న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ప్రపంచంలోనే అతి పెద్ద రాకెట్ ‘స్టార్‌షిప్’ ప్రయోగం విఫలమైంది. ఆకాశంలోకి దూసుకెళ్లిన కొన్ని నిమిషాలకే గాలిలోనే రాకెట్ పేలిపోయింది. చంద్రుడు, అంగారక యాత్ర కోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ టెస్ట్ ఫ్లైట్‌గా ఈ రాకెట్ ప్రయోగం చేపట్టింది. సోమవారమే దీన్ని ప్రయోగించేందుకు కసరత్తు చేసినా సాంకేతిక లోపంతో నిర్ణీత సమయానికి కొన్ని నిమిషాల ముందు ప్రయోగాన్ని నిలిపేశారు.
దీంతో గురువారం ఉదయం 8.33 గంటలకు అమెరికాలోని టెక్సాస్‌లోని బొకాచికా ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. రాకెట్ ఆకాశంలోకి వెళ్లిన 3 నిమిషాలకు బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్ వేరు కావాలి. కానీ, వేరు కాకపోవడంతో శాస్త్రవేత్తలు ఏదో లోపం జరిగిందని గుర్తించేలోగానే రాకెట్ పేలిపోయింది. ఈ సమయంలో ఆకాశంలో భారీగా మంటలు వ్యాపించాయి. కాగా, ఈ ప్రయోగం నుంచి పాఠాలు నేర్చుకుంటామని, త్వరలోనే మరోసారి ప్రయోగం చేపడతామని స్పేస్ఎక్స్ ప్రకటించింది.