Karimnagar | దసరా పాయే…పింఛన్లు రాకపాయే.. ఇంకెంతకాలం కాలయాపన.. ?
వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన పింఛను కోసం ఎదురుచూస్తున్న పేదలకు నిరీక్షణే మిగులుతోంది. అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన, వడపోత, ధ్రువీకరణ పేరుతో కాలయాపన చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- ‘చేయూత’ దరఖాస్తులు 24,634.. అర్హుల గుర్తింపు18,745
- మూడు అంచెల పరిశీలన పేరుతో సాగదీత..
- ఎప్పటి నుంచి పింఛన్లు ఇస్తారో చెప్పని సర్కారు
Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 23 : వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన పింఛను కోసం ఎదురుచూస్తున్న పేదలకు నిరీక్షణే మిగులుతోంది. అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన, వడపోత, ధ్రువీకరణ పేరుతో కాలయాపన చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఆశలు కల్పించిన ప్రభుత్వం.. ఇప్పుడు తుది జాబితా సిద్ధం చేసే ప్రక్రియలోనే నిమగ్నమైంది. దసరా నాటికి కొత్త పింఛన్లు అందుతాయని ఆశించిన దరఖాస్తుదారులకు నిరాశే ఎదురు కాగా, అర్హుల జాబితా ఎప్పుడు విడుదలపై జాప్యం కొనసాగుతూనే ఉంది. దీంతో, పింఛన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కరువైంది.
24 వేల పైచిలుకు దరఖాస్తులు..
కరీంనగర్ జిల్లాలో కొత్త చేయూత ఆసరా పింఛన్ల కోసం 24,634 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులను గుర్తించేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో మూడు అంచెల పరిశీలన చేపట్టారు. తొలుత పంచాయతీ కార్యదర్శులు, ఆ తర్వాత మండల అధికారులు, చివరగా జిల్లా స్థాయి అధికారులు దరఖాస్తులను పరిశీలించారు. అయినప్పటికీ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మరోవైపు, ఇప్పటికే 5,889 మందిని అనర్హులుగా గుర్తించగా, 398 దరఖాస్తులు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. దరఖాస్తులు సమర్పించి నెలలు గడుస్తున్నా పింఛను చేతికి అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
పరిశీలనల పేరుతో పేదలకు పరీక్షలా?
అర్హులకు అన్యాయం జరగకుండా పరిశీలన చేయడం అవసరమే. కానీ, ఆ ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది? ఎప్పటిలోగా పూర్తిచేస్తారు? అన్న విషయాల్లో స్పష్టత లేకపోవడం ఆందోళన ధరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు, సూపర్ చెకింగ్, ర్యాండమ్ వెరిఫికేషన్, అనుమానాస్పద దరఖాస్తుల క్రాస్ చెకింగ్ అంటూ అనేక దశల్లో పరిశీలన సాగుతోంది. ఐదుగురు డిజిగ్నేటెడ్ వెరిఫికేషన్ అధికారులు సైతం దస్త్రాలను తనిఖీ చేస్తున్నారు. ఇన్ని అంచెల పరిశీలన జరుగుతున్నా తుది జాబితా విడుదలలో జాప్యం ఎందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అనర్హుల ఏరివేత సరే.. అర్హుల సంగతేంటి?
మూడెకరాలకు పైగా భూమి, కారు ఉన్నవారు తప్పుడు వివరాలతో దరఖాస్తు చేసినట్లు గుర్తిస్తే తిరస్కరించడం సమంజసమే. వైకల్య శాతం నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా, సదరం ధ్రువపత్రం గడువు ముగిసినా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించాల్సిందే. అయితే అనర్హులను గుర్తించే తొందరలో నిజమైన అర్హులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తిరస్కరణకు గురైన దరఖాస్తులను మరోసారి పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నా, అర్హత ఉన్నప్పటికీ తిరస్కరణకు గురైన వారికి న్యాయం ఎప్పుడు జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
హామీలు సరే.. పింఛన్లు ఎప్పుడిస్తారు?
మరోవైపు, పింఛన్ల జాబితాలో తమవారి పేర్లు చేర్చాలంటూ కొందరు నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల పింఛన్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసి, రాజకీయ సిఫార్సులకు తావులేకుండా అర్హత ఆధారంగానే ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వృద్ధాప్య, బీడీ కార్మికులకు కొత్తగా పింఛన్లు పొందే అవకాశం కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు పింఛను ఆలస్యం కావడం మరింత భారంగా మారుతోంది. అర్హుల జాబితా సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమా? లేక అర్హుల చేతికి పింఛను అందించడమా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. పరిశీలన పూర్తయిన వెంటనే తుది జాబితాను ప్రకటించి, పింఛన్ల పంపిణీకి స్పష్టమైన తేదీ వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. హామీలతో కాలం గడపకుండా, అర్హులైన పేదలకు తక్షణమే ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Cheyutha
- dasara
- Karimnagar
- pensions
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

