దురంధర్ విజయంతో బాలీవుడ్ ఫార్ములాలే మారిపోయాయి. గొప్పింటి ప్రేమకథలు, విరహగీతాలు, బలప్రదర్శనల మధ్య నిశబ్దంగా వచ్చిన ఈ తుపాను బాక్సాఫీసునే ముంచెత్తింది. దేశభక్తి, జాతీయవాదంతో వచ్చిన సినిమాలు కొత్త కాదు కానీ.. అది ఎంచుకున్న కథ, ఆ కథను నడిపించిన తీరే సినిమాను గెలిపించాయి. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలు, ప్రాంతాలతో కల్పనను కూడా నమ్మించే ప్రయత్నం ప్రభావాన్ని చూపించింది. దురంధర్ విజయంతో పాటు… అందులో పాత్రలు ఎవరివి అనే శోధన మొదలైంది. రకరకాలు పేర్లూ వినిపిస్తున్నాయి. కానీ, ఆ వినిపించే ప్రతి పేరును వెతుక్కుంటూ వెళ్తే ఓ విషాదం పలకరిస్తుంది. అనామకుడిలానో, జైల్లో మగ్గుతూనో.. నా అన్నవాళ్లందరికీ దూరంగా, శత్రువుల ఛీత్కారాలూ చిత్రహింసల మధ్య ముగిసిన జీవితాలు కనిపిస్తాయి. అవి దురంధర్లా వెలిగిపోవు. కోట్లు కాదు కదా… కుటుంబానికి కావాల్సిన కాస్త సొమ్మును కూడా కూడబెట్టవు. కానీ వెండితెరను మించిన వెలుగుని దేశానికి ఇస్తాయి.
దురంధర్ విడుదలకు ముందే.. ఆ సినిమా ఓ ఆర్మీ ఆఫీసర్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. మేజర్ మోహిత్ శర్మ తల్లిదండ్రులు తమ కొడుకు జీవితాన్ని వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ కోర్టుకి వెళ్లారు. సినిమా మీద స్టే విధించమని కోరారు. ఆ వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు కొన్ని సూచనల తర్వాత సినిమా విడుదలకు అంగీకారం తెలిపింది. ఇది ఓ కాల్పనిక కథే అని నిర్మాణ సంస్థ కోర్టుకి చెప్పినా… నిజంగానే అది మోహిత్ శర్మ జీవితం నుంచి ప్రేరణ పొందిందంటూ సాక్షాత్తు ఆ చిత్రంలో ముఖ్య నటుడు రాకేష్ బేది ఒప్పుకొన్నారు.

Major Mohit Sharma
ఎవరీ మోహిత్!
హరియానాకు చెందిన మోహిత్ చదువులోనూ, సంగీతంలోనూ అద్భుతమైన ప్రతిభ చూపించేవాడు. చూసేందుకు హీరోలా ఉండే తనని అంతా మైక్ అని ముద్దుగా పిలిచేవాళ్లు. గిటార్, మౌత్ ఆర్గాన్… తను ఏది పట్టుకున్నా శ్రోతలు గంటలకొద్దీ పరవశులు కావాల్సిందే. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువు తర్వాత మోహిత్‌కి మంచి ఇంజినీరింగ్ కాలేజిలో సీటొచ్చింది. కానీ మొదటి నుంచీ తన కల ఆర్మీనే. అందుకనే మిలటరీ అకాడమీలో శిక్షణ తర్వాత సైన్యంలో చేరాడు. కశ్మీరు చొరబాట్లను అడ్డుకోవడంలో తన తెగువను చూసిన అధికారులు గూఢచర్యానికి పంపారు.
అప్పట్లో మన దేశం మీద ప్రత్యక్ష యుద్ధమే చేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థలోకి ‘ఇఫ్తికార్ భట్’ పేరుతో చొచ్చుకుపోయాడు మోహిత్. స్థానిక వేషభాషలతో వాళ్ల నమ్మకాన్ని చూరగొని ఆ సంస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని మన సైన్యానికి చేరవేశాడు. తన ఉనికి కనిపెట్టిన ఓ ఇద్దరు తీవ్రవాదులను చంపేశాడు. ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యాక కూడా మొహిత్ విశ్రమించలేదు. కొన్నాళ్ల తర్వాత ఓ చొరబాటును ఎదుర్కొనే సమయంలో తోటి ఆఫీసర్లను కాపాడుతూ ఉండగా, తన గుండెల్లోకి తూటా దిగింది. అయినా కూడా ఓ నలుగురు తీవ్రవాదులను చంపి మరీ బతుకు పోరు ముగించాడు. స్థూలంగా ఇదీ మోహిత్ త్యాగం. హిజ్బుల్ లాంటి క్రూరమైన నాయకత్వపు నమ్మకాన్ని చూరగొనేందుకు మోహిత్ ఎంత కష్టపడి ఉంటాడు అనే ప్రశ్న చుట్టూ బహుశా ఓ కథ అల్లితే అది దురంధర్ లేదా అంతకంటే గొప్ప కథే అయి తీరుతుంది. నిజానికి భారతీయ గూఢచర్యంలో మోహిత్ మొదటివాడు కాదు… చివరా కాదు.
దశాబ్దాల క్రితమే!
1960 దశకం చివరినాటికి మన చుట్టూ ఉన్న దేశాలు స్నేహంతో కాదు.. ఒక్కో అంగుళం చొప్పున భారత్‌ను మింగేయాలన్న ఆకలితో ఉన్నాయని అర్థమైంది ప్రభుత్వానికి. ఇండో-చైనా వార్, పాక్ సరిహద్దులలో కవ్వింపులు ఇందుకు సాక్ష్యం! దాంతో గూఢచర్యం కోసం ఓ ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉన్న సంస్థ అవసరం తెలిసొచ్చింది. అదే Research and Analysis Wing (R&AW). బంగ్లాదేశ్ విముక్తి మొదల్కొని ఇండో-పాక్ యుద్ధం వరకూ చాలా సందర్భాలలో రా గూఢచర్యమే సానుకూల ఫలితాలనిచ్చింది. నిజానికి రా విధివిధానాలు ఏంటి, పనితీరు ఎలా ఉంటుంది లాంటి అంశాల్లో గోప్యత ఎక్కువ. జాతీయ భద్రతా సలహాదారుకి జవాబుదారీగా ఉండే ఈ సంస్థ బయట శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు చాలా మార్గాలే ఎంచుకుంటుందని మాత్రమే తెలుసు. అందులో ముఖ్యమైంది గూఢచర్యం. ఇందులో అధికారుల స్థాయికి దౌత్యపరమైన భద్రత ఉంటుంది. ఏదో ఓ హోదాతో వాళ్లు చెలామణీ అవుతారు. కానీ వాళ్లు నియమించుకునే ఏజెంట్లు మాత్రం మారుపేరుతో పని చక్కబెట్టుకోవాలి. పట్టుబడితే దానికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి. ఒక్కో రా ఏజెంట్ ఎంత ప్రభావం చూపిస్తాడో తెలియాలంటే మొట్టమొదటి సెలబ్రిటీ స్పై రవీంద్ర కౌశిక్ గురించి తెలుసుకోవాల్సిందే!

Ravindra Koushik
సినిమాను మించిన జీవితం!
రాజస్థాన్‌కి చెందిన రవీంద్ర కౌశిక్‌కి నటన అంటే చాలా ఇష్టం. కాలేజీలో ఉన్నప్పుడు యాక్టింగ్, డిబేట్ పోటీల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే రవీంద్రకి చుట్టుపక్కల యాసభాషల మీద కూడా మంచి పట్టుండేది. ఒక్కమాటలో చెప్పాలంటే గూఢచారికి ఉండాల్సిన లక్షణాలన్నీ తనలో పుష్కలంగా ఉన్నాయి. సహజంగానే అవి R&AW అధికారులని ఆకర్షించాయి. తనను ఏజెంట్‌గా నియమించుకుని రెండేళ్ల పాటు కఠినమైన శిక్షణ ఇచ్చారు. పాకిస్థాన్ సంప్రదాయాలు, భౌగోళిక అంశాలు మొదల్కొని అక్కడివాడిగా బతికేందుకు కావాల్సిన సమాచారం అంతా నూరిపోశారు. తన 23 ఏళ్ల వయసులో నబీ అహ్మద్ షకీర్ అనే మారుపేరుతో కరాచీ విశ్వవిద్యాలయంలో చేరి లా పూర్తిచేశాడు. పాకిస్థాన్ మిలటరీలో చొరబడి, మేజర్ స్థాయికి చేరుకున్నాడు. మరో అధికారి కూతుర్ని పెళ్లి చేసుకుని పాకిస్థానీ అల్లుడిగా మారాడు.
రవీంద్ర అకౌంట్స్ విభాగంలో పనిచేసేవాడు. సహజంగానే తనకు దేశం మొత్తం ఉన్న సైనిక స్థావరాలను సందర్శించే అవకాశం ఉండేది. దాంతో సైనిక కదలికలు మొదల్కొని అణు పరీక్షల వరకు రవీంద్ర ఎంత విలువైన సమాచారాన్ని అందించేవాడంటే, సాక్షాత్తు అప్పటి దేశ ప్రధాని ఇందిర అతనికి బ్లాక్ టైగర్ అని పేరు పెట్టిందని చెబుతారు. పాకిస్థాన్ సైన్యంలో రవీంద్ర స్థానం ఎంత భద్రంగా ఉండేదంటే… దశాబ్దాల తరబడి తను నిరాటంకంగా గూఢచర్యం చేయగలిగే పరిస్థితి. కానీ, మరో గూఢచారి నోటి నుంచి రవీంద్ర పేరు బయటపడటంతో.. రవీంద్ర ఆట ఆగిపోయింది. 18 ఏండ్ల పాటు పాకిస్థాన్ జైళ్లలో చిత్రహింసలు, అవమానాలనూ భరించి గుండెజబ్బుతో చనిపోయాడు. ‘భారత్ లాంటి గొప్ప దేశానికి సేవ చేసినవారికి దొరికేది ఇదేనా..’ అంటూ తన కుటుంబానికి రాసిన ఓ ఉత్తరంలో వాపోయాడు రవీంద్ర. కానీ వాస్తవం అంతే కదా! ఏ దేశమూ తను మరో ప్రాంతంలో గూఢచర్యం చేస్తున్నట్టు ఒప్పుకోదు.

Ibrahim Alias Kasmir Singh
ఉనికే అదృష్టం
రవీంద్రలాగానే చాలామంది గూఢచారుల జీవితాల భవితకు గ్యారంటీ ఉండదు. ఓ గూఢచారి జీవితంలో పట్టుబడని ప్రతి రోజూ అదృష్టమే! అందుకు ఉదాహరణే ఇబ్రహీంగా పేరు మార్చుకున్న కశ్మీర్ సింగ్. 1973లో పాకిస్థాన్ అధికారులకు పట్టుబడిన కశ్మీర్ సింగ్ ఏకంగా 35 ఏళ్ల పాటు అక్కడి జైళ్లలో మగ్గాడు. అందులో 17 ఏళ్ల పాటు ఓ చీకటి గదిలో సంకెళ్లతో బందీగానే ఉన్నాడు. మతిస్థిమితం కోల్పోయిన దశలో అతణ్ని విడిచిపెట్టారు.
మోహన్ లాల్ భాస్కర్ అనే మరో గూఢచారి 14 ఏళ్లపాటు అక్కడి జైళ్లలో మగ్గి, సిమ్లా ఒప్పందంలో భాగంగా స్వదేశానికి చేరుకున్నాడు. ఓ గూఢచారి జైల్లో ఎంత యాతన అనుభవిస్తాడో కళ్లకు కడుతూ An Indian Spy in Pakistan అనే ఆత్మకథ రాశారు.
వీళ్లే కాకుండా గూఢచారి అనే నిందతో దశాబ్దాలకు మించి జైలుశిక్షను అనుభవించిన సుర్జీత్ సింగ్, గోపాల్ దాస్ లాంటి వాళ్లు ఎందరో. ఇక వినిపించని పేర్లు మరెన్నో! ఒక్కోసారి సదరు వ్యక్తి గూఢచారా కాదా? అన్న పరస్పర నిందలతోనే ఆ వ్యక్తి జీవితం గడిచిపోతుంటుంది. అందుకు ఉదాహరణే కులభూషన్ జాదవ్. R&AW తరఫున బలూచిస్తాన్ ఉద్యమాన్ని రెచ్చగొట్టేందుకే తను ప్రయత్నిస్తున్నాడనీ పాకిస్థాన్, తను మాజీ నేవీ అధికారే కానీ గూఢచారి కాదని భారత్ వాదనలో ఉన్నాయి. పాకిస్థాన్‌లో ఉరిశిక్ష పడిన తనను అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా విడిపించే ప్రయత్నంలో ఉందీ మన దేశం.
సినిమా కష్టాలను మించి!
దేశం తరఫున పనిచేసే గూఢచారికి సమాజంలో ఓ సెలెబ్రిటీ స్థాయి ఉంటుంది. కానీ ఆ ఆరాధన వారిదాకా చేరదు సరికదా… ఓ కఠినమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారి సంఘర్షణ మీద ఎన్నో విశ్లేషణలే వెలువడ్డాయి.

Mohanlal Baskar
శిక్షలాంటి శిక్షణ
CIA (అమెరికా), M16 (బ్రిటన్), మొసాద్ (ఇజ్రాయెల్), KGB (రష్యా), R&AW ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూఢచర్య సంస్థలన్నీ తమ ఏజెంట్లకు చాలా కఠినమైన శిక్షణ ఇస్తూ ఉంటాయి. ఇవి చూడ్డానికి జేమ్స్ బాండ్ సినిమాలోలాగా ఆకర్షణీయంగానో ఆడుతూపాడుతూనో ఉండవు.
సంగ్రామ ధీరులు

స్వాతంత్ర సంగ్రామం నుంచే దేశంలో ఎవరో ఒక గూఢచారి తన సాహసంతో అద్భుతాలు చేసిన కథలు వినిపిస్తాయి. సుభాష్ చంద్రబోస్ తన సేనలో మిలటరీ ఇంటలిజెన్స్ కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని సృష్టించారు. అందులో చేరిన రాజమణిని దేశంలోనే తొలి మహిళా గూఢచారిగా భావిస్తుంటారు. ఓ సొంత బంగారు గని ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సరస్వతి రాజమణి బోస్ స్వతంత్ర కాంక్షను చూసి మారు ఆలోచించకుండా INAలో చేరింది. రాజమణి తన స్నేహితురాళ్లతో కలిసి మగపిల్లల వేషంలో బ్రిటిష్ మిలటరీ క్యాంప్స్ మధ్య తిరుగుతూ సమాచారాన్ని సేకరించేది. అలాంటి ఓ సందర్భంలో చిక్కుకుపోయిన తన నేస్తాన్ని కాపాడేందుకు మరోసారి క్యాంప్‌లోకి ప్రవేశించి బుల్లెట్ దెబ్బ తిన్నది. ఆజాద్ హింద్ ఫౌజ్లోనే ఉన్న మరో గూఢచారిని నీరవ్ ఆర్య. బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ అయిన తన భర్త నుంచి చంద్రబోస్‌ను రక్షించేందుకు సొంత భర్తనే పొడిచి చంపింది. అప్రూవర్‌గా మారే అవకాశం ఉన్నా జైలు శిక్షనే స్వీకరించింది. రొమ్ములు కోసేంతగా చిత్రహింసలు పెట్టినా ఒక్క రహస్యం కూడా బయటపెట్టలేదు.
చరిత్ర ఇలా ఉండేది కాదు!
గూఢచారుల ఉనికి నిశబ్దంగానే ఉండవచ్చు. కానీ వాళ్లు సాధించిన విజయాలు మాత్రం మానవ చరిత్రనే మార్చేస్తాయి. అందుకు సవాలక్ష ఉదాహరణలు కనిపిస్తాయి.
రెండో ప్రపంచయుద్ధం సమయంలో బ్రిటిష్ అధికారులు కొన్ని తప్పుడు పత్రాలను జర్మనీ కంట పడేలా చేశారు. వాటి ప్రకారం బ్రిటన్ దళాలు జర్మనీ ఆధీనంలో గ్రీస్, సార్డీనియా ప్రాంతాల మీదకు దండెత్తనున్నాయి. ఇది నిజమే అని నమ్మిన జర్మనీ తన దళాలను మొత్తం ఆ ప్రాంతాల్లోనే మోహరించింది. జర్మనీ దృష్టి మళ్లించిన బ్రిటన్ మాత్రం మరో ముఖ్య ప్రాంతం అయిన సిసిలీని వశం చేసుకుంది. ఈ ఘటన రెండో ప్రపంచయుద్ధాన్నే మలుపు తిప్పింది. ఇది మాత్రమే కాదు.. రెండో ప్రపంచ యుద్ధంలో గూఢచారులు, డబుల్ ఏజెంట్స్ పథకాలే చాలాసార్లు ఆ పోరును మలుపుతిప్పాయి.
గూఢచర్యంలో రహస్య సమాచారాన్ని చేరవేసేందుకు ఎన్క్రిప్షన్ అనే సాంకేతికత వాడతారు. చాలాదేశాలు ఇందుకోసం స్విట్జర్లాండ్‌లో తయారైన క్రిప్టో అనే యంత్రాన్ని ఉపయోగించేవి. కానీ, చాలామంది కనిపెట్టలేని విషయం ఏమిటంటే ఈ క్రిప్టో యంత్రాల మీద అమెరికా, జర్మన్ గూఢచారి సంస్థల పట్టు ఉండేది. అలా ఏకంగా అయిదు దశాబ్దాల పాటు వంద దేశాల రహస్యాలను తెలుసుకున్న అమెరికా… తరచూ పెద్దన్న పాత్రను పోషించేందుకు, తగవులను పెంచేందుకు ఉపయోగించుకుంది. ఇవే కాదు! బిన్ లాడెన్‌ను పట్టుకోవడం దగ్గర నుంచీ ఇరాన్ అధినేత ఖమేనీ మరణం వరకూ ప్రతి వ్యూహంలోనూ, ప్రతి యుద్ధంలోను గూఢచర్యానిదే ముఖ్యపాత్ర.
కోల్డ్ వార్ సమయంలో అమెరికా, రష్యా దేశాలు భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి. ఓ సందర్భంలో రెండు దేశాల్లో ఒకటి వీటిని శత్రుదేశం మీద ప్రయోగించే పరిస్థితులు వచ్చాయి. కానీ ఒలెగ్ గోర్డెవ్క్సీ అనే గూఢచారి.. రష్యా అణు రహస్యాలనీ, ఆ దేశం తరఫున పనిచేస్తున్న గూఢచారుల వివరాలను తవ్వితీయడంతో.. గుట్టు బయటపడి రష్యా గుంభనంగా ఉండిపోయిందని చెబుతారు.

సినిమాలకు ప్రేరణ
గూఢచారుల జీవితాల ఆధారంగా చిత్రాలు నిర్మించడం అనేది బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే ఉంది. సూపర్ స్టార్ కృష్టలాంటివాళ్లు ఆ జోనర్లో చేసిన అద్భుతాలు ఓ చరిత్ర. కానీ నిజమైన ఏజెంట్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రాలు తక్కువే. ఈమధ్య వచ్చిన దురంధర్‌లో మోహిత్ నుంచి అజిత్ దోవల్ వరకు చాలామంది జీవితాలు ప్రేరణగా ఉన్నాయి. ఓ ఏడేండ్ల పాటు పాకిస్థాన్‌లో గడిపిన అజిత్, అక్కడి అణు రహస్యాలను తెలుసుకునేందుకు బిచ్చగాడిలా కూడా జీవించాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఏక్ థా టైగర్’కి ప్రేరణ రవీంద్ర కౌశిక్ అని చాలామంది నమ్మకం. రవీంద్ర కుటుంబం కూడా ఈ విషయమై చిత్ర బృందాన్ని నిలదీసింది. ఇక 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో శత్రుదేశంలోకి చొరబడి, అక్కడి ఆర్మీ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుని కీలకమైన సమాచారాన్ని సేకరించిన సెహమత్ ఖాన్ జీవితం ఆధారంగానే అలియా భట్ ‘రాజీ’ చిత్రం వచ్చింది. ఇక గూఢచారి కాకపోయినా తప్పుడు ఆరోపణలతో పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న ఓ అమాయకుడు సరబ్ జీత్ జీవితం ఆధారంగా అదే పేరుతో ఓ సినిమా వచ్చింది.
చరిత్రలో అడుగడుగునా
మన దేశంలో రాచరికానికి ఎంత చరిత్ర ఉందో… గూఢచర్యానికి కూడా అంతే చరిత్ర ఉంది. రామాయణంలాంటి ఇతిహాసాల్లోనూ గూఢచారుల పాత్రలు కనిపిస్తాయి. కౌటిల్యుని అర్థశాస్త్రంలో గూఢచర్యం గురించి చాలా స్పష్టమైన విశ్లేషణ కనిపిస్తుంది. మౌర్య సామ్రాజ్య విస్తరణలో వీళ్ల పాత్ర ఎక్కువే! బ్రిటిష్ పాలన వచ్చాక చోరవృత్తి పాటించే థగ్స్ జాతివాళ్లతో గూఢచర్యం చేయించేవాళ్లు. మొదట్లో సాటి థగ్స్ని పట్టించేందుకు మొదలైన ఈ Thuggee and Dakaiti Department తర్వాత కాలంలో పాలనాపరమైన నిఘాకు కూడా ఉపయోగపడింది. కాలంతో పాటు పేర్లనీ, ప్రభుత్వాలనీ మార్చుకుంటూ అది CID గా స్థిరపడింది.
రెండువైపులా పదునైన కత్తి
ఒకేసారి రెండు దేశాలకీ గూఢచారిగా ఉన్నట్టు నటించేవాడే డబల్ ఏజెంట్. నమ్మకాన్ని సంపాదించడం కోసమో లేకపోతే పట్టుబడిన తర్వాత రాజీ కోసమో చేసే పని ఇది. అతి తెలివితో ఇద్దరి దగ్గరగా డబ్బులు సంపాదించే పథకమూ కావచ్చు. కానీ పనితో పాటు ప్రమాదమూ రెట్టింపుగానే ఉంటుంది. చరిత్రలో డబుల్ ఏజెంట్‌గా పనిచేసిన వాళ్లందరూ కూడా దారుణమైన ముగింపును అందుకోవడమే ఇందుకు ఉదాహరణ. ఫ్రాన్స్, జర్మనీలకు డబుల్ ఏజెంట్‌గా పనిచేస్తూ… ఇద్దరి దగ్గరా డబ్బులు తీసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడిపింది మాతా హరి.
తను అందించిన సమాచారం వేలమంది సైనికుల మరణాలకు కారణం అయ్యిందని చెబుతారు. చివరికి ఫ్రెంచ్ ఫైరింగ్ స్క్వాడ్ చేతిలో చనిపోయింది.
జేమ్స్ బాండ్ నుంచి గూఢచారి 116 వరకూ… గూఢచారుల జీవితాల్లో ఉండే తెగువ, దేశభక్తి, సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. కానీ, నిజమైన గూఢచారులు అపరిచితులుగానే ఉంటారు.
ఆ అజ్ఞాతవీరుల క్షేమం కోసం ప్రార్థిద్దాం. విధులు ముగిశాక… ప్రభుత్వమూ, సమాజమూ తగినంత గుర్తింపునీ, సౌకర్యవంతమైన జీవితాన్నీ అందించాలని కోరుకుందాం.
…? కె.ఎల్.సూర్య