వ్యవసాయం.. ఆమె వ్యాపకం
అందరిలాగే ఆమె కూడా. కానీ అందరిలోనూ ఆమె కాస్త ప్రత్యేకం. ముఖ్యంగా సాగు రంగంలో మరికొంత అద్భుతం. కండలు తిరిగిన పురుషులకే కష్టతరంగా ఉండే సాగుక్షేత్రంలో ఆమె వారికి దీటైన కర్షకురాలిగా నిలుస్తోంది. రోజంతా నడుమొంచి, చెమటోడ్చి చేస్తున్న వ్యవసాయం ఆమెకు కష్టం కాదు. ఎందుకంటే అది ఆమె వ్యాపకం. ఐదు పదులు దాటాక కూడా ఇంతలా శ్రమించొద్దంటూ ఆమె పిల్లలు వారించినా వదులుకోలేనంత మక్కువ.
- భర్త కాలం చేసినా కుంగిపోకుండా కొంగు బిగించిన గిరిజన మహిళ
- అవిశ్రాంతంగా శ్రమించి ముగ్గురు పిల్లలకూ వివాహ కార్యాలు
- ఐదు పదులు దాటినా పంటల సాగులోనే విరామంలేని జీవనం
- అర ఎకరం పొలంలో పది రకాల పంటల సేద్యంతో ఆదర్శం
- పంట పొలాల్లోనూ ‘ఆమే..’, పొరుగూరి సంతల్లోనూ ‘ఆమే..’
- కూలీలకు ఉపాధినిస్తూ, కస్టమర్లకు క్వాలిటీనిస్తూ పయనం..
- విశ్వసనీయ వ్యాపారంతో వినియోగదారులూ ‘ఆమె’ వద్దకే..
- కష్టతరమైన ‘క్షేత్రం’లో పురుషులకు దీటైన కర్షకురాలు.. ఈ ‘కోటమ్మ’
అందరిలాగే ఆమె కూడా. కానీ అందరిలోనూ ఆమె కాస్త ప్రత్యేకం. ముఖ్యంగా సాగు రంగంలో మరికొంత అద్భుతం. కండలు తిరిగిన పురుషులకే కష్టతరంగా ఉండే సాగుక్షేత్రంలో ఆమె వారికి దీటైన కర్షకురాలిగా నిలుస్తోంది. రోజంతా నడుమొంచి, చెమటోడ్చి చేస్తున్న వ్యవసాయం ఆమెకు కష్టం కాదు. ఎందుకంటే అది ఆమె వ్యాపకం. ఐదు పదులు దాటాక కూడా ఇంతలా శ్రమించొద్దంటూ ఆమె పిల్లలు వారించినా వదులుకోలేనంత మక్కువ. అందుకే ఆమె ఈ వయసులోనూ పంటల సాగులో విరామంలేని జీవనాన్ని కొనసాగిస్తోంది. విధి వక్రీకరించి భర్తను తీసుకెళ్లినా ఆమె కుంగిపోలేదు. కొంగు బిగించి కార్యక్షేత్రంలోకి దిగింది. భర్త ధైర్యాన్ని కూడదీసుకొని అవిశ్రాంతంగా శ్రమించింది. ముగ్గురు పిల్లలనూ ప్రయోజకులను చేసింది. వారికి వివాహ కార్యాలు జరిపించింది. అంతటితో ఆమె తన కుటుంబ కావడి మోసేందుకే పరిమితం కాలేదు. అరకపట్టి అందరికీ ఆదర్శప్రాయంగానూ నిలుస్తోంది. అర ఎకరా పొలంలో పది రకాల పంటలు వేస్తూ పదుగురికి స్ఫూర్తినిస్తోంది. కండలు తిరిగిని వాళ్లే కాడి ఎత్తేసే కార్యక్షేత్రంలో కూలీలకు ఉపాధినిస్తూ, కస్టమర్లకు క్వాలిటీనిస్తూ జీవనయానం సాగిస్తోంది. విశ్వసనీయ వ్యాపారానికి మారుపేరుగా నిలవడంతో వినియోగదారులు కూడా ఆమె వద్దకు క్యూ కడుతుంటారు. ఆమె పండించిన పంటలను.. పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేసేవారు కొందరైతే.. పొరుగు సంతల్లోనూ ఆమె వద్దనే కూరగాయలు కొనేవాళ్లు మరికొందరు. సంతలో సాయంత్రం దాకా సరుకులు అమ్మడం ఆమె సహజత్వం కాదు.. పగటి వేళలోపే పంటనంతా అమ్మేసి పట్టాలు మడతపెట్టుకొని తిరుగు పయనమై వెళ్లడం ఆమె ప్రత్యేకం. ఆమె ఎవరో కాదు.. కార్య‘క్షేత్రం’లో కష్టాలకు ఎదురీదిన కోటమ్మ.
-కూసుమంచి, మార్చి 24
భర్త కాలం చేసినా కుంగిపోకుండా..
కూరగాయల సాగుకు ప్రసిద్ధి చెందిన కూసుమంచి మండలం ధర్మతండా గ్రామం.. ఈ గిరిజన మహిళ అయిన జర్పుల కోటమ్మ స్వస్థలం. ఆరేళ్ల క్రితం ఆమె భర్త కాలం చేశాడు. కానీ అప్పటికే వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. భర్త అకాల మరణం ఆమె నెత్తిన పెద్ద బరువునే పెట్టింది. కానీ ఆ బరువుకు ఆమె కుంగిపోలేదు. కన్న పిల్లలను చూసి కాస్త ధైర్యం తెచ్చుకొని లేచి కొంగుబిగించింది. కాడి పట్టి క్షేత్రంలోకి దిగింది. అప్పటికే ఆమెకు వ్యవసాయమంటే ఎంతో మక్కువ. దీంతో అది కఠినమైన పని అయినా ఆమెకు కష్టమనిపించలేదు. ఏళ్లు తిరగకుండానే పిల్లలను ప్రయోజకులను చేసింది. కుమారుడు ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. కుమార్తెలను కలిగిన కుటుంబాలకే ఇచ్చి కల్యాణం జరిపించింది. కానీ తాను మాత్రం విశ్రాంతి కోరుకోలేదు. వ్యవసాయాన్ని తన వ్యాపకంగా భావించింది. అందులోనే జీవిస్తోంది.
వ్యవసాయం.. వైవిధ్యం..
వ్యవసాయమంటే ఎంతో మక్కువైన కోటమ్మ.. దానిని ఎంతో వైవిద్యంగా చేస్తోంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ పొలంలో శ్రమిస్తుంది. అర ఎకరా పొలంలో పది రకాల పంటలు సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది. కూరగాయలు, ఆకు కూరలు, బంతి పూల వంటివి సాగుచేస్తోంది. ఇంట్లో తిండి గింజలకు కాస్త వరి పంటనూ పండిస్తోంది. అయితే విచ్చలవిడి రసాయనాల వినియోగాన్ని ఆమె పెద్దగా ప్రోత్సహించదు. సేంద్రియానికి ప్రథమ ప్రాధాన్యమిస్తోంది. తాను పండించిన పంటలను సోమ, బుధ, శుక్రవారాల్లో కూసుమంచి, నాయకన్‌గూడెం, పాలేరు సంతల్లో పూర్తిగా విక్రయించేస్తుంది. ఇన్నేళ్లుగా ఉన్న పరిచయాలు, అందిస్తున్న నాణ్యతా ప్రమాణాల కారణంగా చాలామంది వినియోగదారులు ఆయా సంతాల్లో ఆమె వద్దనే కూరగా యాలు కొనుగోలు చేస్తారు. నిండుగా కూరగాయాలు, ఆకుకూరలతో సంతకు వచ్చే ఆమె.. ఆ తరువాత మూడు నాలుగు గంటల్లోనే వాటన్నింటినీ విక్రయించేసి ఇంటికి పయనమై వెళ్తుంది. సమీప గ్రామాల్లో ఉండే వినియోగదారులు నేరుగా ఆమె పొలం వద్దకే వెళ్లి కూరగాయలను కొనితెచ్చుకుంటారు. ఇక ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల కోసం పెద్ద సంఖ్యలోనే ఆమె పొలం దగ్గరకు వెళ్తారు. ఆమె దగ్గర అందుబాటులో లేకపోతేనే మరో పొలం దగ్గరకు వెళ్తారు.
కూరగాయలు, ఆకు కూరలే అధికం..
అర ఎకరంలో పూర్తిగా ఆకు కూరలు, కూరగాయలే పండిస్తుంది. వాటిల్లో ప్రధానంగా పాలకూర, తోటకూర, బచ్చలికూర, పుదీనా, కొత్తిమీర, మెంతికూర ఉంటాయి. ఇక కూరగాయల్లో అయితే చిక్కుడు, టమాటా, బెండ, వంకాయలు, గోరుచిక్కుడు ఉంటాయి. వీటితోపాటు సీజన్లను బట్టి క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంతిపూలు వంటివి కూడా పండిస్తుంది. కూరగాయలను రెండు రోజులకు ఒకసారి కోసుకొని వెళ్లి వారపు సంతల్లో విక్రయిస్తుంటుంది. నమ్మకం, విశ్వాసం పొందిన వినియోగదారులు నేరుగా ఈమె వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఎండ, వాన, చలి వంటివి ఎన్ని కాలాలు వచ్చిపోతున్నా ఆమె కాలు మాత్రం తన ‘క్షేత్రంలోనే ఉంటుంది. ఎప్పుడూ ఒంటరిగా పనిచేస్తూనే కన్పిస్తుంది.
పని అధికంగా ఉన్న రోజు కూలీలను పెట్టుకుంటా..
పనిచేసుకుంటూ బతకడమే నాకు సంతోషం. 10 రకాల కూరగాయలను సాగు చేస్తా. పని ఎక్కువగా ఉన్న రోజు మరికొందరు కూలీలను పెట్టుకుంటా. పొలంలో నేనే పాటు చేస్తా. విత్తనాలు పెడతా. క్రిమిసంహారక మందు చల్లుతా. నీళ్లు కడతా. రోజువారీ ఆకు కూరలు, కూరగాయలను కూడా నేనే కోస్తా. ఇంతలా కష్టపడొద్దని పిల్లలు చెబుతుంటారు. కానీ మొదటి నుంచీ నమ్ముకున్న వ్యవసాయం కదా.. ఇందులో ఉంటేనే సంతోషంగా అనిపిస్తుంది. కొందరు రిటైల్ కూరగాయల వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి నా పొలంలో కూరగాయలను కొనుక్కొని వెళ్తుంటారు. నేను కూడా నాలుగు సంతల్లో కూరగాయలు, ఆకు కూరలు విక్రయిస్తుంటా. పొద్దంత కష్టపడినా పెద్దగా శ్రమించినట్లు అనిపించదు.
-కోటమ్మ, మహిళా రైతు, ధర్మతండా, కూసుమంచి
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

