ముఖం అందంగా, కాంతిమంతంగా మెరుస్తూ ఉండటాన్ని ఎవరు మాత్రం కాదనుకుంటారు. అయితే చాలామంది శరీరానికి వాడే సబ్బునే ముఖానికి కూడా ఉపయోగిస్తారు. కానీ మన శరీరంపై ఉండే చర్మం కంటే ముఖంపై ఉండే చర్మం ఎంతో సున్నితమైనది. మృదువుగా ఉండే ముఖాన్ని సబ్బుతో కడగటం అంటే పట్టు వస్త్రాన్ని గట్టి ముళ్లు ఉండే బ్రష్‌తో బరాబరా శుభ్రం చేసినట్లే అవుతుంది. కాబట్టి ముఖంపై ఉండే చర్మం సహజమైన మెరుపును కోల్పోకుండా ఎప్పుడూ తాజాగా, మృదువుగా ఉండాలంటే సబ్బు, ఫేస్వాష్లలో ఏది సరైనదో ఇప్పుడు తెలుసుకుందాం..
సబ్బు రుద్దితే జిడ్డు, మురికిని తొలగించడంతో పాటు సహజమైన తేమను కూడా తీసివేస్తుంది. దీని వల్ల చర్మం పొడిగా, బిగుతుగా మారిపోయి సహజ కాంతిని కోల్పోతుంది. అదే సమయంలో ఫేస్‌వాష్ వాడటం వల్ల చర్మంపై ఉండే నేచురల్ ఆయిల్స్‌ను ఎకువగా తొలగించకుండా చాలా సున్నితంగా శుభ్రపరుస్తుంది. చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది. అనేకరకాల ఫేస్వాష్లలో మొటిమలు, చర్మం పొడిబారడం లాంటి సమస్యలను తగ్గించే పదార్థాలు ఉంటాయి. అయితే ఫేస్‌వాష్‌ని చర్మాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి.
జిడ్డు చర్మం ఉన్నవాళ్లు జెల్ బేస్డ్, పొడి చర్మం ఉన్నవాళ్లు క్రీమ్ బేస్డ్ ఫేస్ వాష్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఫేస్‌వాష్ చర్మంపై ఉండే రక్షణ పొరను దెబ్బతీయకుండా శుభ్రపరుస్తుంది. కాబట్టి సబ్బు కంటే ఫేష్వాష్ ఉత్తమమైనది. అదే సబ్బును ప్రతిరోజూ ముఖానికి వాడటం వల్ల ఈ సమతుల్యత దెబ్బతింటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఫేస్‌వాష్ చర్మానికి సున్నితంగా ఉంటూ అవసరమైన తేమను అందించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి ముఖ సౌందర్యానికి సబ్బు కంటే ఫేస్వాషే బెస్ట్ చాయిస్.