న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 : ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలకు సమయం ముంచుకొస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. ఇరాన్ వద్ద ఇక ఏ మార్గమూ మిగల్లేదని, కీలక అంతర్జాతీయ జలమార్గాలపై నియంత్రణ ద్వారా ప్రపంచాన్ని స్వల్పకాలికంగా దోచుకోవడంపై మాత్రమే ఇరాన్ ఆధారపడుతున్నదని ట్రంప్ విమర్శించారు.
తమ వద్ద వేరే మార్గాలు లేవని ఇరానీయులు ఇంకా గ్రహించినట్లు లేరని ఆయన వ్యాఖ్యానించారు. వారు ఈ రోజు సజీవంగా ఉండడానికి ఏకైక కారణం చర్చలు జరపడమే అని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో శాంతి చర్చలు విఫలమైతే దాడులను పునరుద్ధరించడానికి శక్తివంతమైన ఆయుధాలతో అమెరికా యుద్ధ నౌకలను సిద్ధం చేస్తున్నట్లు న్యూయార్క్ పోస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరికలు జారీచేసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.