న్యూఢిల్లీ, జూలై 14 : 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. 24 గంటల్లో ఉక్రెయిన్‌ని రష్యా లొంగదీసుకుంటుందని ప్రపంచవ్యాప్తంగా సైనిక నిపుణులు తేల్చి చెప్పారు. అయితే 4 సంవత్సరాల, 4 నెలల, 18 రోజుల తర్వాత రష్యా స్వయంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. తమ దేశం కష్టాల్లో ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధకాలంలో మొదటిసారి బహిరంగంగా ఒప్పుకున్నారు.
2022 ఫిబ్రవరిలో దురాక్రమణ ప్రారంభించిన రష్యా నెల రోజుల్లో ఉక్రెయిన్ భూభాగంలోని దాదాపు 25% అంటే 1.52 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించుకుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ ప్రకారం ఆ తర్వాత ఉక్రెయిన్ క్రమంగా రష్యా దళాలను వెనక్కు నెట్టడం ప్రారంభించింది. ప్రస్తుతం రష్యా అధీనంలో 1.18 లక్షల చదరపు కిలోమీటర్ల ఉక్రెయిన్ భూభాగం ఉంది. కాగా, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారైన రష్యాలో ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. ఇందుకు రష్యన్ రిఫైనరీలపై ఉక్రెయిన్ జరిపిన కచ్చితత్వంతో కూడిన డ్రోన్ దాడులే కారణం. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముడి చమురు ఎగుమతిదారైన రష్యా ఇప్పుడు ప్రతి నెల 4 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్‌ని దిగుమతి చేసుకుంటోంది.
27,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న క్రిమియా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అత్యంత వ్యూహాత్మక అంశంగా మారింది. 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. అన్ని వైపులా నీటితో చుట్టుముట్టి ఉన్న క్రిమియాకు ఉత్తర భాగంలో ఉక్రెయిన్ను కలిపే కేవలం 5-7 కిలోమీటర్ల భూభాగం మాత్రమే ఉంది. క్రిమియాను చేరుకునేందుకు రష్యాకు మూడు మార్గాలు ఉన్నాయి. కాగా ఇప్పుడు ఆ మూడు మార్గాలను తెగ్గొట్టేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. యుద్ధంలో పరిస్థితులు ఉక్రెయిన్‌కు అనుకూలంగా మారడానికి ప్రధాన కారణాలు ఈ యుద్ధంలో యూరప్, అమెరికా దానికి మద్దతు ఇవ్వడమని చెప్పాలి.
ఉక్రెయిన్‌కు లొంగిపోవడం లేదా భారీ సైనిక ఎదురుదెబ్బలు తినడం వంటి ఓటమిని రష్యా ఇప్పట్లో చవిచూసే అవకాశం లేదు. ఇప్పటికీ రష్యా 20% ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకునే ఉంది. యుద్ధ రంగంలో 6 లక్షల మందికిపైగా సైనిక బలగాలు మోహరించి ఉన్నాయి. నాలుగేండ్ల యుద్ధం తర్వాత కూడా రష్యా ఆయుధ కొరతను ఎదుర్కోవడం లేదు. రష్యా వద్ద ప్రపంచంలోని అతి పెద్ద అణ్వస్త్ర ఆయుధాగారం ఉంది.