరిస్తున్నది. దుష్యంతుని కాంతామణి అలంకారానికి అవసరమైన మణిమాణిక్య హారాలను డిజైనర్ నేహా అనుమోలు అందిస్తున్నారు.
‘పురాణకాలం నాటి ఆహార్యాన్ని ప్రతిబింబించేలా నేను ఆభరణాలను డిజైన్ చేశాను. రాజా రవివర్మ చిత్రాలు, చందమామ పుస్తకాల్లోని బొమ్మలు ఆ ప్రయత్నంలో ఎంతో ఉపకరించాయి’ అని చెబుతారామె. ఆ నగల విలువ ఐదారుకోట్ల పైమాటేనని అంటారు.