చేతగాక నిందలా..?
కరెంట్ ఎప్పడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు.. చిన్న అంతరాయం కలిగినా కోతలు.. లో ఓల్టేజీతో కాలిపోయే మోటర్లు.. లోడ్ పడి చెడిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. బావుల్లో నీరున్నా అందక ఎండే పంటలు.. రాత్రీ పగలు తేడా లేకుండా బావుల వద్దనే పడిగాపులు..
- వెలుగుల నుంచి చీకట్లలోకి!
- ఉమ్మడి రాష్ట్రంలో అల్లాడిన రైతులు
- నాలుగైదు గంటలతో పడిగాపులు
- అది రాత్రి వేళ సరఫరాతో ప్రమాదాలు
- స్వరాష్ట్రంలో నిరంతరాయంగా సరఫరా
- కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ ఇక్కట్లు
- తప్పించుకునేందుకు గోస తీర్చిన కేసీఆర్‌పైనే అభాండాలు
- మండిపడుతున్న ఉమ్మడి జిల్లా రైతులు
- తీరు మార్చుకోవాలని హితవు
కరెంట్ ఎప్పడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు.. చిన్న అంతరాయం కలిగినా కోతలు.. లో ఓల్టేజీతో కాలిపోయే మోటర్లు.. లోడ్ పడి చెడిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. బావుల్లో నీరున్నా అందక ఎండే పంటలు.. రాత్రీ పగలు తేడా లేకుండా బావుల వద్దనే పడిగాపులు.. అర్ధరాత్రి సరఫరాతో ప్రాణాలకు గ్యారెంటీ లేని రోజులు.. ఇప్పుడు మళ్లీ గుర్తొస్తున్నాయా..? అని రైతులోకాన్ని అడిగితే.. అవునని సమాధానం ఇవ్వడమే కాదు, కాంగ్రెస్ సర్కారుపై భగ్గుమంటున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన సంస్కరణలతో రాష్ట్రం వెలుగులమయం అయితే.. మళ్లీ చీకట్లలోకి నెడుతున్నదని మండిపడుతున్నది. పైగా నిరంతర కరెంట్‌తో ఉమ్మడి రాష్ట్రంలోని విద్యుత్ కష్టాలను దూరం చేసి, ఎవుసాన్ని పండుగలా మార్చిన కేసీఆర్‌పై అభాండాలు వేయడంపై ఆగ్రహిస్తున్నది. రైతులు, ప్రజలపై ప్రేమ ఉంటే అంతకంటే ఎక్కువగా పని చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని సూచిస్తున్నది. కానీ, నిందలు వేయడం సరికాదని హితవుపలుకుతున్నది.
కరీంనగర్, జూన్ 19 (నమస్తే తెలంగాణ)/ మంథని: ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కష్టాలు మామూలువి కావు. నాలుగైదు గంటల కరెంట్ కోసం ముప్పుతిప్పలు పడేది. 2004కు ముందు టీడీపీ అధికారంలో ఉన్నపుడు వచ్చీరాని కరెంట్‌తో నరకం కనిపించేది. పైగా బిల్లులు చెల్లించకుంటే స్టార్టర్లు, మీటర్లు తీసుకెళ్లిన సందర్భాలు కోకొల్లాలుగా ఉండేవి. 2004 తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రోజుకు ఏడు గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పినా.. పూర్తి స్థాయిలో అమలు కాలేదు. పగలు మూడు గంటలు, రాత్రి నాలుగు గంటల చొప్పున సరఫరా చేస్తామని చెప్పినా.. అప్పటి ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు.
ఫలితంగా బావుల్లో నీరున్నా కరెంట్ లేక పంటలకు నీరందించలేని పరిస్థితి ఉండేది. ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని కరెంట్ కోసం రాత్రి, పగలు తేడా లేకుండా బావుల వద్దనే పడిగాపులు గాసేది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ లేక గ్రిడ్‌లో సమస్యలు ఉత్పన్నమై జిల్లాలకు జిల్లాలే చీకట్లో కొట్టు మిట్టాడేవి. పైగా రాత్రి వేళ సరఫరాతో అనేక మంది రైతులు షాక్‌లకు గురై, పాము కాట్లకు బలైనా పట్టించుకునే దిక్కుండేది కాదు. కరెంట్ కోసం ధర్నాలు చేసినా, తెగించి విద్యుత్ ఉప కేంద్రాలపై దాడులు చేసినా అప్పటి ప్రభుత్వం కాసింతైన కనికరించకపోగా.. రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కరెంట్ సమస్య కూడా కీలకంగా మారింది. రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఉద్యమాల్లో పాల్గొనేలా చేసింది.
స్వరాష్ట్రంలో అసాధ్యం సుసాధ్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు ఆంధ్రా పాలకులు అనేక శాపనార్ధాలు పెట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం పూర్తిగా చీకటిమయం అవుతుందని, కరెంట్ లేకుండా పోతుందని బహిరంగానే మాట్లాడారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కరెంట్ కోసం రైతులు పడుతున్న ఇక్కట్లను ఉద్యమ సమయంలో చూసిన అనుభవంతో మొదటి సంస్కరణలు ఈ రంగంలోనే తెచ్చారు. అప్పటి వరకు రాత్రి, పగలు రెండు పూటల్లో ఇచ్చిన ఏడు గంటల కరెంట్‌ను నిరంతరాయం చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అంటే 2014 డిసెంబర్ నుంచి మరో రెండు గంటలు పెంచి తొమ్మిది గంటల కరెంట్‌ను పొద్దంతా నిరంతరాయంగా ఇచ్చారు.
క్రమంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తూ 2018 జనవరి 1 నుంచి వ్యవసాయానికి నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేశారు. అందుకోసం 2016-18 మధ్య కాలంలో కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, లైన్ల బలోపేతం కోసం ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 200 కోట్లు ఖర్చు చేశారు. ఆంధ్రా పాలకుల చెంప చెల్లుమనేలా రాష్ర్టాన్ని వెలుగుల మయం చేశారు. ఫలితంగా అన్ని రంగాల మాదిరిగానే వ్యవసాయంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. రైతుల కష్టాలను దూరం చేశాయి. అవసరం ఉన్నపుడు విద్యుత్‌ను వినియోగించుకోవడం మొదలు కాగా, లో ఓల్టేజీ, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, మోటార్లు కాలిపోవడం వంటి సమస్యలు పూర్తిగా మాయమైపోయాయి. పుష్కలంగా నీళ్లు, నిరంతరాయంగా కరెంట్ సరఫరాతో బంగారం లాంటి పంటలు పండాయి.
మళ్లీ ఇక్కట్లు మొదలు
దాదాపు పదేళ్లపాటు కరెంట్ కష్టాలు దూరం కాగా.. మళ్లీ తిప్పలు మొదలయ్యాయి. కోతలు, లో ఓల్టేజీ సమస్యలు ప్రారంభమయ్యాయి. పోయిన యాసంగిలో దయనీయ పరిస్థితులు కనిపించాయి. బావుల్లో నీరున్నా పారించేందుకు విద్యుత్ లేక పంటలు ఎండిపోయాయి. ఇప్పుడు వానకాలం సీజన్ మొదట్లోనే అక్కడక్కడా నారుమడులు కూడా అలానే ఎండిపోతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుండగా.. మూడు రోజుల క్రితం కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ శివారులో గాలివానకు విద్యుత్ స్తంభం ఒరిగి కేబుల్ వైర్ మీద పడడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో నీరందక నారుమడి ఎండిపోతుండగా.. కౌలు రైతు మంద అశోక్ 2 వేలు వెచ్చించి వాటర్ ట్యాంకర్ తెప్పించి కాపాడుకున్నాడు. అంతకు ముందు మానకొండూర్ మండలంలోనూ ఇలాంటి దుస్థితే కనిపించింది. దాదాపు అంతటా ఈ సమస్య ఉన్నట్టు తెలుస్తున్నది.
కరెంట్ ఇచ్చుడే పాపమైందా..?
పదేండ్ల కింద కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం అరిగోసపడ్డం. ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఖర్చయినా సరే విద్యుత్ కొని కోతలు లేకుండా చేసిండు. నాన్న రెండెకరాలళ్ల రంది లేకుంట వ్యవసాయం చేసుకున్న. పంటలు మంచిగా పండినయి. పదేండ్ల నుంచి ఏ బాధా లేకుంట ఉన్నం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మళ్లీ పాత రోజులు తీసుకువస్తంది. ఆరు నెలల పాలనలోనే చుక్కలు చూపిస్తంది. మొన్న యాసంగిల కరెంట్ సక్కగ లేక చాలా మంది పొలాలు ఎండినయ్. పదేండ్లపాటు రెప్పపాటు కోతలు లేకుండా చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కరెంట్ కొనుగోళ్లమీద నిలదీసుడు కరెక్ట్ కాదు. ఆయనతోనే మా రైతులు బాగుపడ్డరు.
– అమరగొండ స్వామి, చామనపల్లి (కరీంనగర్‌రూరల్)
బద్నాం చేయడం కరెక్ట్కాదు
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సార్ ఏం చేసిండో.. ఎట్ల తెచ్చిండో తెల్వది కని, పదేండ్లళ్ల బాయిలకాడ ఇబ్బందుల్లేకుండా చేసిండు. ఇప్పుడు వచ్చిరానట్టు కరెంటు వస్తంది. రోజుకొకల మోటర్ కాల్తంది. కరెంటు ఉన్నా నా మోటర్ ఇయ్యాల పోయలేదు. కరెంటుల దమ్ములేదు. గిన్ని ఇబ్బందులు ఎప్పుడూ పల్లేదు. నేను వ్యవసాయం చేయవట్టి పదేైండ్లెతంది. కరెంటు ఇబ్బందులు ఇప్పుడే తెల్తున్నయ్. ఇప్పుడు నార్లు పోసుకుని, దుక్కులు దున్నే టైంలనే గిట్ల ఉంటే, నాట్లు పడ్డంక పరిస్థితేందో అర్థమైతలేదు. మునుపు ఎప్పుడంటే అప్పుడు బాయికాడికిపోయి ఆన్ చేస్తే మల్ల మొత్తం పారినంక బంజేసేది. ఇప్పుడా పరిస్థితి కనిపిస్తలేదు. పదేండ్లపాటు కోతల బాధలు లేకుంట చేసిన కేసీఆర్‌ను కరెంట్ కొనుగోళ్లమీద బద్నాం చేసుడు కరెక్ట్ కాదు.
– వేల్పుల దేవేందర్, రైతు, రంగపేట, మానకొండూర్(తిమ్మాపూర్)
చేతనైతే నిరంతరం ఇవ్వాలి
2014కు ముందు విద్యుత్ ఎప్పుడు వస్తుందో..? ఎంత సేపు ఉంటుందో..? ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గృహ, వ్యవసాయ, పరిశ్రమల రంగానికి సంబంధించి కోతలు లేకుండా నిరంతరం సరఫరా చేసిండు. తెలంగాణ వస్తే కరెంట్ సమస్య వస్తుందన్న వారి నోళ్లు మూత పడేలా చేసిండు. అలాంటి కేసీఆర్‌ను ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకులు విద్యుత్ ఒప్పందాలపై నిలదీసుడు కాదు, చేతనైతే 24గంటల కరెంట్ ఇచ్చి చూపించాలి. ఇదే నా అభిప్రాయం. కేసీఆర్ విద్యుత్ సమస్యల పరిషారానికి వేసిన బాటను స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుత పాలకులు వర్తమానం, భవిష్యత్ కాలంలో గృహ, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు కోతలు లేకుండా చూడాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది. – పలిగిరి చందర్, విద్యుత్ మోటర్ల మెకానిక్ (కమాన్‌పూర్)
కేసీఆర్‌ను బద్నాం చేసే కుట్ర
తెలంగాణ రాకముందు కరెంట్ కోతలు చెప్పరాదు. ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. రాష్ట్రం వచ్చినా విద్యుత్ సమస్యలు అలాగే ఉంటయని చాలా మంది అన్నరు. కానీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నరు. 24 గంటల కరెంట్ ఇచ్చి ఇటు వ్యవసాయ రంగాన్ని, అటు పరిశ్రమలను అభివృద్ధిలో నడిపించారు. గృహావసరాలకు కోతలు లేకుండా చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి మోసం చేసింది. మొన్న ఎండాకాలంలో సాగుకు సరిగ్గా కరెంట్ ఇయ్యక పంటలు ఎండబెట్టింది. ఆనాడు ప్రజలకు ఇబ్బందులు రావద్దనే కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకుంది. అప్పుడున్న పరిస్థితుల ప్రకారమే విద్యుత్ రేట్లను చెల్లించారు తప్పా ఇందులో ఎలాంటి కుంభకోణం లేదు. కేవలం ప్రజలకు మంచి చేసిన కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం మాత్రమే ఇది. – ఎగోలపు కమల, గృహిణీ (మంథని)
పదేండ్లళ్ల కోతలే లేవు..
మాది ముత్తారం మండలం మైదంబండ. ఊళ్లే నాకు ఐదెకరాల భూమి ఉంది. పదేండ్ల కింద కాంగ్రెస్ హయాంలో రాత్రి మూడు గంటలు.. పగలు నాలుగు గంటలు కరెంటు వచ్చేది. తరచూ ట్రిప్ అయ్యేది. పంటలు ఎండి పోతున్నయని కరెంట్ ఇవ్వాలని వేడుకున్నా ఇచ్చెటోళ్లు కాదు. కరెంట్ కోసం రాత్రిపూట మోటార్ల దగ్గర జాగారం చేసేటోళ్లం. ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మా సమస్యలు మొత్తం దూరమైనయ్. 24 గంటల పాటు కరెంట్ ఇవ్వడంతో రాత్రిపూట పొలాలకు పోయే బాధ తప్పింది. పంటలు బాగా పండి మా బతుకులు మారినయి. పదేండ్లపాటు కోతలు లేకుండా వెలుగులు నింపిన కేసీఆర్‌ను ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలపై నిలదీయడం కరెక్టు కాదు. కేసీఆర్ నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆచరణలో పెట్టి, కోతలు లేకుండా చూడాలి.
-బియ్యాని రాజు, మైదంబండ (ముత్తారం)
నిందలు సరికాదు : రైతులు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే చీకటి మయమవుతుందని చెప్పిన ఆంధ్రా నాయకులు, విద్యుత్ రంగంలో కేసీఆర్ తెచ్చిన సంస్కరణలు చూసి అబ్బురపడుతున్నరు. అయితే ఇది ఓర్వలేక ఇప్పుడు నిందలు వేయడం సరైనది కాదని రైతులు అభిప్రాయపడుతున్నరు. విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కారు కమిషన్ వేయడం, విచారణ జరగకముందే నిందలు వేస్తూ విష ప్రచారం చేయడాన్ని ఉమ్మడి జిల్లా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నరు. అనేక వర్గాల్లో వెలుగులు నింపిన నాయకుడిపై అభాండాలు మోపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. ఒకప్పుడు కరెంట్ లేక అల్లాడిన తమకునిరంతరం ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ సార్కే దక్కుతుందని స్పష్టం చేస్తున్నరు. ఉమ్మడి రాష్ట్రంలో కష్టాలను దూరం చేసుకొని రంది లేకుండా ఎవుసం చేసుకుంటున్నామని, మళ్లీ చీకట్లలోకి నెట్టొద్దని వేడుకుంటున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

