Kalva Srirampur | కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్ 1 : గ్రామాల్లో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తి కావడానికి రైతులందరు సహకరించాలని తహసీల్దార్ రావె రాముడు కోరారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మంగపేట లో భూముల రీ సర్వే కోసం గురువారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు. ప్రతీ భూ ఖండానికి ప్రత్యేకమైన భూఆధార్ కేటాయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూముల రీ సర్వేకు శ్రీకారం చుట్టింద అన్నారు. భూ రీసర్వే కోసం కాల్వశ్రీరాంపూర్ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా కూనారం, మంగపేట, వెన్నంపల్లి, కిష్టంపేట, మొట్లపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్లు చెప్పారు.
మంగపేట లో జూలై14న తొలిసారి గ్రామ సభ నిర్వహించి, పనులు ప్రారంభించగా, గ్రామంలోని మొత్తం 1300 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 80 రోజుల్లో కేవలం 600 ఎకరాలు మాత్రమే రీసర్వే పూర్తయ్యిందన్నారు. రైతులు భూ సర్వేకు ముందుకు వచ్చి సర్వే చేయించుకోవాలని సూచించారు. రైతులు సహకరిస్తే మిగతా భూమిని వేగంగా కొలిచి రికార్డులు సరి చేస్తామని, దీనివల్ల భవిష్యత్ లో రైతులకు ఎలాంటి భూ సమస్యలు తలెత్తకుండా స్పష్టమైన హక్కులు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల శ్రీనివాస్పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జీపీవో రాజు సర్వేయర్ రాజు, సంచార కార్యదర్శి రమ్య, రైతులు పాల్గొన్నారు.