కీవ్ : రష్యాతో దీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధానికి అవసరమైన నిధుల కోసం పోర్నోగ్రఫీ పరిశ్రమను చట్ట పరిధిలోకి తీసుకొచ్చి దానిపై పన్ను విధించాలని ఉక్రెయిన్ ప్రభుత్వం భావిస్తున్నది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఈ పన్ను వల్ల అదనంగా సుమారు రూ.236 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది. దీంతో సుమారు 30 వేల డ్రోన్లు కొనుగోలు చేయవచ్చు. పోర్నోగ్రఫీకి ప్రస్తుతం ఉక్రెయిన్లో పూర్తిగా చట్టబద్ధత లేదు. ప్రభుత్వానికి ఆదాయం పెంపొందించడంతో పాటు ఈ పరిశ్రమ ద్వారా పోలీసులు తీసుకొనే లంచాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో దీన్ని చట్ట పరిధిలోకి తేవాలనుకొంటున్నారు.
చట్టపరమైన చర్యల భయంతో ప్రస్తుతం ఈ పరిశ్రమలో పనిచేస్తున్నవారిలో చాలా మంది రహస్యంగా, విదేశాల నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పోర్నోగ్రఫీపై పన్ను విధించే చట్టానికి సంబంధించిన బిల్లును రెండో దశ చర్చ కోసం త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. పెద్దలకు మాత్రమే పరిమితమైన ఆన్లైన్ కంటెంట్ వ్యాపారం ఉక్రెయిన్లో వేగంగా పెరుగుతున్నది. ఓన్లీఫ్యాన్స్ లాంటి వేదికల్లో పెద్ద సంఖ్యలో ఉక్రెయినియన్ క్రియేటర్లు పని చేస్తున్నారు. ఓన్లీఫ్యాన్స్ ద్వారా 2023లో 8 వేల మంది ఉక్రెనియన్లు రూ.1,237 కోట్లు సంపాదించారు.