కిక్ బాక్సింగ్‌ను తేలిగ్గా తీసుకుంటాం. ఏ పతకాల వేటగాళ్లకో సంబంధించిన వ్యవహారంగా భావిస్తాం. నిజానికి కిక్ బాక్సింగ్.. శరీరానికి, మనసుకు మధ్య అనుసంధానకర్తలా వ్యవహరిస్తుంది. బరిలో ఉన్నప్పుడు.. చాలా ఎరుకతో వ్యవహరించాలి. లేకపోతే ఓటమి ఖాయం. ఈ వ్యూహాత్మక అప్రమత్తత మెదడును చురుగ్గా ఉంచుతుంది. వారానికి ఐదు రోజులు, రోజూ ఓ గంట చొప్పున సాధన చేస్తే.. మనం ఆక్సిజన్‌ను తీసుకునే సామర్థ్యమూ వృద్ధి అవుతుంది. ఊబకాయాన్ని వదిలించుకోవడానికి కిక్ బాక్సింగ్ తిరుగులేని మార్గమని చెబుతారు. ప్రతి కిక్.. మన బుర్రలోని ఒత్తిడిని తరిమేస్తుంది. అర్థంలేని ఉద్వేగాలు దూరమవుతాయి. కాకపోతే, నిపుణుల పర్యవేక్షణలోనే సాధన చేయాలి. శారీరకంగా, మానసికంగా సమస్యలను ఎదుర్కొనే మహిళలకు కిక్ బాక్సింగ్ అవసరం చాలా ఉంది.