పంటినొప్పి. మంచినీళ్లు తాగినా పళ్లు జివ్వుమంటాయి. పిప్పి పన్ను. పీకించుకోవాల్సిందే. ఇలాంటి సమయాల్లో దగ్గర్లో మంచి డెంటిస్టు ఉన్నారా? అని వెతుకుతాం.
మిగతా వైద్య విభాగాల సంగతి ఎలా ఉన్నా.. దంత చికిత్సకు మాత్రం.. మహిళా డెంటిస్టులే ఉత్తమం అని గ్లోబల్ డెంటల్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ సర్వే చెబుతున్నది. ఎందుకంటే..
మహిళలకు ఓపిక ఎక్కువ. మన బాధంతా వింటారు. ప్రేమగా మాట్లాడతారు. సానుభూతి కురిపిస్తారు. కొన్ని విషయాలు చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు.
పురుషులతో పోలిస్తే మహిళల చేతులు చిన్నగా ఉంటాయి. రోగికి ఏమాత్రం అసౌకర్యం లేకుండా.. నోటి వరకూ వెళ్తాయి. దీనివల్ల దంత చికిత్స సులభం అవుతుంది.
దంత చికిత్స అనగానే ఓరకమైన భయం ఉంటుంది. ఒత్తిడి మొదలవుతుంది. పురుష డెంటిస్టుతో పోలిస్తే .. మహిళా దంతవైద్యుల సమక్షంలోనే రోగి ఒత్తిడిని అధిగమించగలడని తాజా సర్వే చెబుతున్నది.
ఈ మధ్య చిన్నపిల్లలకూ దంత సమస్యలు వస్తున్నాయి. చిన్నారులు మహిళా డెంటిస్టుల దగ్గరికి వెళ్లడానికే మొగ్గుచూపుతారని ఈ సర్వేలో తేలింది. కారణం, ఆ వైద్యు రాలిలో తమ తల్లినో, పిన్నినో చూసుకుంటారు.