గృహాలంకరణలో కించిత్ బీభత్స భయానక రసాలను జోడించడం.. సరికొత్త ట్రెండ్. ఇంటికొచ్చిన అతిథులు ‘అబ్బా..’ అనగానే సరిపోదు, ‘బాబోయ్’ అంటూ భయపడిపోవాలి. అందుకే, డ్రాయింగ్ రూమ్ గోడకు దడ పుట్టించే ఫొటోలు, పెయింటింగ్స్ వేలాడదీస్తున్నాయి.
ఫ్లోర్ మీద రక్తపు మరకల ఎఫెక్ట్ ఇస్తున్నారు. కాలింగ్బెల్ నొక్కగానే ఏ కొరివి దయ్యమో వికటాట్టహాసం చేస్తున్న శబ్దం వస్తుంది. ఎవరైనా గుమ్మం దగ్గర ‘స్వాగతం’ బోర్డు పెడతారు. ఇక్కడ మాత్రం ‘గుండెజబ్బు రోగులకు, డబ్బు నిండినవారికి ప్రవేశం లేదు’ తరహా హెచ్చరికలు కనిపిస్తాయి. ఇదోరకం పిచ్చి.