వాషింగ్టన్: తుపాకీ సంస్కృతికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో అమెరికా సేనేట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం దక్కింది. గన్ కంట్రోల్ బిల్లును ఎగుమ సభ పెద్దలు ఆమోదించారు. గడిచిన 30 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇది చాలా కీలకమైన బిల్లు అని నిపుణులు భావిస్తున్నారు. డెమోక్రాట్లకు తోడుగా 15 మంది రిపబ్లికన్లు జతకట్టడంతో… ఆ బిల్లుకు అనుకూలంగా 65 ఓట్లు పోలవ్వగా.. 33 మంది వ్యతిరేకించారు. ఇటీవల అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. న్యూయార్క్‌లోని సూపర్మార్కెట్లో, టెక్సాస్‌లోని ప్రైమరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 31 మంది మరణించారు. ఈ నేపథ్యంలో గన్ సంస్కృతికి వ్యతిరేకంగా అమెరికాలో భారీ స్పందన వచ్చింది. దానిలో భాగంగానే గన్ కంట్రోల్ బిల్లును సేనేట్‌లో చర్చించారు. సేనేట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెడుతారు. ఆ తర్వాత అధ్యక్షుడు బైడెన్ సంతకంతో అది చట్టంగా మారుతుంది.