జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి సలహాలిచ్చే లైఫ్కోచ్లు ఉన్నారు. పెద్ద జీతాలొచ్చే ఉద్యోగాల కోసం నైపుణ్యాలు నేర్పే నిపుణులు ఉన్నారు. ‘రిచ్ డాడీ.. పూర్ డాడీ’ లాంటి రచయితలు ఉన్నారు. ‘విజయానికి మెట్లు’ చెప్పే రచయితలు మెట్టుకొకరు ఉన్నారు. చదువురాని వాళ్లకోసం.. ఇళ్లలో పని మనుషులు, రోడ్లు ఊడ్చే కార్మికులు, రోజువారీ కూలీల కోసం మాత్రం బడ్జెట్ రాణులున్నారు. ఆర్థిక పాఠాలు నేర్చుకుంటూ, తోటివారికి నేర్పుతూ సంపాదన, పొదుపు.. జీవితానికి రెండు కళ్లని చెబుతూ చీకటి జీవితాల్ని వెలుగుదారుల్లోకి నడిపిస్తున్నారు.
ఓ షాపింగ్ మాల్‌కు వచ్చింది గౌతమి. ఇలాగ వెళ్లి తనకు కావాల్సిన నాలుగు వస్తువులు సెలెక్ట్ చేసింది. ఎంత వేగంగా వచ్చిందో.. అంత స్పీడ్‌గా కౌంటర్ దగ్గరికి వెళ్లింది.‘ఎలాగూ వచ్చాం కదా! ఇంకా ఏమైనా తీసుకో!’ అన్నాడు వాళ్లాయన. ‘వద్దులే’అన్నది గౌతమి. ‘పిసినారి నారి’ అని దెప్పిపొడిచాడు ఆయన.‘ఇది పీనాసితనం కాదు.. పొదుపు! మన బిడ్డ భవిష్యత్తు కోసం డబ్బు దాచొద్దూ!’ అందామె! ‘ఎప్పుడొచ్చినా.. హ్యాండ్‌బ్యాగ్‌లో డబ్బులు ఖాళీ చేసేదానివి. ఇప్పుడేంటి కొత్తగా’ అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఆయన.‘నేను బడ్జెట్ రాణి అయినప్పటి నుంచి’ అని చెప్పింది గౌతమి. ‘బడ్జెట్ రాణి! అంటే?’ అంటూ ఆశ్చర్యంగా అడిగాడతను.
గౌతమిది హైదరాబాద్‌లోని అశోక్‌నగర్. ఆమె ఒకప్పుడు ల్యాబ్‌లో పనిచేసేది. ఇప్పుడు సొంతంగా చిన్న ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్నది. ఆమె భర్త ఉద్యోగం చేస్తాడు. ఇద్దరి ఆదాయం కలిసి నెలకు సుమారు రూ.55 వేలు. అందుకు తగ్గట్టు ఖర్చు చేసేవాళ్లు. బస్తీల్లో పేద మహిళల కోసం పనిచేస్తున్న యుగంతర్ సంస్థ డబ్బు సంపాదన, పొదుపు గురించి ఆడవాళ్లకు చెబుతుంటుంది. రాత్రి బడులు నిర్వహించి పెద్దవాళ్లకు అక్షరాలు నేర్పినట్టే బస్తీలోని ఆడవాళ్లకు డబ్బు పాఠాలు నేర్పుతుంది. సంపాదనలో ఎంత ఖర్చు చేయాలి? ఎంత పొదుపు చేయాలో అర్థమయ్యేలా వివరిస్తారు యుగంతర్ ప్రతినిధులు. వాటిని ఆచరించేందుకు తగిన సహకారమూ అందిస్తారు. బస్తీల్లో చదువుకున్న ఆడవాళ్లను వలంటీర్లుగా నియమించుకొని పొదుపు మంత్రం ఉపదేశిస్తారు. యుగంతర్ సమావేశాలకు హాజరయ్యే వారంతా ‘బడ్జెట్ రాణులే..’. అలాంటి సమావేశంలో పాల్గొన్న తర్వాతే గౌతమి ఖర్చులు రాయడం మొదలుపెట్టింది.
‘ఒకసారి లెక్కల పద్దు చూస్తే.. ఈ ఏడాది జనవరిలో నేను చేసిన ఖర్చు రూ.30వేలు. అందులో అనవసరమైన ఖర్చులన్నీ షాపింగ్ మాల్ బాపతు అనిపించింది. మ్యాచింగ్ జువెలరీ, డ్రెస్‌ల జోలికి వెళ్లకుంటే ఖర్చు తగ్గుతుందనిపించింది. మాల్స్ జోలికి వెళ్లొద్దనీ, వెళ్లినా జువెలరీ వంక చూడొద్దనీ నిశ్చయించుకున్నా. తర్వాతి రెండు నెలలూ నా ఖర్చులు నెలకు రూ.20 వేలు దాటలేద’ని చెబుతుంది గౌతమి. ‘రేపటి అవసరాల కోసం పొదుపు’ అనేది బడ్జెట్ రాణి ఎజెండా! వీరు చెప్పే పాఠాల్లో మొదటిది ‘మా సంపాదన ఎంతని పొదుపు చేస్తాం!’ అనే ఆలోచన మానుకోవాలని చెబుతారు! ‘ఎంతైనా సంపాదించండి. దానిలో 40 శాతం పొదుపు చేయాల’ని ఇక్కడ నేర్పుతారు.
పొదుపు మంత్రం
‘మేం బస్తీల్లోని అడవారిని కదిలిస్తే.. ‘అసలు మాతాన పైసలు మిగిలితే కదా పొదుపు చేయనీకి’ అని సమాధానం చెబుతార’ని అంటారు యుగంతర్ సీఈవో తేజస్విని. ఈ ఆలోచన నుంచి బయటపడేయడానికి వాళ్లు ప్రతి నెలా ఖర్చులు రాయడం ఒక్కటే పరిష్కారం అంటారామె! ఆ ఖర్చులు అవసరమో, లేదో తర్వాత ఆలోచించుకోమని చెబుతారు. పద్దు రాయడం వల్లే గౌతమిలాగే చాలామంది పొదుపు నేర్చుకొని బడ్జెట్ రాణులు అనిపించుకుంటున్నారు. మౌలాలిలో ఉండే శైలజ ఓసారి ‘బడ్జెట్ రాణి’ మీటింగ్‌కు వెళ్లింది.
ఆమె, తన భర్తతో కలిసి చిన్నచిన్న పనులు చేస్తుండేది. సంపాదించిన దాంట్లో కొద్దిమొత్తం దాచుకునేది. అలా మిగిలిన డబ్బుతో లక్ష రూపాయల చీటీ కట్టారు. చీటీ నిర్వాహకులు చేతులెత్తేయడంతో నిండా మోసపోయారు. ‘బడ్జెట్ రాణి’ మీటింగ్ తర్వాత తన సంపాదనలో మిగిలిన మొత్తం బ్యాంకులో దాచుకోవడం మొదలుపెట్టింది. బ్యాంకులు ఇచ్చే వడ్డీ, అక్కడి స్కీమ్‌లు, బీమా వీటన్నిటి గురించి తెలుసుకుంది. బడ్జెట్ రాణి పరిజ్ఞానంతో ఖర్చులు రాసుకుంటూ, ఖర్చులు తగ్గించుకుంటూ ఉన్నంతలో ఉన్నతంగా బతకడం నేర్చుకున్నారు. వేలువిడిచిన బంధువుల ఇండ్ల వేడుకలకు వెళ్లడం మానేశారు. పిల్లల పుట్టిన రోజులు, ఇతర వేడుకలను నిరాడంబరంగా చేసుకోవడం మొదలుపెట్టారు.
చిరుతిండ్లకూ చెక్
చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసేవాళ్లకే పొదుపు. రెక్కలు ముక్కలు చేసుకునేవాళ్లకు ఆ పాఠాలేం అవసరంలేదని పేదల భావన. కానీ, కూలీలూ పొదుపు చేయాలంటుంది షబానా బేగం. పాలమూరు పల్లె నుంచి పొట్టచేత పట్టుకొని భర్తతో బస్తీలో అడుగుపెట్టిందామె. ఆమె భర్త పూలదండలు కడుతుంటాడు. తనేమో కుట్టుపని చేస్తుంది. నలుగురు పిల్లలు. తమ పేదరికం ముందు తరాలకు శాపం కావొద్దనుకుంది షబానా.
ఆ కల నిజం చేసుకోవడానికి ‘బడ్జెట్ రాణి’ నేర్పిన ఆర్థిక పాఠాలు ఆమెకు కొత్త వెలుగు చూపాయి. బిడ్డల చదువు ఆగిపోకుండా దారి చూపింది. ఇప్పుడు ఒకరు బీ ఫార్మసీ, ఒకరు బీ కామ్, మూడో బిడ్డ ఇంటర్, ఇంకొకరు పదో తరగతి చదువుతున్నారు. నెలవారీ ఖర్చుల నియంత్రణతో పిల్లల చదువు సాధ్యమైంది అంటారు షబానా. ఈ క్రమంలో పిల్లలకు చిరుతిండ్లు ఇప్పించడం కూడా మానేశానని చెప్పిందామె. అదేదో ఇంట్లో తనే చేసి పెడుతుందట. చేతికొచ్చిన కొడుకులిద్దరూ త్వరగా కొలువుల్లో కుదురుకుంటే తమ జీవితాలు మరింత మెరుగవుతాయని అంటున్నది.
డిజిటల్ బడ్జెట్
బడ్జెట్రాణిలో సంపాదన పొదుపు చేయాలనే ఆలోచన పెంచడమే కాదు, ‘మా ఆయన సంపాదిస్తున్నాడు, ఇల్లు బాగానే నడుస్తుంది’ అని ఇంటిపట్టున ఉండే ఆడవాళ్ల మనసూ మారుస్తుంది. మహిళల సామర్థ్యాలు, చదువును బట్టి ఏదో ఒక పనిచేసేలా బడ్జెట్ రాణి పాఠాల్లో చెబుతారు. స్థానికంగా ఉపాధి అవకాశాల గురించి తెలియజేస్తారు. ఇలా ఆడవాళ్లకు ఆర్థిక పాఠాలు బోధిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ గురించి కూడా నేర్పుతున్నారు. చిన్నచిన్న ఉద్యోగాలు, ఆర్థిక లావాదేవీల కోసం డిజిటల్‌గా ప్రోత్సహిస్తున్నారు. చదువురాని వాళ్లు కూడా ఫీచర్ ఫోన్లలో వాయిస్ ఇంటరాక్షన్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసేలా తీర్చిదిద్దుతున్నారు బడ్జెట్ రాణి నిర్వాహకులు.
మాల్స్‌కు వెళ్లడం మానేశా
మూడు వేలు తీసుకొని షాపింగ్‌మాల్‌కు వెళ్తే.. బిల్లు పదివేలు అయ్యేది. కనిపించిందల్లా కొనేసేదాన్ని. బడ్జెట్ రాణిలో చేరిన తర్వాత ఖర్చులు తగ్గించడం అలవాటైంది. మాల్స్‌కు వెళ్లడం మానేశా. ఇంటి దగ్గరే కిరాణా దుకాణంలో కావాల్సినవి తెచ్చుకుంటున్నా. ఇంటి దగ్గర ట్యూషన్స్ చెబుతూ డబ్బులూ సంపాదిస్తున్నా. జాగ్రత్తగా దాచుకుంటున్నా.
– రెంటపల్లి శ్రీలత
పొదుపే మనకు అండ
‘నేను ఒకప్పుడు ఇంటిపని కార్మికుల సంఘంలో ఉండేదాన్ని. నేను, మా ఆయన ఇద్దరం పనిచేసేవాళ్లం. పొదుపు అంటే అసలే తెలియదు. బడ్జెట్ రాణిలో చేరాకే డబ్బు విలువ తెలిసింది. వారాంతాల్లో సినిమాలకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు రెండువారాలకు ఒకటి చూడటం మొదలుపెట్టాం. కొత్తదుస్తుల కొనుగోలు తగ్గించేశాం. ఇద్దరు పిల్లలు మేనేజ్మెంట్ చదివారు. వాళ్ల చదువుల కోసం బ్యాంకు రుణం తీసుకున్నాం. రుణం తీర్చేశాం. ఇప్పుడు ఇద్దరు పిల్లలూ పెద్ద కంపెనీల్లో మేనేజర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా, చిన్నచిన్న ఉద్యోగాలు చేసే పేదవాళ్లతో మాది పాతికేళ్ల అనుబంధం. అందుకే, యుగంతర్లో వలంటీర్‌గా పనిచేస్తున్నా. నాలాంటి బడ్జెట్ రాణుల్ని తయారుచేస్తున్నా!
– ఆన్ జోసెఫ్
…? నాగవర్ధన్ రాయల
భాస్కర్