కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అక్కడ ఆంక్షలను సడలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను ఎత్తివేశారు. నవంబర్‌లో ఆ దేశంలో ఒమిక్రాన్ కేసులు టాప్‌గేర్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో నమోదు అయినా.. మరణాలు మాత్రం తక్కువగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అత్యధిక స్థాయిలో మ్యుటేషన్లతో ఆందోళన కలిగించిన ఒమిక్రాన్ వేరియంట్.. ఇతర వేరియంట్లతో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. గడిచిన వారం ఇన్ఫెక్షన్లు 30 శాతం తగ్గినట్లు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు వెల్లడించారు. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో.. చాలా స్వల్ప స్థాయిలో మరణాలు సంభవించినట్లు తెలిపారు.