శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 22, 2020 , 04:43:43

తిరుగులేని రాజకీయశక్తి టీఆర్‌ఎస్‌

తిరుగులేని రాజకీయశక్తి టీఆర్‌ఎస్‌
  • - అన్ని మున్సిపాలిటీలను కలియదిరిగిన మంత్రి ఎర్రబెల్లి
  • - చివరి క్షణం వరకూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తేతెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితిని తిరుగులేని రాజకీయ శక్తిగా మలచడమే కాదు, చివరి ఓటు వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం తొమ్మిది మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించడమే లక్ష్యంగా పోలింగ్‌కు ముందురోజు సైతం ప్రత్యేక వ్యూహాలు అమలు చేశారు. తొర్రూరు, జనగామ, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్‌ మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలతో, ముఖ్యనేతలతో మంగళవారం స్వయంగా సమావేశాలు నిర్వహించారు. డోర్నకల్‌, మరిపెడ, మున్సిపాలిటీలు ఉండే ఎమ్మెల్యేలతో, ముఖ్యనేతలకు గెలుపు వ్యూహంపై ప్రత్యేకంగా అన్నిమున్సిపాలిటీల బాధ్యులతో ఆయన చర్చించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం ఉదయమే పర్వతగిరి నుంచి తొర్రూరుకు వెళ్లారు. తొర్రూరులోని అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపు సాధించేలా పోలింగ్‌ వ్యూహం ఉండాలని స్థానిక నేతలకు సూచించారు. అక్కడి నుంచి జనగామకు వెళ్లారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం పరకాలకు వెళ్లారు.

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో సమావేశమయ్యారు. ఇప్పటికే పరకాల మున్సిపాలిటీపై ఏకపక్షంగా ఆధిపత్యం సాధించిన టీఆర్‌ఎస్‌ రికార్డు స్థాయిలోస్థానాలను గెలుచుకునేలా పోలింగ్‌ రోజున జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అక్కడి నుంచి భూపాలపల్లికి వెళ్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో చర్చించారు. టీఆర్‌ఎస్‌ విజయంతోనే భూపాలపల్లి సమగ్ర అభివృద్ధి సాధ్యమని అందరికీ తెలియజేశామని, అందరు అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలిచేలా వ్యూహం ఉండాలన్నారు. అనంతరం నర్సంపేటకు వెళ్లి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో సమావేశమయ్యారు. నర్సంపేటలోనూ టీఆర్‌ఎస్‌ గెలుపు ఏకపక్షంగా ఉంటుందనే సమాచారం ఉందని, దీన్ని సాధించాలన్నారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌రావు మహబూబాబాద్‌కు చేరుకుని మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటేలా పోలింగ్‌ వ్యూహం ఉండాలని సూచించారు. ఇక్కడ అన్ని వార్డుల్లో గులాబీ జెండా ఎగిరేలా సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు సూచించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎంపీ మాలోత్‌ కవిత ఈ సమావేశంలో ఉన్నారు. అనంతరం మంత్రి దయాకర్‌రావు తొర్రూరు మీదుగా పర్వతగిరి చేరుకున్నారు. డోర్నకల్‌, మరిపెడ మున్సిపాలిటీల్లో ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉంటుందని, సమన్వయంతో అన్ని స్థానాల్లో రికార్డు మెజారిటీతో గెలుపు సాధించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు సూచించారు.logo