Yellampalli project | ధర్మారం, సెప్టెంబర్ 27 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంపు హౌస్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు కు గోదావరి జలాల ఎత్తిపోతల కొనసాగుతున్నాయి. ఈనెల 4 నుంచి 12వరదాక మోటార్ల నడిపి మూడు రోజుల విరామం ఇచ్చి ఆ తర్వాత 15 నుంచి 24 వరదాక కేవలం రెండు మోటార్ల ద్వారానే 6,300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేశారు. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వానల వల్ల వచ్చే వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి చేరి జలాలు వృధా కాకుండా చూసి వాటిని ఎత్తిపోసి ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయడం, రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాయడంతో ప్రభుత్వం స్పందించి మోటార్ల సంఖ్యను పెంచింది.
ఈ నెల 25న 2 నుంచి 4 మోటార్ల సంఖ్యను పెంచి రూ.12,600 క్యూసెక్కులు, 26న 5 మోటార్లను నడిపించి 15,750 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. తాజాగా ఆదివారం నంది పంప్ హౌస్ లో ఒక మోటారును నిలిపివేసి 1,3,6,7 నంబర్ల మోటార్లు అనగా 4 మోటార్ల ద్వారా పంపింగ్ చేపట్టారు.12,600 క్యూసెక్కుల చొప్పున జలాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ కాలువలో ప్రవహించి జంట సొరంగాల ద్వారా నంది మేడారం నంది పంప్ హౌస్ లోని సర్జీఫూల్ కు చేరుకుంటుంది. అక్కడ 4 మోటార్లను ఆన్ చేయడంతో 12,600 క్యూసెక్కుల నీరు డెలివరీ సిస్టర్ ను ద్వారా నంది రిజర్వాయర్ లోకి చేరుకుంటుంది. అనంతరం రిజర్వాయర్ క్రష్ గేట్ల ద్వారా అదే పరిమాణంలో జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ కు చేరుకుంటుంది. ఆ పంపు హౌస్ లో 4 బాహుబలి మోటార్లను ఆన్ చేయడంతో జలాలు వరద కాలువ ద్వారా మిడ్ మానేరు కు చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి నీరు వివిధ ప్రాజెక్టులకు చేరుకుంటోంది.