న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను హాలీవుడ్ నటి జమీలా జమీల్ బండబూతులు తిట్టింది. తిట్ల దండకంతో తన ఇన్‌స్టా హ్యాండిల్లో పెద్ద వ్యాసాన్నే పోస్టు చేసింది. జమీలా జమీల్ గతంలో తన రాబోయే సిరీస్ ‘షీ హల్క్: అటార్నీ ఎట్ లా’ సందర్భంగా వార్తల్లో నిలిచింది. ఆ సిరీస్ కోసం ప్రచురించిన ప్రొడక్షన్ ఫొటోలో ఆమె హెయిర్‌స్టైల్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు రిషి సునాక్‌ను తిట్టి ఆమె మరోసారి వార్తల్లోకి వచ్చింది.
రిషి సునాక్.. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సామూహికంగా సమ్మె చేయకుండా అడ్డుకుంటున్నాడని, సమ్మెలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నాడని జమీలా మండిపడింది. దేశంలో ప్రజలకు సమ్మె చేసే స్వేచ్ఛ లేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు …………………….. కా..? అంటూ రాయలేని పదజాలాన్ని ఉపయోగించింది. రిషి సునాక్ది నాయకత్వం కాదని, నియంతృత్వం అని ఆగ్రహం వ్యక్తంచేసింది.
బతకడానికి సరిపడా వేతనాలు లేని వాళ్లు సమ్మెకు దిగారని, కానీ ఈ సంపన్న నియంత (బ్రిటన్ ప్రధాని) వారిని అణిచివేస్తున్నాడని జమీలా విమర్శించింది. ‘పే అండ్ ప్రొటెక్ట్ ద పీపుల్ హూ కీప్ యువర్ కంట్రీ ఫంక్షనింగ్ ఎ లివింగ్ వేజ్’ అంటూ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. ఇంకా చాలా బూతులు తిట్టిన జమీలా.. చివరగా రిషి సునాక్ ఆటలు తాము సాగనివ్వబోమని హెచ్చరించింది.