సియాటిల్: పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనల్లో మార్పులను నిరసిస్తూ అమెజాన్ ఉద్యోగులు ఆందోళన ప్రారంభించారు. అమెరికాలోని సియాటెల్‌లో పలువురు ఉద్యోగులు విధులు బహిష్కరించి అమెజాన్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ప్రపంచవ్యాప్తంగా 1,816 మంది ఈ నిరసనలో పాల్గొన్నారని, సియాటిల్‌లోనే 873 మంది పాల్గొన్నట్టు ఉద్యోగులు తెలిపారు. సంస్థ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు తమ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చెప్పడానికే ఈ నిరసనకు దిగినట్టు చెప్పారు. కాగా, ఇటీవలి కాలంలో అమెజాన్ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు వారానికి మూడు రోజులు కార్యాలయాలకు కచ్చితంగా రావాలని ఉద్యోగులను ఆదేశించింది.