న్యూయార్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారీ సంఖ్యలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను రీకాల్ చేసింది. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య తలెత్తడంతో అమెరికాలో 3 లక్షల 63 వేల స్వయం ఛోదిత కార్లను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ లైట్ పడినప్పటికీ ఆగకుండా వెళ్లడంతోపాటు స్పీడ్ లిమిట్ నిబంధనలను పట్టించుకోవడం లేదని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) సర్వేలో తేలింది. ఇది భద్రతా పరమైన సమస్యగా మారిందని ప్రకటించింది. దీంతో ఆ కార్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని టెస్లాపై అమెరికా రక్షణ నియంత్రణ సంస్థ ఒత్తిడి తీసుకురావడంతో కంపెనీ ఈ మేరకు వెల్లడించింది.
కాగా, దేశంలోని 4 లక్షలకుపైగా పైగా టెస్లా కార్లను పరిశీలించామని ఎన్ఎహెచ్టీఎస్ఏ తెలిపింది. వారిలో చాలావరకు సిగ్నల్ పడినప్పటికీ ఆగకుండా వెళ్తున్నాయని, పసుపు లైటు వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్లడం వంటి ఉలంఘనలు జరుగుతున్నాయని వెల్లడించింది. తప్పనిసరిగా మళ్లాల్సి ఉన్నప్పుడుకూడా ఆ కార్లు నేరుగా వెళ్తున్నాయని ప్రకటించింది. రీకాల్ చేసిన కార్లలో మోడల్ ఎస్, 2016-23 మధ్య తయారైన మోడల్ ఎక్స్, 2013-23 మధ్య తయారైన మోడల్-3, 2020-23 మధ్య తయారైన మోడల్-వై కార్లు ఉన్నాయి.
కాగా, గతేడాది కూడా ఇలాంటి కారణాలతో అమెరికాలో 54 వేల కార్లను టెస్లా రీకాల్ చేసింది. వాటిలో ఎస్ సెడాన్, ఎక్స్ ఎస్యూవీ, మోడల్ 3 సెడాన్లు, మోడల్ వై ఎస్‌యూవీలు ఉన్నాయి. చైనాలో 2,85,000 వేల విద్యుత్ వాహనాలను వెనక్కి పిలిచింది. క్రూజ్ కంట్రోల్ వ్యవస్థలో సమస్యలు తలెత్తడంతో వాహనాల వేగం ఒక్కసారిగా పెరిగిపోతుండంతో వాటిని రీకాల్ చేసింది. అయితే టెస్లా డ్రైవర్లు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షిస్తున్నారని, కార్లు తమంతట తాముగా నడవలేవని అందువల్ల డ్రైవర్లు అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండాలని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం తలెత్తిన సమస్యను త్వరలోనే పరిష్కరించనున్నట్లు తెలిపింది.