US warning : ఇరాన్ (Iran) పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా (USA) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇరాన్ ఎయిర్‌లైన్స్ (Iran Airlines) తో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని విదేశీ కంపెనీలను యూఎస్ ట్రెజరీ (Treasury) హెచ్చరించింది. మా హెచ్చరికలను కాదని ఎవరైనా ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో లావాదేవీలు జరిపితే.. వారు కూడా ఇరాన్‌తోపాటు ఆంక్షలు (Sanctions) ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక మంత్రి (Finance Minister) స్కాట్ బెసెంట్ (Scott Bessent) ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.
ఇప్పటికే ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్ విమానయాన సంస్థలతో లావాదేవీలు జరిపితే.. లావాదేవీలు జరిపిన ఆయా సంస్థలు కూడా ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెసెంట్ హెచ్చరించారు. విదేశీ ప్రభుత్వాల పరిధిలో ఉన్న కంపెనీలు ఇరాన్ విమానాలకు జెట్ ఇంధనం, క్యాటరింగ్, ల్యాండింగ్ ఫీజులు, నిర్వహణ వంటి సేవలను అందించకుండా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎకనామిక్ ఫ్యూరీ కింద ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేసేందుకు ఎలాంటి చర్యలకైనా యూఎస్ ట్రెజరీ వెనకాడదని స్పష్టంచేశారు.
ఇప్పటికే హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నది. ఇది టెహ్రాన్ ఆర్థిక పరిస్థితిపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. మరోవైపు అమెరికా- ఇరాన్ మలివిడత చర్చలపై అనిశ్చితి నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెరికా నుంచి తాజా హెచ్చరికలు రావడం గమనార్హం.