Dharmaram | ధర్మారం, సెప్టెంబర్ 28 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో జుంజిపల్లి నారాయణ (60) అనే వృద్ధుడు ఒంటరితనంతో పాటు అనారోగ్యం బాధ భరించలేక బలవన్మరణం చెందాడు. నారాయణ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఎంబడి శ్రీకాంత్ కథనం ప్రకారం.. నారాయణకు భార్య రమ ఉండగా వీరి కాపురం కొన్ని సంవత్సరాల పాటు సవ్యంగా జరిగింది. వీరికి కొడుకులు రాజకుమార్, విజయ్ కుమార్, కూతురు జయ సంతానం ఉన్నారు. వీరందరికీ వివాహాలు జరిగాయి. కూతురు అత్తగారి ఇంటిలో ఉంటుండగా, ఇద్దరు కొడుకులు వేరువేరు ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లి నివసిస్తున్నారు. కాగా నారాయణ భార్య రమ తో గత 15 సంవత్సరాల క్రితం మనస్పర్ధలు రావడంతో ఆమె గోదావరిఖని లో నివాసముంటోంది.
దీంతో నారాయణ ఒంటరిగా కూలీ నాలీ చేస్తూ గ్రామంలోని తన ఇంటిలో ఒంటరిగా నివాసముంటున్నాడు. కాగా నారాయణకు గత మూడు నెలల క్రితం కాలికి గాయం కాగా శస్త్ర చికిత్స జరిగింది. దీంతో అతనికి సపరి చర్యలు చేసే వారు లేకపోవడం కాలికి గాయం మానకపోవడంతో ఒంటరితనాన్ని భరించలేక జీవితంపై విరక్తి చెంది సోమవారం ఉదయం ఇంటిలోనే అతని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి లోపల తలుపు గడియ వేసుకుని ఉండడంతో నారాయణ మంటల్లోనే ఆహుతయ్యాడు. సమాచారం తెలుసుకున్న ధర్మారం ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడి పెద్ద కొడుకు రాజకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.