చిన్నారి పెండ్లి కూతుళ్లు.. 70 ఏండ్ల ముసలోళ్లతో పదేండ్ల చిన్నారుల పెండ్లిళ్లు

- అఫ్గాన్‌లో ఆడబిడ్డల్ని అమ్మేస్తున్న తల్లిదండ్రులు
- కుటుంబ పోషణ, ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం
- తాలిబన్ల పాలనలో దేశంలో దిగజారుతున్న పరిస్థితులు
కాబూల్, నవంబర్ 2: తాలిబన్ల పాలనలో ఆడబిడ్డలు మళ్లీ ఆటబొమ్మలవుతున్నారు. పెండ్లంటే ఏమిటో కూడా తెలియని పట్టుమని పదేండ్లు కూడా లేని పసిమొగ్గలు.. కాటికి కాలుచాపుకొని కూర్చున్న పండు ముసలోళ్లకు ఇల్లాల్లుగా మారుతున్నారు. ఆకలి బాధను తట్టుకోలేక, మిగతా కుటుంబాన్ని సాకడానికి.. కన్నతండ్రులే కడుపున పుట్టిన బిడ్డలను అమ్మకానికి పెడుతున్న దయనీయ పరిస్థితులు అఫ్గానిస్థాన్‌లో నిత్యకృత్యంగా మారాయి.
టీచర్ కావాలనుకొని చివరకు..
పర్వానా మాలిక్‌కు తొమ్మిదేండ్లు. బద్ఘీస్ ప్రావిన్సులోని ఓ ప్రాంతంలో 8 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. పెద్దయ్యాక టీచర్ కావాలన్న ఉద్దేశంతో బాగా చదువుకొంటున్నది. ఇంతలోనే అఫ్గాన్ తిరిగి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. పర్వానా చదువు మధ్యలోనే ఆగిపోయింది. తండ్రి అబ్దుల్ మాలిక్‌కు ఉపాధి కూడా కరువయ్యింది. ఆకలితో ఆ కుటుంబం రోజూ కాళరాత్రులను గడపాల్సి వచ్చింది. తాలిబన్లు పగ్గాలు చేపట్టడంతో దాతల సాయం కూడా నిలిచిపోయింది. దీంతో కుటుంబాన్ని కాపాడుకోవడానికి దిక్కులేని పరిస్థితుల్లో అబ్దుల్.. పర్వానాను అమ్మకానికి పెట్టాడు. ఖుర్భాన్ అనే 55 ఏండ్ల వ్యక్తి అమెను రూ. 1.65 లక్షలకు కొనుగోలు చేసి పెండ్లి చేసుకున్నాడు. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం అబ్దుల్ కుటుంబానికి గొర్రె లు, భూమితో పాటు డబ్బును ఇచ్చాడు. కూతురును అమ్మకానికి పెట్టడం తమకు సిగ్గుగా, బాధగా అనిపించిందని అయితే, మిగతా కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఈ పని చేయాల్సి వచ్చిందని అబ్దుల్ కన్నీరుమున్నీరయ్యారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో రెండు నెలల క్రితం తన 12 ఏండ్ల మరో కూతురిని కూడా ఇలాగే అమ్మేసినట్టు పేర్కొన్నాడు. కాగా, బాగా చదువుకొని పెద్దయ్యాక టీచర్ కావాలనుకున్నానని, అయితే పూట గడవకపోవడంతో తన కుటుంబం తనను అమ్మేసిందని పర్వానా ఏడుస్తూ చెప్పింది. తనను పెండ్లి చేసుకున్న వ్యక్తి కొడుతాడేమో, ఇంట్లో పనులు చేయిస్తాడేమోనంటూ భయాన్ని వ్యక్తం చేసింది.
మరణమే శరణ్యం
ఘోర్ ప్రావిన్సుకు చెందిన పదేండ్ల మగుల్ది కూడా మరో కన్నీటి వ్యథ. కుటుంబ పరిస్థితులు బాగోలేక, మగుల్ను ఆమె కుటుంబసభ్యులు డబ్బు కోసం 70 ఏండ్ల ఓ వృద్ధుడికిచ్చి ఇటీవల పెండ్లి చేశారు. అయితే, ఆ వృద్ధుడితో వెళ్లడం తనకు ఇష్టంలేదని మగుల్ ధీనంగా చెబుతున్నది. ఒకవేళ తనను కుటుంబసభ్యులు బలవంతంగా పంపించాలని ప్రయత్నిస్తే.. ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నది. పర్వానా, మగుల్ మాత్రమే కాదు.. అఫ్గాన్‌లోని దాదాపు ప్రతి పేద ఇండ్లల్లో ఇలాంటి ఘటనలే తారసపడుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Afganistan
- Talibans
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

