Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 4 : ఆహార అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం వ్యాయామం చేసేందుకు ప్రస్తుతం ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిలో భాగంగా దగ్గరలోని ఓపెన్ జిమ్ లను ఆశ్రయిస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఓపెన్ జిమ్ ల పరిస్థితి చూస్తుంటే ఆరోగ్యం దేవుడెరుగు… తట్టుకొని పడితే మాత్రం తప్పదు ఆస్పత్రికి పరుగు అన్నట్టుగా దర్శనమిస్తున్నాయి. నిర్వహణను పట్టించుకోక అధ్వాన్నంగా మారుతున్నాయి. ఎక్కడి దాకో ఎందుకు.. రామగుండం నగర పాలక కార్యాలయం ఆవరణలోని ఓపెన్ జిమ్ ఒక్కటే అందుకు దృష్టాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి ఓపెన్ జిమ్ లో కింద పరిచిన రబ్బర్ టైల్స్ ఎక్కడిక్కడ చిందరవందరగా లేచి ఉండటం, పరికరాలు తుప్పు పట్టి వ్యాయామానికి ప్రతికూలంగా ఉన్నా పట్టించుకునే దిక్కు లేదు.
ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో నగరంలోని పలు చోట్ల బహిరంగ వ్యాయామ శాలలు (ఓపెన్ జిమ్)లను ఏర్పాటు చేసింది. ఆ జిమ్ ల నిర్వహణ బాధ్యతలను మున్సిపల్ అధికారులకు అప్పగించింది. కానీ, కొంత కాలంగా మున్సిపల్ అధికారులు వాటి నిర్వహణను అంతగా పట్టించుకోవడం లేదు. దీనితో కొన్ని చోట్ల పరికరాలు పనికి రాకుండా పోతుండగా, కింద పరిచిన రబ్బర్ టైల్స్ లేచి ఉండటంతో వ్యాయామం చేయలేని పరిస్థితి ఉంది. వ్యాయామంకు వచ్చే వృద్ధులు తొందరపాటులో తట్టుకొని కింద పడుతున్నారు. అధికారులు బాగు చేయించకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో నిర్వహణ మూన్నాళ్ల ముచ్చటగా మారిందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఓపెన్ జిమ్ ల ను బాగు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.