చల్లటి శీతాకాలాలూ, మండే వేసవి సమయాలూ… పూలు విరిసేందుకు వేళలు అక్కర లేదు. ప్రకృతి ఒడిలో వాలే పంచవన్నెల చిలకల్లా ముగ్ధమనోహరంగా కనిపిస్తాయి. ప్రకృతికి ప్రతిబింబమైన విరిబోణిని అలంకరించే దుస్తులూ.. ఇప్పుడు రంగు రంగుల్లో విరబూస్తున్నాయి. త్రీడీ ఫ్లోరల్ డ్రెస్సుల రూపంలో ఆమెను వనకాంతలా తీర్చిదిద్దుతున్నాయి. లేత గులాబీ వన్నె మీద ఎరుపు, పసుపు వర్ణాల్లో కనువిందు చేస్తున్న పువ్వులు, వాటి మధ్యలో ప్రత్యేకంగా కనిపిస్తున్న కుసుమలు త్రీడీ ఫ్లోరల్ దుస్తులను అందంగా తీర్చిదిద్దుతున్నాయీ చిత్రంలో. హాఫ్‌వైట్ కలర్ ఆర్గంజా వస్త్రం మీద ఎంబ్రాయిడరీ చేసి ఉన్న ఈ లెహెంగా సెట్‌ను డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించారు. త్రీడీలా కనిపించేలా పువ్వులన్నీ మరో వస్త్రంతో కుట్టడం దీని ప్రత్యేకత.