KTR Tea Stall | సిరిసిల్ల టౌన్, మార్చి 23 : ‘సిరిసిల్ల ఎమ్మెల్యే రామన్నే.. నాకు దేవుడు.. ఓ కలెక్టర్ నాకు ఉపాధి లేకుండా చేస్తే విషయం తెలిసిన రామన్న టీ స్టాల్ ఏర్పాటు చేయించి నా కుటుంబానికి ఆసరయ్యిండు’ అని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశాడు. ఏడాది క్రితం అప్పటి కలెక్టర్ టీ స్టాల్ పై కేటీఆర్ ఫొటో ఉన్నదన్న అక్కసుతో మున్సిపల్ అధికారులతో స్టాల్ ను తొలగించాడు.
దీంతో శ్రీనివాస్ కుటుంబం ఉపాధిని కోల్పోయి రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత ఖర్చులతో స్థానిక గాంధీ చౌరస్తాలో టీ స్టాల్ ఏర్పాటు చేయించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. టీ స్టాల్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం బీఆర్ఎస్ నాయకులు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, మున్సిపల్ విప్ బుర్ర మల్లికార్జున్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, నాయకులు బొల్లి రామ్మోహన్, ధీడ్డి శ్రీనివాస్, గుండ్లపల్లి పూర్ణ చందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, రికుమల్లె సంపత్, లింగంపల్లి సత్యనారాయణ, సత్తార్ తదితర నాయకులు ఉన్నారు.