రైతన్న కన్నీటి గోస
సాగునీటి కోసం తండ్లాట మొదలైంది. మొన్నటిదాకా పసిడిపంటలతో కళకళలాడిన కరీంనగర్ రూరల్ మండలం ఇప్పుడు కరువుఛాయలతో దర్శనమిస్తున్నది. ప్రధానంగా మొగ్దుంపూర్లో పరిస్థితి దారుణంగా ఉన్నది.
- కరీంనగర్ రూరల్ మండలంలో ఎండుతున్న వరి
- ఎస్సారెస్పీ కాలువలు ఉన్నా చుక్కనీరు రాక అవస్థలు
- పంటలను కాపాడుకునేందుకు కర్షకుల అరిగోస
- ఆఖరి ప్రయత్నంగా ట్యాంకర్లతో నీటి సరఫరా
- ట్రిప్పునకు రూ.వెయ్యి చెల్లించి మరీ తడులు
సాగునీటి కోసం తండ్లాట మొదలైంది. మొన్నటిదాకా పసిడిపంటలతో కళకళలాడిన కరీంనగర్ రూరల్ మండలం ఇప్పుడు కరువుఛాయలతో దర్శనమిస్తున్నది. ప్రధానంగా మొగ్దుంపూర్లో పరిస్థితి దారుణంగా ఉన్నది. ఈ గ్రామ పరిధిలో ఎస్సారెస్పీ కాలువలపై ఆధారపడి పంటలు సాగు చేసినా.. ఇప్పుడు చుక్కనీరు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికందే దశలో ఉన్న పంటలు ఎండుతుండగా, కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. చివరి ప్రయత్నంగా ట్యాంకర్లతో నీటిని పడుతున్నారు. ట్రిప్పునకు రూ. వెయ్యి చెల్లించి మరీ తడులు అందిస్తున్నారు. అయినా ప్రభుత్వం గానీ, అధికారులు గానీ స్పందించకపోవడంపై మండిపడుతున్నారు.
కరీంనగర్ రూరల్, మార్చి 29: కరీంనగర్ రూరల్ మండలంలో సాగుకు ఎస్సారెస్పీ డీ86, డీ94 కెనాళ్లే ఆధారం. దాదాపు 3వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. ఈ ఒక్క మండలమే కాదు చొప్పదండి, గంగాధర మండలాలకు ఈ కెనాళ్ల ద్వారానే నీరందుతుంది. కొన్నేళ్లుగా ఎస్సారెస్పీ నుంచి వారబందీ పద్ధతిన ఇచ్చే నీటితో ఎవుసం చేసుకున్నరు. పుట్లకొద్దీ ధాన్యం పండించారు. ఎప్పటిలాగే ఈ యాసంగిలోనూ నీళ్లస్తాయనే ఆశతో దండిగా పంటలు వేశారు. అయితే ప్రస్తుతం సాగునీరందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికందే దశలో ఉన్న పంటలు కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
డీ86, డీ94 కెనాళ్ల కింద మొగ్దుంపూర్లో 400 ఎకరాల్లో పంటలు వేయగా.. చుక్కనీరు రాక ఇప్పటికే 150 ఎకరాలు ఎండిపోయాయని ఆవేదన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీలు తెప్పించి కొత్తగా బావులు తవ్వుకున్నా, ఉన్న బావుల్లో క్రేన్ల సాయంతో పూడిక తీసినా ప్రయోజనం లేక నిరాశ చెందుతున్నారు. కొందరు ఇప్పటికే పంటలు వదిలేయగా, 15 మంది రైతులు మాత్రం వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించుకుంటున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.వెయ్యి చొప్పున వెచ్చించి పదిహేను రోజులుగా తడులు అందిస్తున్నారు. ఒక్కో రైతు రోజుకు నాలుగు ట్రిప్పులు వాటర్ ట్యాంకర్లతో నీరు పోయిస్తున్నారు. అయినా పంటలు దక్కుతాయో..? లేదోనని భయపడుతున్నారు.
నీళ్లు కొనే రోజస్తదని అనుకోలె
నాకు మొగ్దుంపూర్లో మూడెకరాల భూమి ఉన్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీళ్లతోనే ఎన్నోఏండ్ల సంది ఎవుసం చేస్తున్న. ఏనాడూ మాకు ఇబ్బంది కాలె. కానీ, ఈ యాసంగిల నరకం కనిపిస్తంది. అధికారులు నీళ్లు ఇస్తామని చెబితేనే ఎకరన్నర వరి పెట్టిన. కానీ ఏం లాభం? ఎస్సారెస్పీ నీళ్లు రాలే? ఇప్పటికే 20 గుంటల పొలం ఎండింది. బావిల కూడా నీళ్లు ఎల్లుతలేవు. చేతికి వచ్చిన పంటను చంపుకోబుద్ధి కాలె. ఉన్న ఎకరం పంటనైనా కాపాడుకోవాలని రోజుకు నాలుగు వాటర్ ట్యాంకర్లతో నీటిని పారించుకుంటున్న. ఒక్కో ట్రిప్పునకు రూ. వెయ్యి అయితంది. నీళ్లు కొనుక్కొని పంటలు పండిస్తనని ఎన్నడూ అనుకోలె.
– పూరెళ్ల అంజయ్య, రైతు (మొగ్దుంపూర్)
ఎకరానికి 40వేల పరిహారమియ్యాలె
శ్రీరాంసాగర్ కాలువ నీరు ఇస్తమంటేనే నేను మూడెకరాలు కౌలుకు తీసుకొని పంట వేసిన. కౌలుకు ఎకరానికి 15వేలు అయినయి. ఇంకా సాగుకు 20వేల దాకా పెట్టిన. కానీ ఏం పాయిదా..? బావిలో నీరులేదు. కాలువ నీరు వస్తలేదు. పంట ఆగమైంది. వారబందీల ఇచ్చే చివరి తడులతోనైనా పంట బతుకుతది అనుకుంటే చుక్కనీరు వస్తలేదు. వాటర్ ట్యాంకర్లతో నీటిని పారిస్తున్న. ఇసోంటి దినాన్ని చంద్రబాబు కాలంలో చూసినమంటే మళ్లీ ఇప్పుడే చూస్తున్న. మిగిలిన తడులైనా అందేటట్లు చూడాలె. లేదంటే ఎకరానికి 40వేల పరిహారం ఇయ్యాలె.
– బండారి రాములు, రైతు (మొగ్దుంపూర్)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
Rizwan Basha Shaik | సీఎంఆర్ బియ్యం అప్పగించాల్సిందే.. మిల్లర్లకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరిక
సుందరయ్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

