‘గుండమ్మ కథ’ ఓ క్లాసిక్. ఆ సినిమాలో సూర్యకాంతం నటన చూసిన తర్వాత ఆ పేరు పెట్టుకోవడానికే ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ, ఓ అమ్మాయి మాత్రం ఏకంగా ఆమె పాత్రలో నటించేందుకు సిద్ధమైంది. జీ తెలుగు ‘గుండమ్మ కథ’ హీరోయిన్, కన్నడ కస్తూరి హర్షల హనీ తేనెలూరే తెలుగులో పంచుకున్న సీరియల్ ముచ్చట్లు..
ఉపోద్ఘాతం లేకుండా నేరుగా పాయింట్కొచ్చేస్తా. నా పేరు హర్షల హనీ. కొందరు హర్ష అంటారు. కొందరు హనీ అంటారు. మాది బెంగళూరు. నటన నాకు కొత్తేం కాదు. నా ఆరేళ్లప్పుడే అమ్మ ప్రోత్సాహంతో కెమెరా ముందు దుమ్ము రేపేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు గ్యాపే లేదు. ఒకదాని తర్వాత ఒకటి.. అవకాశాలు వస్తూనే ఉన్నాయి. చైల్డ్ ఆర్టిస్టుగా చాలామంది నన్ను గుర్తు పడతారు. కన్నడ, తమిళ భాషల్లో చిన్నప్పుడే అవకాశాలు వచ్చాయి. కానీ పెద్దయ్యాక కాలేజ్ గర్ల్, హీరోయిన్ ఫ్రెండ్ లాంటి పాత్రలకే పరిమితం అయ్యాను. దీనికి కారణం.. నేను కాస్త బొద్దుగా ఉండటమే. అప్పుడు నేను టెన్త్ క్లాసులో ఉన్నా అనుకుంటా. ఆ సమయంలో వచ్చిన ‘యారీ మోహిని’ అనే హారర్ సీరియల్లో నా నటనకు మంచి పేరొచ్చింది. అంతకు ముందు కూడా ఐదారు సీరియల్స్‌లో నటించా. ‘బొద్దుగా ఉన్నవాళ్లు హీరోయిన్లు కాకూడదా ఏమిటి?’ అనే పట్టుదలతో.. టీవీ సీరియల్స్‌లో చాలా ప్రయత్నించా. కానీ కన్నడంలో, తమిళంలో అవకాశాలు రాలేదు. తెలుగులో ‘గుండమ్మ కథ’ టీమ్ నుంచి పిలుపు వచ్చింది. ఏదో ఒక పాత్ర ఇచ్చారులే అనుకున్నా. కానీ.. కెమెరా ముందుకు వెళ్లేవరకూ తెలియదు, ఆ సీరియల్లో నేనే హీరోయిన్ అని. ఎంత సంతోషంగా అనిపించిందో! అంతలోనే చిన్న సందేహం.
అంత పెద్ద సినిమా పేరును పెట్టి తీస్తున్న సీరియల్‌కు నన్ను హీరోయిన్గా తీసుకున్నారంటే మొదట్లో నమ్మలేదు. షూటింగ్ అవుతున్నకొద్దీ నమ్మక తప్పలేదు (నవ్వుతూ..) చిన్నప్పటి నుంచీ యాక్టింగ్‌లో ఉన్నానని చెప్పా కదా? అలా అని, చదువులో బ్యాక్‌బెంచ్ స్టూడెంటేమో అనుకునేరు. కానే కాదు. పరీక్ష రాశామంటే మినిమమ్ 90 పర్సెంట్ రావాల్సిందే. ఒకసారి ఎగ్జామ్‌లో నా వెనుక ఉన్నవాళ్లకు ఆన్సర్ చూపిస్తుంటే హఠాత్తుగా స్కాడ్ వచ్చారు. డిబార్ అయిపోయేదాన్నే. రెప్పపాటులో మిస్సయింది. అదేంటో.. ఒక్కసారి చదివితే చాలు. నాకు గుర్తుండి పోతుంది. ఏకసంథాగ్రాహి టైపు! అందుకేనేమో ఇప్పటివరకూ ఒక్క సప్లిమెంటరీ కూడా రాయలేదు. ప్రస్తుతం బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నా. కాలేజ్‌లో నన్నొక సెలెబ్రిటీలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ‘గుండమ్మ కథ’ అయిపోయే వరకూ మరో సీరియల్ చేసే ఆలోచన లేదు. తెలుగు ప్రేక్షకులు చాలా మంచివాళ్లు. అందరినీ ఆదరిస్తారు. అవకాశాలిస్తారు. నేను తెలుగులో గలగలా మాట్లాడేస్తుంటే.. ‘ఇంత తెలుగు ఎప్పుడు నేర్చుకున్నావ్?‘ అని అడుగుతుంటారు. దానికి ఓ కారణం ఉంది. మా తమ్ముడు, నాన్న తెలుగు సినిమాల అభిమానులు. ఇంట్లో కన్నడ సినిమాల కంటే తెలుగు, తమిళ సినిమాలే ఎక్కువగా చూస్తారు. అలా నాకు తెలుగు వచ్చేసింది. ఇక డ్రెస్సింగ్ విషయానికొస్తే.. కంఫర్ట్‌కు ప్రయారిటీ ఇవ్వాలనేది నా అభిప్రాయం. నేను ఎక్కువగా ప్యాంట్ షర్ట్ వేసుకుంటా. పండగలప్పుడు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు మాత్రం ట్రెడిషనల్ డ్రెస్సింగ్ ఫాలో అవుతాను. ‘లావుగా ఉన్నవాళ్లు అలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు. సూట్ కావు’ అని కామెంట్స్ చేస్తారు చాలామంది. అవన్నీ పట్టించుకోవద్దు. మనకు కంఫర్ట్‌గా ఉన్నదే వేసుకోవాలి. నా ఫ్యాషన్ సూత్రం ఇదే.
-ప్రవీణ్ కుమార్ సుంకరి