వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా సహా పలుదేశాల్లో కరోనాపై పోరాటంలో ముఖ్యంగా వాడుతున్న టీకా ఫైజర్. ఈ అమెరికా సంస్థ జర్మనీకి చెందిన బయాన్‌టెక్‌తో కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు అగ్రరాజ్యం సహా పలు పాశ్చాత్య దేశాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి.
ఈ క్రమంలో 12 ఏళ్లు పైబడిన వారికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని పరిశోధనల్లో తేలింది. దీంతో 5-11 సంవత్సరాల మధ్య ఉన్న చిన్నారులపై ఫైజర్ ఎంత మేర ప్రభావం చూపుతుందని పరిశోధకులు అధ్యయనం చేశారు. దీనిలో ఆశాజనక ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఫైజర్ కంపెనీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం 5 నుంచి 11 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులపై ఫైజర్ వ్యాక్సిన్ 90.7 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందట. అమెరికాలో ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు ఫైజర్ టీకాకు అత్యవసర అనుమతి లభించింది.
ఇప్పటి వరకూ 12 సంవత్సరాల వయసు పైబడిన వారిలో సుమారు 1.1 కోట్ల మందికి ఫైజర్ టీకా అందించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.