Himmatnagar | వీణవంక, జూన్ 21 : వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామంలో ఆదివారం వానలు కురవాలని కోరుతూ సర్పంచ్ జడల శ్రీకాంత్‌తో పాటు పాలకవర్గ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దలు అందరూ కలిసి కప్పతల్లి ఆట ఆడి, ప్రత్యేక పూజలు చేశారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు బిందెలతో నీళ్లు ఎత్తుకొని గ్రామంలోని బొడ్రాయి, హనుమాన్, పోచమ్మతల్లి దేవాలయాల్లో విగ్రహాలకు నీళ్లు పోసి, ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ సాగుకాలం దాటిపోతున్నా వర్షాలు కురవకపోవడంతో వరుణ దేవుడు కరుణించాలని కోరుతూ గ్రామంలో కప్పతల్లి ఆడి, గ్రామంలోని దేవతలందరికీ ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మ్యాక శ్రీనివాస్, హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ నల్ల తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు గెల్లు రమేష్, కర్ణకంటి భాస్కర్‌రెడ్డి, నల్ల కొండాల్‌రెడ్డి, రఘువరన్, గ్రామస్తులు పాల్గొన్నారు.