నయా రేడియో
దేశంలో రేడియో సేవలు మొదలై వందేళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ ‘ఆకాశవాణి’కి అదే ఆదరణ కనిపిస్తున్నది. ఆల్ ఇండియా రేడియోతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఎఫ్ఎం చానెళ్ల రాకతో.. ఆయా ప్రసారాలను వినే శ్రోతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. టీవీలు, ఇతర సామాజిక మాధ్యమాలు వచ్చినా.. ‘రేడియో’ అంటే క్రేజ్ మాత్రం తగ్గడంలేదు. ఆ క్రేజీని దృష్టిలో పెట్టుకొని.. లోవే సంస్థ సరికొత్త రేడియోను తయారుచేసింది. అత్యాధునిక ఫీచర్లలో వస్తున్న ఈ రేడియో.. 60హెచ్ నుంచి 22000హెచ్ ఫ్రీక్వెన్సీ మధ్య సిగ్నల్స్‌ను అందుకుంటుంది. అంతేకాదు, వీ 5.0 బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసి.. దీన్ని మ్యూజిక్ ప్లేయర్‌గానూ వాడుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే.. 14 గంటలపాటు పాటలు వినొచ్చు. 28 వాట్స్ క్రిస్టల్ క్లియర్ సౌండ్, 2.6 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లే, యూఎస్బీ – సీ ద్వారా చార్జింగ్, అలారం క్లాక్.. ఇందులోని అదనపు ఫీచర్లు. కెనెడియన్ ఓక్ చెక్కతో యూనిక్ డిజైన్‌తో తయారైన ఈ రేడియో ఖరీదు రూ.20,000. int.loewe.tv ద్వారా కొనుగోలు చేయవచ్చు.
పోషకాల కోసం విప్రో!
ఆరోగ్య సంరక్షణకు పండ్లరసాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే, బయట దొరికేవాటిలో నాణ్యత తక్కువ. ఇంట్లో చేసుకుందామంటే.. మామూలు జ్యూసర్లతో పండ్లలోని విటమిన్లు, మినరల్స్ పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే, భారతీయ దిగ్గజ సంస్థ విప్రో.. అత్యాధునిక కోల్డ్‌ప్రెస్ జ్యూసర్‌ను తీసుకొచ్చింది. సాధారణ జ్యూసర్లలా కాకుండా.. ఇది పండ్లను పిండి, రసాన్ని తీస్తుంది. తక్కువ ఆర్పీఎం (55 ఆర్పీఎం) వల్ల పండ్లలో పోషకాలే కాదు.. రుచి కూడా కోల్పోకుండా ఉంటుంది. ఇందులోని మరో విశేషం.. రివర్స్ ఫంక్షన్ టెక్నాలజీ. ఒకవేళ పండ్లగుజ్జు లోపల ఇరుక్కుపోతే.. ఈ సాంకేతికత ద్వారా బయటికి తీసే వెసులుబాటు ఉన్నది. దీన్ని శుభ్రం చేసుకోవడం కూడా ఎంతో సులభం. అందుకోసం ప్రత్యేకంగా క్లీనింగ్ బ్రష్‌ను కూడా అందిస్తున్నారు. విప్రో నుంచి రెండేండ్ల వారంటీతో వస్తున్న ఈ కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్ ధర రూ.16,199. అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.
వ్యాయామం.. ఇక తేలికగా
నిత్యం వాకింగ్, జాగింగ్‌లాంటి వ్యాయామాలు చేసేవారు సరైన బూట్లను ఎంపిక చేసుకోవాలి. తక్కువ బరువు ఉండటంతోపాటు చెమట పట్టకుండా ఉండాలి. ప్రఖ్యాత బూట్ల తయారీసంస్థ బ్రూక్స్.. తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ‘లాంచ్ 10’ బూట్లు ఈ కోవలోకే వస్తాయి. కాళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడంలాంటి సమస్యలను ఈ తేలికపాటి బూట్లు నివారిస్తాయి. జాగింగ్ సమయంలో ఎదురయ్యే మరో సమస్య.. అధిక చెమట. ఎందుకంటే, వ్యాయామం చేసినంతసేపు బూట్లను ధరించాల్సి ఉంటుంది. కాబట్టి, కాళ్లకు గాలి ప్రసరణ బాగా జరిగేలా, అధిక చెమట, అసౌకర్యాన్ని నివారించేలా.. ఈ బూట్ల తయారీలో బ్రీతబుల్ మెటీరియల్‌ను ఉపయోగించారు. వివిధ రంగులు, ైస్టెల్స్లోనూ దొరుకుతాయి. వ్యాయామం కోసమే కాదు.. రెగ్యులర్‌గా వాడేందుకు అనువుగా, అన్ని దుస్తులకూ నప్పేలా వీటిని తీర్చిదిద్దారు. కంఫర్ట్‌తోపాటు సపోర్ట్‌నూ అందించే ఈ బూట్ల ధర రూ.11,999. brooksrunning india.com ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
అద్దాలు ధరిస్తే.. అద్భుతమే!
ఏఆర్ (అగ్మెంటెడ్ రియాలిటీ) గ్లాసెస్.. ఓ సాంకేతిక చమత్కారం. అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వివిధ కంపెనీల ఏఆర్ గ్లాసులు బరువుగా, పెద్దవిగా ఉన్నాయి. దీంతో వాటికి ఆదరణ అంతగా లభించడంలేదు. దీన్ని గమనించిన రాకిడ్ సంస్థ.. తేలికపాటి, చూడటానికి సాధారణ కళ్లద్దాల్లా ఉండేలా ఏఆర్ గ్లాసెస్‌ను తీసుకొచ్చింది. యూజర్ ఫ్రెండ్లీ డిజైన్‌తో వస్తున్న ఈ గ్లాసెస్ పెట్టుకుంటే చాలు.. కళ్లముందు 215 అంగుళాల తెర ప్రత్యక్షమవుతుంది. దానిపై 3డీ సినిమాలూ చూడొచ్చు, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. వైఫై 5, బ్లూటూత్ 5.0, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ.. ఇందులోని అదనపు ఫీచర్లు. కేవలం 148 గ్రాముల బరువు ఉండటం వల్ల కళ్లపై ఒత్తిడిపడదు. సాంకేతికతను మరో మెట్టు ఎక్కించిన ఈ ఏఆర్ గ్లాసెస్ ధర రూ.89,999. global.rokid.comలో లభిస్తాయి.